శుభలేఖలోనూ రాజకీయ కోణమా?: సాక్షి కథనంపై షర్మిల ఆగ్రహం!

YS Sharmila: తన కుమార్తె వివాహానికి సీఎం చంద్రబాబును ఆహ్వానించడంపై సాక్షి దినపత్రికలో వచ్చిన కథనంపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మంగళవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Hari Kishan  AP Bureau Chief
Published on: 17 Nov 2026 6:35 PM IST
YS Sharmila
X

శుభలేఖలోనూ రాజకీయ కోణమా?: సాక్షి కథనంపై షర్మిల ఆగ్రహం!

YS Sharmila Slams Sakshi: తన కుమార్తె వివాహానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆహ్వానించడంపై సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనాన్ని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా ఖండించారు. ఈ కథనం తనతో పాటు తన కుటుంబం వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ఆడబిడ్డపై ఇలాంటి నిరాధారమైన నిందలు వేయడం సమాజంలో ఉన్న విలువలకు విరుద్ధమని మండిపడ్డారు.

తండ్రి వయసున్న వ్యక్తికి కుమార్తె పెళ్లి శుభలేఖ అందిస్తే చెట్టాపట్టాలేసుకుని తిరిగినట్లా? ఆత్మీయ సంబంధాలకు తప్పుడు అర్థాలు ఆపాదిస్తారా? వావివరసలు తెలిసిన వ్యక్తులు రాసే రాతలేనా ఇవి? మహిళల పట్ల కనీస గౌరవం ఉన్నవారు ఇలాంటి కథనాలు ప్రచురిస్తారా? అంటూ షర్మిల ప్రశ్నించారు. తన కుమార్తె వివాహ వేడుకకు ముఖ్యమంత్రిని ఆహ్వానించడంలో రాజకీయ కోణాలు వెతకడం సరికాదన్నారు.

జగన్, వైసీపీ నేతల ఆలోచనా విధానంలో ఇంకా మార్పు రాలేదని విమర్శించారు. మహిళలపై వక్రభాష్యాలు చెప్పడం, అక్రమ సంబంధాలంటూ తప్పుడు ఆరోపణలు ఆపాదించడం వారి దిగజారుడు రాజకీయ సంస్కృతికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఆత్మీయతతో ఇచ్చే పెళ్లి పిలుపులో కూడా రాజకీయ ప్రయోజనాలను వెతకడం కోడిగుడ్డు మీద ఈకలు పీకడమేనని ఎద్దేవా చేశారు. ఎవరి మెప్పు కోసం ఇలాంటి కథనాలు రాస్తున్నారని నిలదీశారు.

గతంలో తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా తన పిల్లల వివాహాలకు చంద్రబాబు నాయుడును ఆహ్వానించారని షర్మిల గుర్తుచేశారు. మరి అప్పుడు చంద్రబాబుతో రాజశేఖర్ రెడ్డి చెట్టాపట్టాలేసుకుని తిరిగినట్లా? వివాహాలకు హాజరై ఆశీర్వదిస్తే సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా అర్థం చేసుకోవాలా? అని ప్రశ్నించారు. మానవ సంబంధాలకు రాజకీయ రంగు పులమడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు.

మహిళల పట్ల అమితమైన ప్రేమ, గౌరవం ఉందని చెప్పుకునే వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి.. తన సొంత పత్రిక సాక్షిలో ప్రచురితమైన ఇలాంటి కథనాలను ఎలా సమర్థించుకుంటారని షర్మిల ప్రశ్నించారు. అక్కచెల్లెమ్మలపై గౌరవం ఉందని చెప్పే మీరు, ఒక మహిళపై నీలాపనిందలు వేయించే విధానాన్ని ఎలా సమర్థిస్తారని నిలదీశారు. తల్లి, చెల్లి అనే తేడా లేకుండా బురదజల్లే రాతలు రాయించడమే మీ ఎజెండానా? ఈ కథనం మీకు తెలిసే ప్రచురించారా? లేక మీ ఆదేశాలతోనే రాయించారా? అని ప్రశ్నించారు.

తన కుటుంబంపై జరిగిన వ్యక్తిత్వ హననానికి జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలాంటి నీచమైన కథనాలు ప్రచురించినందుకు జగన్ సంజాయిషీ ఇస్తారా? లేక సాక్షి పత్రిక ద్వారా వివరణ ఇప్పిస్తారా? అనేది తేల్చుకోవాలని షర్మిల స్పష్టం చేశారు.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.