Mangalagiri: మంగళగిరిలో వైసీపీ నీ వీడి.. టీడీపీలో చేరిన పలువురు కీలక నేతలు!
Mangalagiri: మంగళగిరిలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరిన మునగాల మల్లేశ్వరరావు, జక్కిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి సహా పలువురు నేతలు, కుటుంబాలు.
Mangalagiri: మంగళగిరిలో వైసీపీ నీ వీడి.. టీడీపీలో చేరిన పలువురు కీలక నేతలు!
మంగళగిరి: స్థానిక సంస్థల ఎన్నికల వేళ మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీకి చెందిన పలువురు సీనియర్ నేతలు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. విద్య, ఐటీ శాఖల మంత్రి, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ సమక్షంలో మంగళగిరి, తాడేపల్లి, ఉండవల్లి ప్రాంతాలకు చెందిన నేతలు టీడీపీ కండువాలు కప్పుకున్నారు.
మంగళగిరి పట్టణ వైసీపీ మాజీ అధ్యక్షుడు, మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ మునగాల మల్లేశ్వరరావు, ఆయన సతీమణి, మార్కెట్ యార్డు మాజీ ఛైర్మన్ టీడీపీలో చేరారు. తాడేపల్లి రూరల్ ఉండవల్లికి చెందిన మాజీ ఎంపీటీసీ కళ్లం సంజీవ్ రెడ్డితో పాటు కళ్లం సాంబిరెడ్డి, కళ్లం శ్రీనివాసరెడ్డి సహా ఆరు కుటుంబాలు టీడీపీలో చేరాయి.
తాడేపల్లి పట్టణానికి చెందిన వైసీపీ సీనియర్ నేత, దుర్గగుడి ట్రస్ట్ బోర్డు మాజీ ప్రత్యేక ఆహ్వానితుడు, స్టేట్ రెడ్డి కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ జక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు సూరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, సూరెడ్డి శ్రీనివాసరెడ్డి, కొల్లి లక్ష్మారెడ్డి, బొమ్మి కోటిరెడ్డి సహా నాలుగు కుటుంబాలు టీడీపీలో చేరాయి. వైసీపీ నేత దొంతిరెడ్డి వినయ్ కుమార్ రెడ్డితో పాటు మరో రెండు కుటుంబాలు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి.
మంగళగిరి రూరల్ నిడమర్రుకు చెందిన వైసీపీ సీనియర్ నేత కట్టెపోగు బాబురావుతో పాటు ఆరు కుటుంబాలు, యర్రబాలెంకు చెందిన గుంటూరు బ్రాహ్మణ సంఘం కార్యదర్శి వేమవరపు నారాయణతో పాటు ఐదు కుటుంబాలు టీడీపీలో చేరారు. ఉండవల్లిలో జరిగిన కార్యక్రమంలో కొత్తగా చేరిన వారందరికీ మంత్రి లోకేష్ పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. వైసీపీ నేతలు టీడీపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. ఎన్నికల ముందు, తర్వాత తనకు మంగళగిరి అభివృద్ధే ప్రధాన లక్ష్యమని చెప్పారు. ప్రజలు తనను 91 వేల మెజార్టీతో గెలిపించారని, దీంతో తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు.
మంగళగిరిని దేశంలోనే నంబర్ వన్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఇచ్చిన హామీ మేరకు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని లోకేష్ తెలిపారు. ఆసుపత్రుల నుంచి స్మశాన వాటికల వరకు అభివృద్ధి చేస్తున్నామని, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీరు, గ్యాస్ వంటి సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. రెండేళ్లలో అన్ని పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
మంగళగిరి ప్రజలు తనను గుండెల్లో పెట్టుకుని ఆదరించారని, అందుకు ప్రతిగా నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కష్టపడుతున్నానని లోకేష్ అన్నారు. భవిష్యత్ తరాలు కూడా మంగళగిరి అభివృద్ధి గురించి చెప్పుకునేలా పనిచేయాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని, సమస్యలు ఉంటే కలిసి పరిష్కరించుకుందామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనుంజయ్, పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీ దేవి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆకుల జయసత్య, నియోజకవర్గ పరిశీలకులు ముమ్మిడి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.




