Amaravati: మోదీ నాయకత్వంలో దేశం అద్భుత ప్రగతి..బీజేపీ నేత యామినీ శర్మ!
Amaravati: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని కొనియాడిన బీజేపీ నేత యామినీ శర్మ. అక్టోబర్ 7న దేశవ్యాప్తంగా భారీ బైక్ ర్యాలీలతో 'సేవా జ్యోతి యాత్ర'.
Amaravati: మోదీ నాయకత్వంలో దేశం అద్భుత ప్రగతి..బీజేపీ నేత యామినీ శర్మ!
Amaravati: బీజేపీ నేత యామినీ శర్మ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని కొనియాడారు. సుదీర్ఘకాలంగా నిరంతర ప్రజాసేవలో, ప్రభుత్వాధినేతగా కొనసాగుతున్న నాయకుడిగా మోదీ చారిత్రాత్మక రికార్డు సృష్టించారని అన్నారు. కుటుంబ రాజకీయాలకు భిన్నంగా 140 కోట్ల మంది భారతీయులనే తన కుటుంబంగా భావిస్తూ మోదీ పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. సబ్‌కా సాత్–సబ్‌కా వికాస్–సబ్‌కా విశ్వాస్–సబ్‌కా ప్రయాస్ స్ఫూర్తితో సమాజంలోని చివరి వ్యక్తికి కూడా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
దేశ భద్రత విషయంలో మోదీ ప్రభుత్వం ఎలాంటి రాజీకి తావివ్వడం లేదని యామినీ శర్మ అన్నారు. బలహీనంగా ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక శక్తుల్లో ఒకటిగా తీర్చిదిద్దే దిశగా కేంద్రం చర్యలు చేపడుతోందన్నారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో దేశ ప్రగతిని అడ్డుకునేందుకు దేశంలోనూ, విదేశాల్లోనూ కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. అయినప్పటికీ మోదీ నాయకత్వంపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరుగుతోందని చెప్పారు.
సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు యామినీ శర్మ తెలిపారు. రక్తదాన శిబిరాలు, అంగన్‌వాడీ కార్యక్రమాలు, యువత కోసం ఇన్నోవేషన్, స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. స్టార్టప్‌లు, ఇన్నోవేషన్, నైపుణ్యాలను ప్రోత్సహించేందుకు రూ.5.4 కోట్ల ప్రైజ్ మనీతో ఇన్నోవేషన్ ఛాలెంజ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
అక్టోబర్ 7న దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో భారీ బైక్ ర్యాలీలతో సేవా జ్యోతి యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. విజయవాడలో ఉదయం 10 గంటల నుంచి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సేవా జ్యోతి యాత్ర, బైక్ ర్యాలీలను ప్రజలకు విస్తృతంగా చేరేలా మీడియా సహకరించాలని ఆమె కోరారు.
గతంలో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలను నేరుగా ప్రజల వద్దకు తీసుకెళ్లామని, దీంతో పథకాలపై అవగాహన పెరిగిందని యామినీ శర్మ అన్నారు. కాంగ్రెస్ వంటి కొన్ని రాజకీయ కుటుంబాలకు అధికారం అలంకారంగా కనిపిస్తే, మోదీకి అధికారం అంటే పేద ప్రజలకు సేవ చేయాలనే సంకల్పమని వ్యాఖ్యానించారు. మోదీ మరింత కాలం ప్రజా జీవితంలో కొనసాగి దేశ ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అండగా నిలుస్తోందని యామినీ శర్మ తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన సందర్భంగా రాయలసీమలో హార్టికల్చర్ క్లస్టర్ అభివృద్ధికి సంబంధించిన పెట్టుబడుల ప్రణాళికపై వివరించారని చెప్పారు. కేంద్ర, రాష్ట్రాల్లో ఎన్‌డీఏ ప్రభుత్వాల సమన్వయంతో ఏపీ అభివృద్ధి వేగవంతమవుతోందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగస్వామ్యం చేయడం శుభ పరిణామమని అన్నారు.
కేంద్రం–రాష్ట్రం సమన్వయంతో అభివృద్ధి సాధ్యమవుతుందనడానికి ఆంధ్రప్రదేశ్ ఉదాహరణగా నిలుస్తోందని యామినీ శర్మ పేర్కొన్నారు. భారతదేశ అభివృద్ధి, మోదీ నాయకత్వంపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి, విశ్వాసం పెరుగుతోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మీడియా ఇంఛార్జి కిలారి దిలీప్ పాల్గొన్నారు.




