Anantapur: ఎమ్మెల్యే దగ్గుపాటి ఆదేశంతో కృష్ణవేణి నామినేషన్ ఉపసంహరణ

Anantapur: అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆదేశాలతో 9వ డివిజన్ నుంచి టీడీపీ మహిళా నాయకురాలు జన్ని కృష్ణవేణి కార్పొరేటర్ నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 21 Oct 2026 3:43 PM IST
Anantapur
X

Anantapur: ఎమ్మెల్యే దగ్గుపాటి ఆదేశంతో కృష్ణవేణి నామినేషన్ ఉపసంహరణ

అనంతపురం: అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో రాజకీయ పరిణామం చోటుచేసుకుంది.తొమ్మిదవ డివిజన్ పరిధిలోని వినాయక నగర్‌కు చెందిన టీడీపీ మహిళా నాయకురాలు జన్ని కృష్ణవేణి తన కార్పొరేటర్ నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆదేశాల మేరకు, పార్టీకి ద్రోహం చేయకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె మీడియా సమావేశంలో వెల్లడించారు.

బుధవారం అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో నామినేషన్ ఉపసంహరించుకున్న అనంతరం కృష్ణవేణి మీడియాతో మాట్లాడారు. 2009 నుంచి తెలుగుదేశం పార్టీలో చురుకుగా పనిచేస్తున్నానని తెలిపారు. నగర మహిళా ఉపాధ్యక్షురాలిగా పనిచేయడంతో పాటు పార్టీ బలోపేతానికి కృషి చేశానన్నారు.తొమ్మిదవ డివిజన్‌లో జనరల్ మహిళకు అవకాశం రావడంతో కార్పొరేటర్‌గా పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేశానని చెప్పారు.

అయితే, కొన్ని కారణాల వల్ల తనకు అవకాశం దక్కలేదని, దీంతో తీవ్రంగా బాధపడ్డానని ఆవేదన వ్యక్తం చేశారు.అయినప్పటికీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌పై నమ్మకంతోనే నామినేషన్ ఉపసంహరించుకున్నానని కృష్ణవేణి స్పష్టం చేశారు.ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

రాబోయే రోజుల్లో తనకు నామినేటెడ్ పదవి కల్పిస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు.తాను ఇండిపెండెంట్‌గా పోటీ చేసినా గెలిచే సత్తా ఉందని, తొమ్మిదవ డివిజన్‌లో పూర్తి మెజారిటీ సాధించగలననే నమ్మకం ఉందని కృష్ణవేణి ధీమా వ్యక్తం చేశారు. అయితే, పార్టీకి విధేయంగా ఉండాలనే ఉద్దేశంతోనే పోటీ నుంచి తప్పుకున్నట్లు పేర్కొన్నారు.

దీర్ఘకాలంగా పార్టీ కోసం పనిచేసిన తన సేవలను అధిష్ఠానం గుర్తించి తగిన న్యాయం చేస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. నామినేషన్ ఉపసంహరించుకున్నప్పటికీ, టీడీపీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారంలో పాల్గొంటానని, ఇంటింటికీ తిరిగి పార్టీ విజయానికి కృషి చేస్తానని జన్ని కృష్ణవేణి వెల్లడించారు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM