Amaravati: రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేయాలి!

Amaravati: అక్టోబర్ 2న మదనపల్లిలో హార్టికల్చర్ హబ్ కార్యక్రమాలు. రాయలసీమను ఉద్యాన పంటల కేంద్రంగా మారుస్తామని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు వెల్లడి.

Hari Kishan  AP Bureau Chief
Published on: 30 Sept 2026 3:23 PM IST
Amaravati
X

Amaravati: రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేయాలి!

Amaravati: రాయలసీమ అంటే కేవలం కరువు ప్రాంతం కాదని, అపారమైన వనరులు, ఉద్యాన పంటలకు అనుకూలమైన భూములు ఉన్న ప్రాంతమని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు అన్నారు. తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసే విధానాలను ప్రోత్సహిస్తే రాయలసీమలో వ్యవసాయానికి కొత్త అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు.

గతంలో డ్రిప్ ఇరిగేషన్‌ను ప్రోత్సహించడం ద్వారా అరటి, బొప్పాయి, దానిమ్మ వంటి వాణిజ్య పంటల సాగు విస్తరించిందని గుర్తుచేశారు. రైతు సంక్షేమం, ముందుచూపుతో కూడిన సాగునీటి విధానాలతో కరువు ప్రాంతంలోనూ అధిక ఆదాయం సాధించవచ్చని అన్నారు.

అక్టోబర్ 2న మదనపల్లిలో హార్టికల్చర్ హబ్ కార్యక్రమాలు

రాయలసీమలో ఉద్యాన రంగ అభివృద్ధికి సంబంధించి అక్టోబర్ 2న మదనపల్లిలో పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరగనున్నాయని నాగోతు రమేష్ నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులు హాజరుకానున్నారని చెప్పారు.

ప్రస్తుతం రాయలసీమలో 8.4 లక్షల హెక్టార్లలో ఉన్న ఉద్యాన సాగును 2030 నాటికి 14.41 లక్షల హెక్టార్లకు పెంచే లక్ష్యం ఉందన్నారు. ఉద్యాన రంగానికి అవసరమైన మౌలిక వసతులు, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి సుమారు రూ.40,352 కోట్ల సహకారం, ప్రైవేట్ రంగం నుంచి సుమారు రూ.59 వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందన్నారు.

రైతులకు మార్కెట్‌తో పాటు ప్రాసెసింగ్ సదుపాయాలు

రైతులు పండించే ఉత్పత్తులకు మార్కెట్ కల్పించడంతో పాటు ప్రాసెసింగ్, వాల్యూ యాడెడ్ పరిశ్రమలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని రమేష్ నాయుడు అన్నారు. మదనపల్లి టమోటా, చింతపండు, అరటి, బత్తాయి వంటి పంటలకు అంతర్జాతీయ మార్కెట్, ఎగుమతి అవకాశాలను పెంచాలని సూచించారు.

ముఖ్యంగా టమోటా వంటి పంటలకు సీజన్‌లో ధరలు పడిపోకుండా నిల్వ, ప్రాసెసింగ్, మార్కెటింగ్ వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రైతుల ఉత్పత్తులు ఇతర ప్రాంతాలకు వేగంగా చేరేలా రవాణా, రైల్వే, డిజిటల్ మార్కెటింగ్ వ్యవస్థలను అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు.

2030 నాటికి ఉద్యాన పంటల ఉత్పత్తిని ప్రస్తుత స్థాయి నుంచి 435 లక్షల టన్నులకు పెంచే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.

సాగునీటి ప్రాజెక్టులపై విమర్శలు

గత ప్రభుత్వ హయాంలో డ్రిప్ ఇరిగేషన్, వ్యవసాయ పరికరాలపై రాయితీలు తగ్గించారని నాగోతు రమేష్ నాయుడు విమర్శించారు. జీవో 365 ద్వారా రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు ప్రతికూల నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాగునీటి ప్రాజెక్టుల పూర్తి, కరువు నివారణకు చర్యలు చేపట్టిందన్నారు.

అన్నమయ్య ప్రాజెక్టు పునర్నిర్మాణంతో పాటు భవిష్యత్తులో వరదల వల్ల నష్టం జరగకుండా కొత్త ప్రతిపాదనలపై సర్వేలు జరుగుతున్నాయని చెప్పారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా కడప జిల్లాలోని బద్వేల్ ప్రాంతానికి కృష్ణా జలాలు అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఏర్పడిందన్నారు.

యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు

రాయలసీమలో పరిశ్రమలు, మౌలిక వసతులు, సాగునీరు అభివృద్ధి చెందితే యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని రమేష్ నాయుడు అన్నారు. ఆర్థిక, విద్యా రంగాల్లో అభివృద్ధి జరిగితే ఫ్యాక్షన్, హింసాత్మక రాజకీయాలకు స్థానం ఉండదని వ్యాఖ్యానించారు.

ప్రాంతీయ, కుల, భావోద్వేగ విభేదాలకు ప్రజలు దూరంగా ఉండాలని కోరారు. రాయలసీమ అభివృద్ధి, రైతు సంక్షేమం, యువతకు ఉపాధి కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. అక్టోబర్ 2న మదనపల్లిలో జరిగే కార్యక్రమానికి గ్రామాల నుంచి రైతులు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు.

రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేయడం ద్వారా రైతుల ఆదాయం, ఉపాధి, ఎగుమతులు, పారిశ్రామిక అభివృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడతాయని రమేష్ నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.