Anantapur: నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్!

Anantapur: అనంతపురం జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల దాఖలు ప్రక్రియను కలెక్టర్ ఆనంద్ పరిశీలించారు.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 21 Oct 2026 1:02 PM IST
Anantapur
X

Anantapur: నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్!

Anantapur: అనంతపురం జిల్లా పరిధిలో జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు.అనంతపురంలోని జడ్పీ కార్యాలయంలో జరుగుతున్న జడ్పీటీసీ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ఆయన పరిశీలించారు.అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

అలాగే పోలీసు బందోబస్తుపై ఆరా తీశారు.ఈ సందర్భంగా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ..జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోందని తెలిపారు. మరోవైపు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ తుది దశకు చేరుకుందని, ఇప్పటికే నామినేషన్ల పరిశీలన పూర్తయిందని వెల్లడించారు.

తాడిపత్రి మున్సిపాలిటీ నుంచి ఒక ఫిర్యాదు అందిందని, దీనిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టామని కలెక్టర్ పేర్కొన్నారు.నామినేషన్లకు సంబంధించి నిబంధనల ప్రకారం ఎన్నికల రిటర్నింగ్ అధికారులు తుది నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు.ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నామని కలెక్టర్ తెలిపారు.

నామినేషన్ల ప్రక్రియ మొత్తాన్ని సీసీ కెమెరాల నిఘాలో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.మండల కేంద్రాల్లోని జడ్పీటీసీ నామినేషన్ కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని చెప్పారు.ఈ కెమెరాలను పోలీసు కంట్రోల్ రూమ్, కలెక్టరేట్ కంట్రోల్ రూమ్‌తో పాటు డేటా స్టోరేజ్ వ్యవస్థకు అనుసంధానం చేశామని తెలిపారు.నామినేషన్ల ప్రక్రియలో జరిగే ప్రతి అంశాన్ని రికార్డు చేస్తున్నామని కలెక్టర్ ఆనంద్ వివరించారు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM