ఏపీ పర్యాటకానికి జాతీయ స్థాయిలో గుర్తింపు మంత్రి కందుల దుర్గేష్‌కు ‘ఎక్సలెన్స్ ఇన్ టూరిజం లీడర్‌షిప్’ అవార్డు

Amaravati: ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి జాతీయ స్థాయి అవార్డులు. TAAI సదస్సులో మంత్రి కందుల దుర్గేష్‌కు ఎక్సలెన్స్ అవార్డు, ఏపీకి అవుట్‌స్టాండింగ్ స్టేట్ అవార్డు ప్రదానం.

Hari Kishan  AP Bureau Chief
Published on: 26 Oct 2026 10:12 PM IST
Amaravati
X

ఏపీ పర్యాటకానికి జాతీయ స్థాయిలో గుర్తింపు మంత్రి కందుల దుర్గేష్‌కు ‘ఎక్సలెన్స్ ఇన్ టూరిజం లీడర్‌షిప్’ అవార్డు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్‌కు ‘ఎక్సలెన్స్ ఇన్ టూరిజం లీడర్‌షిప్’ అవార్డు దక్కింది. అలాగే పర్యాటక రంగంలో వినూత్న సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలకు గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ‘అవార్డ్ ఆఫ్ మెరిట్ – అవుట్‌స్టాండింగ్ టూరిజం స్టేట్ ఆఫ్ ఇండియా’ పురస్కారం లభించింది. కలకత్తాలో నిర్వహించిన ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (TAAI) 69వ ఇండియన్ ట్రావెల్ కాంగ్రెస్ వార్షిక సదస్సులో ఈ అవార్డులను మంత్రి అందుకున్నారు.

TAAI 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కలకత్తాలోని ఐటీసీ రాయల్ బెంగాల్‌లో ఈ వార్షిక సదస్సు, ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేశ పర్యాటక రంగానికి చెందిన ప్రముఖులు, ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగ అభివృద్ధికి చేస్తున్న కృషిని గుర్తించిన నిర్వాహకులు.. మంత్రి కందుల దుర్గేష్‌కు వ్యక్తిగతంగా అవార్డును, రాష్ట్రానికి మరో ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందించారు.

అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా ఏపీ

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. రెండు ప్రతిష్ఠాత్మక అవార్డులు అందించిన TAAI నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దూరదృష్టితో కూడిన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.

ఈ అవార్డులు రాష్ట్ర పర్యాటక రంగానికి మరింత ప్రోత్సాహాన్నిస్తాయని, అదే సమయంలో బాధ్యతను కూడా పెంచుతాయని మంత్రి అన్నారు. కొత్త ఉత్సాహంతో ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని వైవిధ్యభరితమైన పర్యాటక ప్రాంతాలు, విభిన్న ప్రయాణ అనుభూతులను ప్రపంచానికి పరిచయం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఏపీ పర్యాటక ప్రాంతాలను సందర్శించండి

ఆంధ్రప్రదేశ్‌లోని పర్యాటక ప్రాంతాలను కొత్త కోణంలో ఆవిష్కరించాలని మంత్రి కందుల దుర్గేష్ ట్రావెల్ రంగ ప్రతినిధులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాలను సందర్శించి, వాటి ప్రత్యేకతలను దేశ, విదేశీ పర్యాటకులకు పరిచయం చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ పర్యాటక పటంలో ప్రముఖ గమ్యస్థానంగా నిలబెట్టేందుకు పర్యాటక రంగ సంస్థలు, ట్రావెల్ ఏజెంట్లు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం సంతోషకరమని పర్యాటక శాఖ వర్గాలు పేర్కొన్నాయి. పర్యాటక రంగంలో మరిన్ని అవకాశాలను సృష్టించడం, రాష్ట్ర ప్రత్యేకతలను విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను పర్యాటకులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు వెల్లడించాయి.

TAAI 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ సంస్థకు మంత్రి కందుల దుర్గేష్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ను భారతదేశ పర్యాటక పటంలో అగ్రగామిగా నిలబెట్టేందుకు మంత్రి నిరంతరం కృషి చేస్తున్నారని TAAI ప్రతినిధులు ప్రశంసించారు. మంత్రి వ్యక్తిగతంగా అవార్డు అందుకోవడంతో పాటు రాష్ట్రానికి కూడా పురస్కారం లభించడం ఏపీ పర్యాటక రంగానికి ప్రాధాన్యమైన పరిణామంగా నిలిచింది.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.