Penukonda: బాచన్నపల్లిలో 1000 ఏళ్ల నాటి అరుదైన వీరగల్లు లభ్యం

Penukonda: గోరంట్ల మండలం బాచన్నపల్లిలో నోలంబ పల్లవుల కాలం నాటి (సా.శ. 10వ శతాబ్దం) అరుదైన వీరగల్లు శిలాశాసనాన్ని చరిత్రకారుడు మైనాస్వామి గుర్తించారు.

K.UDAY BHANU, PENUKONDA
Published on: 10 Oct 2026 9:48 PM IST
Penukonda
X

Penukonda: బాచన్నపల్లిలో 1000 ఏళ్ల నాటి అరుదైన వీరగల్లు లభ్యం

పెనుకొండ నియోజకవర్గం: శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ నియోజకవర్గం, గోరంట్ల మండలం వానవోలు గ్రామ పంచాయతీ పరిధిలోని బాచన్నపల్లి గ్రామంలో సుమారు 1000 సంవత్సరాల నాటి (సా.శ. 10వ శతాబ్దం) అత్యంత అరుదైన ప్రాచీన వీరగల్లు శిలాశాసనం వెలుగుచూసినట్లు చరిత్రకారుడు మైనాస్వామి శనివారం నాడు విలేఖరులకు తెలిపారు.

గ్రామస్థుల ఆహ్వానంమేరకు బాచన్నపల్లిలో చేపట్టిన క్షేత్రస్థాయి పరిశోధనల్లో భాగంగా.. వీరగల్లు శిలాఫలకాన్ని గుర్తించి,అందులోని ప్రాచీన లిపి, శిల్ప విశేషాలను పరిశీలించారు. గ్రామానికి తూర్పున శిథిల శివాలయం పక్కనే అత్యంత ప్రాచీన వీరగల్లును గుర్తించినట్టు,ఆ స్మారక శిలలోని వీరుని శిల్పరూపురేఖలను బట్టి నోలంబపల్లవుల కాలానికిచెందిన వీరుడని ఆయన వివరించారు.

నోలంబ పల్లవుల రాజధాని-హెంజేరు(నేటి హేమావతి),పరిసరల్లో మినహా ఈ ప్రాంతంలో నోలంబ వీరగల్లులు కనిపించడం అరుదైన విషయమని మైనాస్వామి పేర్కొన్నారు.బాచన్నపల్లికి కనీసం 1400 సంవత్సరాల చరిత్ర వుండి వుంటుందని,విశ్వవిద్యాలయాలకే పరిమితమైన చరిత్ర పరిశోధకులు,అధ్యయనకారులు మరియు భారత సర్వేక్షణ నిపుణులు బాచన్నపల్లి వంటి గ్రామాలను సందర్శించాలని చరిత్రకారుడు విజ్ఞప్తిచేశారు.

ధనుర్ధారి వీరుడు: వీరగల్లు గురించి మైనాస్వామి వివరణ ఈ విధంగా వుంది. “వీరశిల మధ్యభాగంలో విల్లంబులు ధరించిన పరాక్రమవంతుడైన ధనుర్ధారి శిల్పం చెక్కబడి ఉంది. వీరుడు ఎడమచేతితో ఎత్తైన ధనుస్సును పట్టుకొని, కుడిచేతితో బాణం సంధిస్తూ శత్రువులపైకి దూసుకెళ్తున్న యుద్ధ భంగిమలో కనిపిస్తున్నాడు.తలపై ఎత్తైన కొప్పు, నడుముకు చుట్టిన కచ్చ, బాకు నాటి యోధుల సమర వేషధారణను ప్రతిబింబిస్తున్నాయి.

నోలంబవాడి సరిహద్దుల్లో గ్రామంపై శత్రుసేనలు లేదా దోపిడీ ముఠాలు దాడి చేసినప్పుడు, గ్రామాన్ని కాపాడడానికి పోరాడి వీరుడు వీరమరణం పొందాడని తెలుస్తోంది.శిలాఫలకం పైభాగపు అర్ధచంద్రాకార శిఖరంలో నాలుగు పంక్తులు, శిల్పం పాదాల కింద నాలుగు పంక్తులు - మొత్తం ఎనిమిది వరుసలలో ప్రాచీన తెలుగు-కన్నడలిపిలో శాసనo చెక్కబడిoది.

మొదటి వరుసలో గుండ్రటి వంపులతో కూడిన మంగళప్రదమైన ‘స్వస్తి శ్రీ’ తో శాసనం ఆరంభమై,నాటి పాలకుల వివరాలను తెలియజేస్తోంది. సదరు వీరుని త్యాగానికి గుర్తింపుగా ఆయన కుటుంబానికి పాలకులు పన్ను మినహాయింపుతో భూమిని మాన్యంగా బహూకరించివుండవచ్చు.ఆ భూదానాన్ని ‘రక్తకొడగ’(రక్తమాన్యం) అంటారని చరిత్రకారుడు విశ్లేషించారు.

రాయలసీమ సరిహద్దు ప్రాంతాలలో శిల్పంతో పాటు ఇంతటి సమగ్రమైన, ప్రాచీన లిపితో కూడిన సుదీర్ఘ వీరగల్లు శాసనాలు లభించడం అత్యంత అరుదని మైనాస్వామి పేర్కొన్నారు.బహిరంగ ప్రదేశంలో వున్న ఈ అమూల్యమైన చారిత్రక సంపదను సంరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుందని ఆయన స్పష్టం చేశారు.గ్రామస్థులు క్రిష్ణమూర్తి,సంతోష్,శంకరప్ప,నరసింహమూర్తి, నాగభుషణ,నగేష్,హరి తదితరులు చారిత్రక అన్వేషణలో పాల్గొన్నారు.

K.UDAY BHANU, PENUKONDA

K.UDAY BHANU, PENUKONDA