Amaravati: ఏపీని వణికించిన తీవ్ర వాయుగుండం కళింగపట్నం వద్ద తీరం దాటింది!
Amaravati: కళింగపట్నం సమీపంలో తీరం దాటిన తీవ్ర వాయుగుండం. మరో 48 గంటల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక.
Amaravati: ఏపీని వణికించిన తీవ్ర వాయుగుండం కళింగపట్నం వద్ద తీరం దాటింది!
Amaravati: ఆంధ్రప్రదేశ్ తీరాన్ని వణికించిన తీవ్ర వాయుగుండం తీరం దాటింది. రాత్రి 11 గంటల నుంచి ఒంటి గంట మధ్య కళింగపట్నం సమీపంలో తీవ్ర వాయుగుండం తీరం దాటినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తీరం దాటే సమయంలో తీవ్ర వాయుగుండం గంటకు సుమారు 3 కిలోమీటర్ల వేగంతో కదిలినట్లు అధికారులు తెలిపారు. తీరం దాటినప్పటికీ దీని ప్రభావం పూర్తిగా తగ్గిపోలేదని, ప్రజలు మరో 48 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.
తీరం దాటిన తర్వాత కూడా మరో 12 గంటల పాటు తీవ్ర వాయుగుండం స్థాయిలోనే కొనసాగనుంది. ఆ తర్వాతి 24 గంటల్లో క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రతో పాటు పలు జిల్లాల్లో వర్షాలు కొనసాగనున్న నేపథ్యంలో ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు.
ముఖ్యంగా ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే పోలవరం ప్రాంతంతో పాటు విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లోనూ అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇప్పటికే నేల పూర్తిగా తడిసి ఉండటంతో మరిన్ని వర్షాలు కురిస్తే లోతట్టు ప్రాంతాల్లో నీటిమట్టం పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఇక గత 24 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు నమోదయ్యాయి. ఏకంగా 80 ప్రాంతాల్లో 100 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లే అవకాశం ఉండటంతో ఆకస్మిక వరదలపై ప్రత్యేక అప్రమత్తత అవసరమని సూచించింది.
లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని, వరద నీటిలో రాకపోకలు సాగించవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వాగులు, కాలువలు, చెరువులు, కల్వర్టులు, లోతట్టు రహదారుల వద్ద పరిస్థితులను గమనించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో స్థానిక అధికారుల సూచనలు పాటించాలని కోరారు.
భారీ వర్షాల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అధికారులు హైఅలెర్ట్‌లో ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ఆదేశించారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చోట సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. విద్యుత్ అంతరాయాలు, రహదారులపై నీరు నిలిచిపోవడం, చెట్లు లేదా విద్యుత్ స్తంభాలు కూలిపోవడం వంటి ఘటనలు చోటుచేసుకుంటే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
తీవ్ర వాయుగుండం తీరం దాటడంతో ప్రధాన ముప్పు తగ్గుతున్నప్పటికీ, వర్షాల ప్రభావం కొనసాగనున్న నేపథ్యంలో ప్రజలు ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. అధికారులు సూచిస్తున్నారు.




