జరుగుమల్లి ఘటనపై మంత్రి సవిత ఆగ్రహం..

Amaravati: జరుగుమల్లి బీసీ హాస్టల్ విద్యార్థినుల వేధింపుల ఘటనపై మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తం చేసి, నిందితుడి అరెస్టుకు, వార్డెన్ సస్పెన్షన్‌కు ఆదేశించారు.

Hari Kishan  AP Bureau Chief
Published on: 30 Sept 2026 9:29 PM IST
Amaravati
X

జరుగుమల్లి ఘటనపై మంత్రి సవిత ఆగ్రహం..

అమరావతి: ప్రకాశం జిల్లా జరుగుమల్లి బీసీ హాస్టల్ విద్యార్థినుల వేధింపుల ఘటనపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినులపై అసభ్యకరంగా ప్రవర్తించిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధిత విద్యార్థినులను నిందితుడి ఇంటికి పంపిన హాస్టల్ కుక్‌పై కూడా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

జరుగుమల్లి బీసీ హాస్టల్‌లో చదువుతున్న ఇద్దరు విద్యార్థినులను ఒంగోలులో నివసిస్తున్న రిటైర్డ్ ఉద్యోగి బొడ్డు వెంకట్రావు ఇంటికి హాస్టల్ కుక్ శారద మంగళవారం పంపినట్లు మంత్రి తెలిపారు. విద్యార్థినులు ఇంటికి వెళ్లిన సమయంలో వెంకట్రావు వారితో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు పేర్కొన్నారు. దీంతో భయాందోళనకు గురైన విద్యార్థినులు వెంటనే తమ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి విషయం తెలియజేశారు.

ఘటనపై సమాచారం అందుకున్న మంత్రి సవిత.. ఒంగోలు జిల్లా కలెక్టర్ రాజాబాబు, జిల్లా బీసీ సంక్షేమ శాఖాధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. విద్యార్థినులపై అసభ్యకరంగా ప్రవర్తించడం, వేధింపులకు పాల్పడటం క్షమించరాని నేరమని అన్నారు. నిందితుడు బొడ్డు వెంకట్రావును తక్షణమే అరెస్టు చేయాలని ఆదేశించారు.

అలాగే విద్యార్థినులను వెంకట్రావు ఇంటికి పంపిన కుక్ శారదను విధుల నుంచి తొలగించడంతో పాటు, ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హాస్టల్‌లో బాధ్యతలు నిర్వహించాల్సిన వార్డెన్ నిర్లక్ష్యంపై కూడా మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డెన్‌ను సస్పెండ్ చేయాలని బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి సత్యనారాయణకు ఆదేశాలు ఇచ్చారు.

ఈ ఘటనపై పూర్తి వివరాలతో తక్షణమే నివేదిక అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ముఖ్యంగా బాలికల హాస్టళ్లలో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని సూచించారు. రాత్రి వేళల్లో హాస్టళ్లలో వార్డెన్లు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. విద్యార్థులను సొంత బిడ్డల్లా భావించి వారి భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు.

హాస్టళ్లలో పరిస్థితులను పర్యవేక్షించడంలో భాగంగా డీబీసీడబ్ల్యూవోలు, ఏబీసీడబ్ల్యూవోలు రాత్రి సమయాల్లోనూ తనిఖీలు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. హాస్టళ్లలో విద్యార్థినుల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని హెచ్చరించారు.

విద్యార్థినులు, మహిళలపై వేధింపులు లేదా లైంగిక దాడులకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి సవిత స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని ఆదేశించారు. విద్యార్థినుల భద్రత విషయంలో రాజీ ప్రసక్తే లేదని మంత్రి హెచ్చరించారు.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.