ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం...పరవాడ ఫార్మాసిటీపై ఏపీ పీసీబీ కొరడా

Amaravati: పరవాడ ఫార్మాసిటీలో కాలుష్య నివేదికపై స్పందించిన ఏపీ పీసీబీ. నిబంధనలు ఉల్లంఘించిన 95 పరిశ్రమలకు షోకాజ్ నోటీసులు జారీ, ఏడు రోజుల్లో వివరణకు ఆదేశం.

Hari Kishan  AP Bureau Chief
Published on: 26 Sept 2026 9:55 PM IST
Amaravati
X

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం...పరవాడ ఫార్మాసిటీపై ఏపీ పీసీబీ కొరడా

అమరావతి: అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీ పరిధిలో కాలుష్యంపై వచ్చిన ఫిర్యాదులపై ఏపీ కాలుష్య నియంత్రణ మండలి చర్యలు చేపట్టింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి.. వాస్తవ పరిస్థితులను పరిశీలించి సమగ్ర నివేదిక ఇవ్వాలని పీసీబీ అధికారులను ఆదేశించారు.

పరవాడ ఫార్మాసిటీ సమీపంలోని డ్రెయిన్లు, వర్షపు నీటి కాలువల్లో నల్లటి రంగులో నీరు ప్రవహిస్తోందని, దుర్వాసన వస్తోందని శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ అయింది. దీనిపై స్పందించిన పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పీసీబీ అధికారులు రంగంలోకి దిగారు. ఫార్మాసిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి.. వివిధ ప్రాంతాల నుంచి నీటి నమూనాలను సేకరించారు.

తనిఖీల సందర్భంగా శుద్ధి చేయని వ్యర్థాలతో కూడిన నీటిని వర్షపు నీటి కాలువల్లోకి విడుదల చేసినట్టు అధికారులు గుర్తించారు. దుర్వాసనకు కారణాలపైనా పరిశీలన చేపట్టారు. ఫార్మాసిటీ పరిధిలో మొత్తం 95 పరిశ్రమలకు పీసీబీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యర్థాల నిర్వహణ జరిగిందా..? కాలుష్యానికి ఏదైనా పరిశ్రమ కారణమైందా..? అనే అంశాలపై వివరణ కోరింది.

వ్యర్థాల నిర్వహణపై కఠిన ఆదేశాలు

షోకాజ్ నోటీసులతో పాటు పరిశ్రమలు తప్పనిసరిగా అమలు చేయాల్సిన పలు దిద్దుబాటు చర్యలను కూడా పీసీబీ నిర్దేశించింది. వర్షపు నీటిని నిల్వ చేసేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించింది. మురుగునీరు లేదా కలుషిత నీరు పరిశ్రమల నుంచి బయటకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

ఎఫ్లుయెంట్, ప్రమాదకర వ్యర్థాలను క్రమం తప్పకుండా శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించాలని స్పష్టం చేసింది. అవసరమైన స్క్రబ్బర్లను ఏర్పాటు చేసి ఆన్‌లైన్ మానిటరింగ్ వ్యవస్థను అమలు చేయాలని సూచించింది. వ్యర్థాల విడుదల, నిర్వహణ ప్రక్రియపై నిఘా ఉండేలా తేదీ, సమయం నమోదయ్యే సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

శుద్ధి చేసిన వ్యర్థాలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని కనీసం ఆరు నెలల పాటు భద్రపరచాలని పీసీబీ స్పష్టం చేసింది. ప్రతి పరిశ్రమ కన్‌సెంట్ టు ఆపరేట్‌.. అంటే CTO, అలాగే హాజర్డస్ వేస్ట్ అనుమతులకు సంబంధించిన నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆదేశించింది. వ్యర్థాల నిర్వహణ ప్రక్రియను డిజిటలీకరించేందుకు కూడా చర్యలు చేపట్టాలని సూచించింది.

ఏడు రోజుల్లో వివరణ

షోకాజ్ నోటీసులకు స్పందించేందుకు పరిశ్రమలకు ఏడు రోజుల గడువు ఇచ్చారు. నిర్దేశిత సమయంలోగా సంతృప్తికరమైన వివరణ అందించాలని పీసీబీ పేర్కొంది. పరిశ్రమల నుంచి వచ్చే వివరణలు, అధికారులు సేకరించిన నమూనాల వివరాలు, తనిఖీల్లో గుర్తించిన అంశాలను పరిగణనలోకి తీసుకుని తదుపరి చర్యలు ఉంటాయని తెలిపింది.

మురుగునీరు, ప్రమాదకర వ్యర్థాలు లేదా ఉప ఉత్పత్తులను అక్రమంగా బయటకు విడుదల చేసినట్టు నిర్ధారణ అయితే సంబంధిత పరిశ్రమలపై పర్యావరణ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని ఏపీ పీసీబీ హెచ్చరించింది.

తనిఖీలు, నోటీసులు, దిద్దుబాటు చర్యలకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన నివేదికను ఏపీ పీసీబీ అధికారులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యాలయానికి సమర్పించారు. దీంతో పరవాడ ఫార్మాసిటీలో వ్యర్థాల నిర్వహణ, కాలుష్య నియంత్రణపై అధికారుల పర్యవేక్షణ మరింత కట్టుదిట్టం కానుంది.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.