మిషన్ కర్మయోగిపై విజయవాడలో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సు..
Amaravati: విజయవాడలో సెప్టెంబర్ 29, 30 తేదీల్లో మిషన్ కర్మయోగి దక్షిణాది ప్రాంతీయ వర్క్‌షాప్. ప్రారంభించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్.
మిషన్ కర్మయోగిపై విజయవాడలో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సు..
అమరావతి: ప్రభుత్వ ఉద్యోగుల్లో సామర్థ్యాన్ని పెంచడం, పరిపాలనా నైపుణ్యాలను మరింత మెరుగుపరచడం లక్ష్యంగా మిషన్ కర్మయోగిపై దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ వర్క్‌షాప్ విజయవాడలో జరగనుంది. ఈ నెల 29, 30 తేదీల్లో రెండు రోజుల పాటు విజయవాడలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కళావేదికలో ‘సాధనా శృంఖలా’ పేరుతో ఈ ప్రాంతీయ సదస్సును నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒడిశా, పుదుచ్చేరికి చెందిన అధికారులు, ప్రభుత్వ శిక్షణ సంస్థల ప్రతినిధులు, సంబంధిత భాగస్వాములు ఈ వర్క్‌షాప్‌లో పాల్గొననున్నారు. ఈ నెల 29న ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభం కానుంది. ఉదయం 10.30 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభోపన్యాసం చేయనున్నారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కూడా సదస్సుకు హాజరుకానున్నారు.
మిషన్ కర్మయోగిలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు అందించే శిక్షణను మరింత సమర్థవంతంగా మార్చడం, ప్రభుత్వ శిక్షణ సంస్థల సామర్థ్యాన్ని పెంచడం వంటి అంశాలపై సదస్సులో ప్రధానంగా చర్చించనున్నారు. ఉద్యోగుల నైపుణ్యాభివృద్ధి, పరిపాలనా సామర్థ్యాల పెంపు, ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా శిక్షణా విధానాల్లో మార్పులు తీసుకురావడంపై నిపుణులు తమ అభిప్రాయాలను వెల్లడించనున్నారు.
‘ఉన్నతి’ కార్యక్రమం ద్వారా సామర్థ్యాలను పెంచేందుకు ఐగాట్, మిషన్ కర్మయోగి వేదికను ఎలా వినియోగించుకోవచ్చన్న అంశంపై ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనున్నారు. అలాగే మిషన్ కర్మయోగి క్వాలిటీ ఫ్రేమ్‌వర్క్, కర్మయోగి కర్తవ్య కార్యక్రమం కింద వివిధ శిక్షణా సంస్థల నిర్వహణకు సంబంధించిన ముసాయిదా ఫ్రేమ్‌వర్క్‌పై కూడా చర్చ జరగనుంది.
వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న శిక్షణా విధానాలు, ఉద్యోగుల సామర్థ్యాన్ని పెంచేందుకు తీసుకుంటున్న చర్యలపై ఆయా రాష్ట్రాల ప్రతినిధులు ప్రజెంటేషన్లు ఇవ్వనున్నారు. అంతర్రాష్ట్ర బృందాల కార్యకలాపాలు, ప్రశ్నోత్తరాల కార్యక్రమాల ద్వారా రాష్ట్రాలు తమ అనుభవాలను, ఆచరణలో విజయవంతమైన విధానాలను పరస్పరం పంచుకోనున్నాయి.
రెండో రోజు నిపుణుల సమావేశాలు
సెప్టెంబర్ 30న నిపుణుల సమావేశాలు, రాష్ట్రాల ప్రజెంటేషన్లు, బృంద చర్చలు కొనసాగనున్నాయి. వివిధ రాష్ట్రాల అనుభవాల ఆధారంగా శిక్షణా విధానాలను మరింత మెరుగుపరిచే అంశాలపై చర్చించి, పరిపాలనలో ఉత్తమ విధానాలను పరస్పరం అనుసరించే అవకాశాలను పరిశీలించనున్నారు.
ప్రభుత్వ శిక్షణ సంస్థలు కేవలం ఉద్యోగులకు కోర్సులు నిర్వహించే కేంద్రాలుగా కాకుండా.. ఆయా శాఖల పనితీరును మెరుగుపరిచే భాగస్వాములుగా ఎదగాలన్నది ఈ వర్క్‌షాప్ ప్రధాన ఉద్దేశంగా అధికారులు చెబుతున్నారు. శిక్షణ ద్వారా ఉద్యోగుల్లో నైపుణ్యాలను పెంచడంతో పాటు.. ఆ నైపుణ్యాలు ప్రజలకు అందే ప్రభుత్వ సేవల్లో ప్రతిఫలించేలా విధానాలను రూపొందించడంపై దృష్టి సారించనున్నారు.
దక్షిణాది రాష్ట్రాల మధ్య పరిపాలనా అనుభవాలు, శిక్షణా పద్ధతులు, ఉత్తమ విధానాల మార్పిడికి విజయవాడ వేదికగా నిలవనుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ ప్రాంతీయ కార్యశాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు, నిపుణులు, మిషన్ కర్మయోగి ప్రతినిధులు పాల్గొని పలు అంశాలపై చర్చించనున్నారు.




