Kalyandurg: కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం!

Kalyandurg: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 73 సర్పంచ్ స్థానాలకు తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది.

P.Sudhakar, Kalyanadurgam
Published on: 26 Nov 2026 11:01 AM IST
Kalyandurg
X

Kalyandurg: కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం!

కళ్యాణదుర్గం: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల్లో సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. కళ్యాణదుర్గం, కంబదూరు, కుందుర్పి, శెట్టూరు, బ్రహ్మసముద్రం మండలాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. నియోజకవర్గ పరిధిలో మొత్తం 74 గ్రామ పంచాయతీలు ఉండగా, ఒక సర్పంచ్ స్థానం ఏకగ్రీవమైంది. మిగిలిన 73 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. సర్పంచ్ స్థానాలకు 170 మంది అభ్యర్థులు, వార్డు సభ్యుల స్థానాలకు 1,450 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఐదు మండలాల పరిధిలో మొత్తం 1,96,431 మంది గ్రామీణ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

మండలాల వారీగా పరిశీలిస్తే కళ్యాణదుర్గం మండలంలో 17 సర్పంచ్ స్థానాలకు 37 మంది అభ్యర్థులు, కంబదూరు మండలంలో 12 స్థానాలకు 26 మంది, శెట్టూరు మండలంలో 16 స్థానాలకు 38 మంది, కుందుర్పి మండలంలో 13 స్థానాలకు 36 మంది, బ్రహ్మసముద్రం మండలంలో 16 స్థానాలకు 33 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. బ్రహ్మసముద్రం మండలంలో ఒక సర్పంచ్ స్థానం ఏకగ్రీవం కావడంతో మిగిలిన 73 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు.

ఎన్నికల నిర్వహణకు అధికారులు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ పత్రాలు, బ్యాలెట్ పెట్టెలు, ఇతర ఎన్నికల సామగ్రిని సిద్ధం చేసి సిబ్బందిని నియమించారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగనుండగా, అనంతరం ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. లెక్కింపు పూర్తయిన తర్వాత ఫలితాలు వెల్లడించనున్నారు. సాయంత్రానికి ఐదు మండలాల్లోని గ్రామ పంచాయతీల్లో ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యుల వివరాలు వెలువడనున్నాయి.

P.Sudhakar, Kalyanadurgam

P.Sudhakar, Kalyanadurgam