Gooty: గుత్తిలో రెండో రోజు కొనసాగిన కరువు వ్యతిరేక సామూహిక దీక్షలు!

Gooty: గుత్తి తహశీల్దార్ కార్యాలయం ఎదుట కరువు సమస్యలపై అఖిలపక్షం ఆధ్వర్యంలో సామూహిక దీక్షలు రెండో రోజు కొనసాగింపు; జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్.

V.LALU NAIK, GUNTAKAL
Published on: 22 Sept 2026 1:53 PM IST
Gooty
X

Gooty: గుత్తిలో రెండో రోజు కొనసాగిన కరువు వ్యతిరేక సామూహిక దీక్షలు!

Gooty: కరువు పరిస్థితుల నేపథ్యంలో రైతులు, వ్యవసాయ కూలీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సీపీఐ, సీపీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో గుత్తి తహసీల్దార్ (ఎంఆర్ఓ) కార్యాలయం ఎదుట చేపట్టిన సామూహిక దీక్షలు మంగళవారం రెండో రోజు కొనసాగాయి.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లాను జాతీయ కరువు విపత్తు జిల్లాగా ప్రకటించి ప్రత్యేక సహాయ చర్యలు చేపట్టాలని కోరారు.

కరువు ప్రభావిత ప్రాంతాల విద్యార్థులకు అన్ని రకాల ఫీజులను రద్దు చేయాలని, గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి గ్రామానికి తాగునీటి సౌకర్యం కల్పించాలని, ప్రతి మండలంలో పశుగ్రాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కరువు ప్రభావిత రైతుల బ్యాంకు రుణాలను మాఫీ చేయడంతో పాటు, చిన్న మరియు సన్నకారు రైతులకు నెలకు రూ.10 వేల చొప్పున కరువు పింఛన్ అందించాలని కోరారు.

అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు లేని కూలీలకు ఉపాధి హామీ పథకం ద్వారా రోజుకు రూ.700 వేతనంతో పనులు కల్పించాలని, పంట నష్టపోయిన రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. గతంలో ఇచ్చిన హామీల మేరకు చెరువులు, కుంటలు, చెక్‌డ్యామ్‌లకు నీటి సరఫరా చర్యలు చేపట్టాలని కోరారు.

కరువు పరిస్థితుల్లో రైతులు, వ్యవసాయ కూలీలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుని వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని నాయకులు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి రామదాసు, సీనియర్ నాయకులు రమేష్‌బాబు, రైతు సంఘం అధ్యక్షుడు వెంకటరాముడు, పట్టణ సహాయ కార్యదర్శి నజీర్, మహిళా సమాఖ్య నియోజకవర్గ కార్యదర్శి మహమ్మద్, కేవీపీఎస్ మండల కార్యదర్శి మల్లికార్జున, బి. రామకృష్ణ, ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి నవీన్ యాదవ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుత్తి టౌన్ కన్వీనర్ మధుసూదన్ రెడ్డి, మాజీ సర్పంచ్ హుస్సేన్ పీరా, రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి మల్లయ్య యాదవ్, జిల్లా ఉపాధ్యక్షురాలు చంద్రగిరి రాధా యాదవ్, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు బిందె వరలక్ష్మి, బిందె గురుప్రసాద్ యాదవ్, శ్రీదేవి, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రామాంజనేయులు, మండల కార్యదర్శి ధనుంజయతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

V.LALU NAIK, GUNTAKAL

V.LALU NAIK, GUNTAKAL