ఏపీలో గోద్రెజ్ ఆగ్రో కెమికల్ యూనిట్ ఏర్పాటు చేయండి..

Amaravati: న్యూఢిల్లీలో గోద్రెజ్ గ్రూప్ ప్రెసిడెంట్ రాకేష్ స్వామితో మంత్రి నారా లోకేష్ భేటీ. ఏపీలో పారిశ్రామిక విస్తరణ, పెట్టుబడులపై చర్చ.

Hari Kishan  AP Bureau Chief
Published on: 25 Sept 2026 12:16 AM IST
Amaravati
X

ఏపీలో గోద్రెజ్ ఆగ్రో కెమికల్ యూనిట్ ఏర్పాటు చేయండి..

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టేలా ప్రముఖ పారిశ్రామిక సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్.. గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ ప్రెసిడెంట్ రాకేష్ స్వామితో న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. రాష్ట్రంలో గోద్రెజ్ గ్రూప్ విస్తరణకు ఉన్న అవకాశాలపై ఇరువురు చర్చించారు.

ఆంధ్రప్రదేశ్‌లో గోద్రెజ్ అనుబంధ సంస్థ అజ్‌టెక్ లైఫ్‌సైన్సెస్ ఆధ్వర్యంలో ఆగ్రో కెమికల్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని మంత్రి లోకేష్ కోరారు. వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా ఉన్న ఏపీలో ఆగ్రో కెమికల్స్ తయారీ యూనిట్ ఏర్పాటుతో రైతులకు, వ్యవసాయ రంగానికి ఉపయోగపడటంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని మంత్రి వివరించినట్లు తెలుస్తోంది.

అదే సమయంలో రెడీ టు ఈట్ పాల ఉత్పత్తుల కోసం ఆంధ్రప్రదేశ్‌లో ప్రాసెసింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని గోద్రెజ్ సంస్థను మంత్రి కోరారు. రాష్ట్రంలో పాడి పరిశ్రమకు ఉన్న అవకాశాలను వినియోగించుకునేలా పాల ఉత్పత్తుల విలువ ఆధారిత ప్రాసెసింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

ఆయిల్‌పామ్ రంగంలోనూ గోద్రెజ్ సంస్థ మరింతగా విస్తరించాలని లోకేష్ కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆయిల్‌పామ్ ప్రాసెసింగ్ యూనిట్లతో పాటు సమాధాన్ కేంద్రాలను మరింత విస్తరించేందుకు గోద్రెజ్ ఆగ్రోవెట్ విభాగం ముందుకు రావాలని సూచించారు.

ఈ సందర్భంగా గోద్రెజ్ గ్రూప్ ప్రెసిడెంట్ రాకేష్ స్వామి.. తమ సంస్థ కార్యకలాపాలను మంత్రికి వివరించారు. గోద్రెజ్ అండ్ బాయిస్ ఆధ్వర్యంలో గృహోపకరణాలు, ఇంటీరియర్ ఫర్నిచర్, తాళాలు, పారిశ్రామిక పరికరాల తయారీతో పాటు ఇస్రో, డీఆర్‌డీవోకు సంబంధించిన ఏరోస్పేస్ విడిభాగాల తయారీ రంగాల్లో సేవలందిస్తున్నట్లు తెలిపారు.

దేశంలో కొత్తగా పెద్దఎత్తున రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నామని రాకేష్ స్వామి చెప్పారు. ఇంటీరియో విభాగం ద్వారా సుమారు 2 లక్షల చదరపు అడుగుల రిటైల్ స్థలాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. పెట్‌కేర్ ఉత్పత్తుల విభాగంలో జీసీపీఎల్ కార్యకలాపాలతో పాటు రుణాల రంగంలో గోద్రెజ్ ఇన్వెస్ట్‌మెంట్ లిమిటెడ్ను కొత్తగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే గోద్రెజ్ ఆగ్రోవెట్ పెట్టుబడులు పెడుతున్న విషయాన్ని కూడా రాకేష్ స్వామి ప్రస్తావించారు. భారతదేశంలో అతిపెద్ద ఆయిల్‌పామ్ ప్రాసెసర్లలో గోద్రెజ్ ఆగ్రోవెట్ ఒకటని చెప్పారు. గత ఏడాది నవంబర్‌లో ఆంధ్రప్రదేశ్‌లో ఆయిల్‌పామ్ ప్రాసెసింగ్, సమాధాన్ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి రూ.70 కోట్ల విలువైన అవగాహన ఒప్పందం కుదిరినట్లు వివరించారు.

ద్వారకా తిరుమల మండలంలో రూ.210 కోట్ల పెట్టుబడితో మిఠాయి, కోకో బటర్ ప్రత్యామ్నాయ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు రాకేష్ స్వామి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రతిపాదించిన పెట్టుబడి అవకాశాలను పరిశీలిస్తామని ఆయన మంత్రికి తెలిపారు.

గోద్రెజ్ గ్రూప్ ఇప్పటికే రాష్ట్రంలో చేపడుతున్న పెట్టుబడులతో పాటు కొత్త ప్రతిపాదనలను పరిశీలించేందుకు అంగీకరించడంతో.. ఆంధ్రప్రదేశ్‌లో ఆ సంస్థ కార్యకలాపాలు మరింత విస్తరించే అవకాశాలపై సమావేశంలో చర్చ జరిగింది.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.