Mangalagiri: స్థానిక ఎన్నికలను అడ్డుకునేందుకు వైసీపీ కుట్రలు: పట్టాభిరామ్
Mangalagiri: స్థానిక ఎన్నికలను అడ్డుకునేందుకు వైసీపీ కుట్ర చేస్తోందని, ఎన్నికలు ఆగితే రూ.12,500 కోట్ల కేంద్ర నిధులు నిలిచిపోతాయని పట్టాభిరామ్ ఆరోపించారు.
Mangalagiri: స్థానిక ఎన్నికలను అడ్డుకునేందుకు వైసీపీ కుట్రలు: పట్టాభిరామ్
Mangalagiri: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకునేందుకు వైఎస్సార్సీపీ కుట్రలు చేస్తోందని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాల్సిన సమయంలో వైసీపీ దాడులు, హింసకు పాల్పడుతోందని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలు సకాలంలో జరగకపోతే 16వ ఆర్థిక సంఘం ద్వారా రాష్ట్రానికి రావాల్సిన సుమారు రూ.12,500 కోట్ల నిధులు కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, ప్రస్తుతం సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారని పట్టాభిరామ్ తెలిపారు. ఈ ప్రక్రియను అడ్డుకునేందుకు వైసీపీ గతంలో కోర్టులను ఆశ్రయించిందని, ఇప్పుడు ఎన్నికల సందర్భంగా హింసకు పాల్పడుతోందని ఆరోపించారు.
పుంగనూరు, కడప, రాయచోటి ప్రాంతాల్లో పంజాబ్ సహా ఇతర రాష్ట్రాల నుంచి కిరాయి రౌడీలు, షార్ప్ షూటర్లను రప్పించి భయానక వాతావరణం సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. చిత్తూరులో వాకర్ సాయంతో నామినేషన్ వేయడానికి వచ్చిన వృద్ధ మహిళా అభ్యర్థిపై దాడి చేసి, నామినేషన్ పత్రాలు లాక్కున్నారని పేర్కొన్నారు. ఈ ఘటనకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డిల అండ ఉందని ఆరోపించారు.
వైసీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారన్న ఆరోపణల్లో వాస్తవం లేదని పట్టాభిరామ్ అన్నారు. రాష్ట్రంలోని 100 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 23 వేలకు పైగా నామినేషన్లు దాఖలయ్యాయని తెలిపారు. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం, డిప్యూటీ సీఎం నియోజకవర్గాల్లోనూ వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేశారని పేర్కొన్నారు.
ఎంపీటీసీ ఎన్నికల్లో 9,829 స్థానాలకు గాను మొదటి రోజు 5,267 నామినేషన్లు దాఖలయ్యాయని, వీటిలో టీడీపీ నుంచి 2,719, వైసీపీ నుంచి 1,918 ఉన్నాయని వివరించారు. 659 జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి మొదటి రోజు 409 నామినేషన్లు రాగా, టీడీపీ నుంచి 128, వైసీపీ నుంచి 192 నామినేషన్లు దాఖలయ్యాయని తెలిపారు. ఇన్ని నామినేషన్లు దాఖలైనప్పటికీ ఎన్నికలకు అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ వైసీపీ నేతలు ఆరోపణలు చేయడం సరికాదన్నారు.
2020-21లో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవాలు జరిగాయని, అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారని పట్టాభిరామ్ గుర్తుచేశారు. నాడు ఎన్నికల కమిషన్‌పై విమర్శలు చేసిన జగన్.. ఇప్పుడు అదే కమిషన్‌ను ఆశ్రయించడం ఏమిటని ప్రశ్నించారు.
సుప్రీంకోర్టు ఆదేశాలను వైసీపీ వక్రీకరిస్తూ ఎన్నికలు వాయిదా పడ్డాయని తప్పుడు ప్రచారం చేస్తోందని పట్టాభిరామ్ ఆరోపించారు. పిటిషనర్ వినతిపత్రాలను పరిశీలించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ తగిన నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని తెలిపారు. ఆదేశాల మేరకు అభ్యర్థుల తుది జాబితా ప్రకటనకు రెండు రోజుల గడువు తీసుకున్న ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం గౌరవిస్తుందని చెప్పారు.
ఎన్నికల సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బెదిరింపులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపాలిటీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, పంచాయతీల్లో కూటమి అభ్యర్థులకు మద్దతివ్వాలని పట్టాభిరామ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు...




