Vijayawada: విజయవాడలో మిషన్ కర్మయోగిపై దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సు!
Vijayawada: విజయవాడలో రెండు రోజుల పాటు 'మిషన్ కర్మయోగి' దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ వర్క్‌షాప్ ప్రారంభం.
Vijayawada: విజయవాడలో మిషన్ కర్మయోగిపై దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సు!
Vijayawada: ప్రభుత్వ ఉద్యోగుల్లో సామర్థ్య నిర్మాణం, పరిపాలనా నైపుణ్యాల పెంపు లక్ష్యంగా మిషన్ కర్మయోగిపై దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ వర్క్‌షాప్ విజయవాడలో జరగనుంది. ‘సాధనా శృంఖలా’ పేరుతో సెప్టెంబరు 29, 30 తేదీల్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కళావేదికలో రెండు రోజుల పాటు ఈ సదస్సును నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒడిశా, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన అధికారులు, సంబంధిత భాగస్వాములు సదస్సులో పాల్గొననున్నారు.
ఈరోజు జరిగే ప్రారంభ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరై సదస్సును ప్రారంభించనున్నారు. ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభం కాగా, 10.30 గంటలకు సీఎం చంద్రబాబు ప్రారంభోపన్యాసం చేయనున్నారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కూడా సదస్సుకు హాజరుకానున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు, మిషన్ కర్మయోగి ప్రతినిధులు వివిధ అంశాలపై ప్రసంగించనున్నారు.
మిషన్ కర్మయోగిలో భాగంగా ప్రభుత్వ శిక్షణ సంస్థల సామర్థ్య నిర్మాణం, ఉద్యోగుల నైపుణ్యాల పెంపుపై సదస్సులో ప్రధానంగా చర్చించనున్నారు. శిక్షణా కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నిర్వహించడం, ప్రభుత్వ ఉద్యోగుల్లో అవసరమైన నైపుణ్యాలను పెంపొందించడం, తద్వారా ప్రజలకు అందించే ప్రభుత్వ సేవల నాణ్యతను మెరుగుపరచడం వంటి అంశాలపై ప్రతినిధులు తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు.
‘ఉన్నతి’ కార్యక్రమం ద్వారా సామర్థ్యాల పెంపు కోసం ఐగాట్, మిషన్ కర్మయోగి వేదికను ఎలా వినియోగించుకోవచ్చనే అంశంపై ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనున్నారు. అలాగే మిషన్ కర్మయోగి క్వాలిటీ ఫ్రేమ్‌వర్క్, ‘కర్మయోగి కర్తవ్య’ కార్యక్రమం కింద వివిధ శిక్షణా సంస్థల నిర్వహణకు సంబంధించిన ముసాయిదా ఫ్రేమ్‌వర్క్‌పై చర్చ జరగనుంది.
సదస్సులో వివిధ రాష్ట్రాల అనుభవాలు, ఉత్తమ విధానాలను పరస్పరం పంచుకునే అవకాశం కల్పించనున్నారు. అంతర్రాష్ట్ర బృందాల కార్యకలాపాలు, ప్రశ్నోత్తరాల ద్వారా ఆయా రాష్ట్రాల్లో అమలు చేస్తున్న శిక్షణా విధానాలు, సామర్థ్య నిర్మాణ కార్యక్రమాలపై చర్చిస్తారు. వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలపై ప్రజెంటేషన్లు కూడా ఉంటాయి
రేపు నిపుణుల సమావేశాలు, రాష్ట్రాల ప్రదర్శనలు, బృంద చర్చలు నిర్వహించి వర్క్‌షాప్‌ను ముగించనున్నారు. ప్రభుత్వ శిక్షణ సంస్థలు కేవలం శిక్షణా కోర్సులు నిర్వహించే కేంద్రాలుగా కాకుండా, ఆయా శాఖల పనితీరును మెరుగుపరిచే కీలక భాగస్వాములుగా ఎదగాలన్నది ఈ వర్క్‌షాప్ ప్రధాన ఉద్దేశంగా అధికారులు పేర్కొంటున్నారు.
పరిపాలనలో సామర్థ్యాన్ని పెంచడంతో పాటు ప్రజలకు వేగవంతమైన, మెరుగైన సేవలు అందించే విధంగా ఉద్యోగుల నైపుణ్యాలను అభివృద్ధి చేయడంపై సదస్సులో దృష్టి సారించనున్నారు. దక్షిణాది రాష్ట్రాల ప్రతినిధులు తమ అనుభవాలను పంచుకోవడం, విజయవంతమైన విధానాలను ఇతర రాష్ట్రాలు అనుసరించేలా పరస్పర సహకారం పెంచుకోవడం ద్వారా ఈ ప్రాంతీయ వర్క్‌షాప్ కీలక వేదికగా నిలవనుంది.




