Kadiri: కదిరిలో వైసీపీకి బిగ్ షాక్: టీడీపీలో చేరిన 250 కుటుంబాలు!
Kadiri: సత్యసాయి జిల్లా కదిరిలో వైఎస్సార్సీపీకి భారీ షాక్! ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సమక్షంలో నిజాంవలి కాలనీకి చెందిన 250 కుటుంబాలు టీడీపీలో చేరాయి.
Kadiri: కదిరిలో వైసీపీకి బిగ్ షాక్: టీడీపీలో చేరిన 250 కుటుంబాలు!
Kadiri: సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ప్రజాదరణ రోజురోజుకూ పెరుగుతోందని, కూటమి ప్రభుత్వ పాలనపై విశ్వాసంతో అన్ని వర్గాల ప్రజలు టీడీపీ వైపు అడుగులు వేస్తున్నారని కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ అన్నారు.
కదిరి మున్సిపాలిటీ పరిధిలోని నిజాంవలి కాలనీ నూతన 18, 19వ వార్డులకు చెందిన సుమారు 250 వైసీపీ కుటుంబాలు ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా టీడీపీ కుటుంబంలోకి ఆహ్వానించారు. స్థానిక వార్డు నాయకులు హైదర్ వలి, ఇలాహీ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మాట్లాడుతూ.. నిజాంవలి కాలనీలో గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలోనే అభివృద్ధి పనులు జరిగాయని పేర్కొన్నారు. కాలనీలో మౌలిక వసతులను మరింత మెరుగుపరచడానికి కృషి చేస్తామని, బీడీ కార్మికుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా, ఉపాధి అవకాశాలు పెరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
గతంలో నిజాంవలి కాలనీకి మున్సిపల్ చైర్మన్ పదవిని సైతం కల్పించి రాజకీయంగా తగిన ప్రాధాన్యత ఇచ్చామని గుర్తుచేశారు. తెలుగుదేశం పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం, గుర్తింపు ఉంటాయని స్పష్టం చేశారు.
స్థానిక ఎన్నికల్లో వైసీపీకి ప్రజలే బుద్ధి చెబుతారు
రాష్ట్రంలో ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మున్సిపాలిటీల అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని ఎమ్మెల్యే విమర్శించారు. ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించకుండా చెత్తపై కూడా పన్నులు విధించిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదేనని ఎద్దేవా చేశారు. గత పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో నష్టపోయిందని మండిపడ్డారు.
ముస్లిం మైనార్టీ సోదరులు పెద్ద సంఖ్యలో మార్పును కోరుకుంటూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంపై నమ్మకంతో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి ముస్లిం మైనార్టీలు సహా అన్ని వర్గాల ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ధీమా వ్యక్తం చేశారు.
పులివెందుల నుంచి కదిరి వరకు వైసీపీ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని, ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగే ఎన్నికల్లో వైసీపీకి ప్రజలే తగిన సమాధానం చెబుతారని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ స్పష్టం చేశారు.




