AP: తిరువూరు, దెందులూరు వివాదాలపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా ఆరా!

AP: తిరువూరు నేతల మధ్య విభేదాలు, దెందులూరు టోల్‌ప్లాజా ఘటనపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సమగ్ర విచారణ జరిపి నేతలకు కీలక ఆదేశాలిచ్చారు.

Hari Kishan  AP Bureau Chief
Published on: 6 Oct 2026 10:37 PM IST
AP
X

AP: తిరువూరు, దెందులూరు వివాదాలపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా ఆరా!

AP: తెలుగుదేశం పార్టీలోని అంతర్గత విభేదాలపై రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు దృష్టి సారించారు. తిరువూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ బాలకోటయ్య మధ్య నెలకొన్న వివాదంపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు విచారణ జరిపారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇరువురు నేతలతో విడివిడిగా సమావేశమైన ఆయన.. వివాదానికి దారితీసిన పరిస్థితులు, పరస్పరం చేసుకున్న ఆరోపణలు, పార్టీ అధిష్ఠానానికి అందిన ఫిర్యాదులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

తిరువూరు నియోజకవర్గంలో కొంతకాలంగా పార్టీ నేతల మధ్య విభేదాలు చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో సమస్య మరింత ముదరకుండా పార్టీ అధిష్ఠానం జోక్యం చేసుకుంది. ఇందులో భాగంగా పల్లా శ్రీనివాసరావు ఇరువురు నేతల నుంచి వేర్వేరుగా వివరణ తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీకి సంబంధించిన అంతర్గత అంశాలను బహిరంగంగా చర్చించుకోవడం, పరస్పరం విమర్శలు చేసుకోవడం వల్ల పార్టీకి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పల్లా సూచించినట్లు సమాచారం.

నియోజకవర్గంలో పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం కొనసాగాలని, వ్యక్తిగత విభేదాలను పార్టీ ప్రయోజనాలకు దూరంగా ఉంచాలని పల్లా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. పార్టీ అంతర్గత వ్యవహారాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని ఇరువురు నేతలకు సూచించారు. స్థానికంగా పార్టీ బలోపేతానికి అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని పల్లా పేర్కొన్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా.. దెందులూరు నియోజకవర్గ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు సంబంధించిన టోల్‌ప్లాజా ఘటనపైనా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆరా తీశారు. ఈ ఘటనపై వచ్చిన ఆరోపణలు, అందుబాటులో ఉన్న వివరాలను పరిశీలించిన పల్లా.. చింతమనేని ప్రభాకర్ నుంచి కూడా వివరణ తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

టోల్‌ప్లాజా సిబ్బంది, లారీ డ్రైవర్లు ఇచ్చిన వివరాలను పరిగణనలోకి తీసుకుని ఘటనకు సంబంధించిన వాస్తవ పరిస్థితులను పల్లా తెలుసుకున్నారు. టోల్‌ప్లాజా ఘటనతో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు సంబంధం లేదని సంబంధిత డ్రైవర్లు, సిబ్బంది స్పష్టం చేసిన నేపథ్యంలో.. ఈ అంశంపై పూర్తి వివరాలను రాష్ట్ర అధ్యక్షుడు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.

ఇటీవల పార్టీ నేతలకు సంబంధించిన వివాదాలు, ఆరోపణలు బహిరంగ చర్చకు వస్తున్న నేపథ్యంలో పల్లా శ్రీనివాసరావు తీసుకున్న ఈ వివరాల సేకరణకు ప్రాధాన్యత ఏర్పడింది. పార్టీకి సంబంధించిన అంశాల్లో నేతలు సంయమనం పాటించాలని, వ్యక్తిగత విమర్శలు, పరస్పర ఆరోపణలకు దూరంగా ఉండాలని పల్లా సూచించినట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో పార్టీ నాయకుల మధ్య సమన్వయం, క్రమశిక్షణ అత్యంత కీలకమని పల్లా స్పష్టం చేసినట్లు సమాచారం. స్థానిక స్థాయిలో తలెత్తే సమస్యలను పార్టీ వేదికపైనే పరిష్కరించుకోవాలని, వాటిని బహిరంగ వివాదాలుగా మార్చకుండా జాగ్రత్త వహించాలని నేతలకు సూచించినట్లు తెలుస్తోంది.

తిరువూరు, దెందులూరు వ్యవహారాలపై వివరాలు సేకరించిన పల్లా శ్రీనివాసరావు.. పార్టీ క్రమశిక్షణ, ఐక్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని నేతలకు స్పష్టమైన దిశానిర్దేశం చేసినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.