AP: ఏపీని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలి: లోకేష్!
AP: ఉండవల్లిలో హోంమంత్రి అనిత అధ్యక్షతన జరిగిన మంత్రుల బృందం భేటీలో ఏపీని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు మంత్రి లోకేష్ కీలక సూచనలు చేశారు.
AP: ఏపీని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలి: లోకేష్!
AP: ఆంధ్రప్రదేశ్‌ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల నివారణపై హోంమంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన ఉండవల్లిలో మంత్రుల బృందం సమావేశమైంది. రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగం, అక్రమ రవాణాను అరికట్టడంతో పాటు యువతలో అవగాహన పెంచే చర్యలపై సమావేశంలో చర్చించారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ హైస్కూళ్లలో ఈగల్ క్లబ్‌లను ఏర్పాటు చేసినట్లు మంత్రి లోకేష్ తెలిపారు. డ్రగ్స్ దుష్ప్రభావాలపై విద్యార్థులు, యువతకు అవగాహన కల్పించేందుకు వీటిని మరింత సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులను చైతన్యవంతం చేసేందుకు ఆపరేషన్ చైతన్యం, ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ వంటి కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని ఆదేశించారు. అలాగే ‘డ్రగ్స్ వద్దు బ్రో’ వంటి కార్యక్రమాలను పెద్దఎత్తున నిర్వహించి యువతను చైతన్యపరచాలని అన్నారు.
గంజాయి, గంజాయి చాక్లెట్లు, ఇతర మాదకద్రవ్యాల రవాణాను అడ్డుకునేందుకు అవసరమైన నియంత్రణ వ్యవస్థపై అధికారులు అధ్యయనం చేయాలని మంత్రి సూచించారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగే క్లస్టర్ సమావేశాల్లో ఈగల్ యంత్రాంగాన్ని భాగస్వామ్యం చేసి, డ్రగ్స్ నివారణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని ఆదేశించారు.
యూనివర్సిటీలు, కళాశాలల్లో విద్యార్థులతో నెలకు ఒకసారి టౌన్‌హాల్ సమావేశాలు నిర్వహించి డ్రగ్స్ దుష్ప్రభావాలపై అవగాహన కల్పించాలని లోకేష్ సూచించారు. విద్యార్థులను చైతన్యపరిచేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఔత్సాహిక ఉపాధ్యాయులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న నషా ముక్త్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రంలో చర్యలు చేపట్టాలని ఈగల్ అధికారులకు సూచించారు. సింథటిక్ డ్రగ్స్ నియంత్రణలో పంజాబ్ పోలీసులు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని అన్నారు.
డ్రగ్స్ నివారణలో దక్షిణాది రాష్ట్రాల మధ్య సమన్వయం పెంచేందుకు త్వరలో విశాఖపట్నంలో దక్షిణ భారత రాష్ట్రాల కాంక్లేవ్ నిర్వహించాలని మంత్రి లోకేష్ ప్రతిపాదించారు. మంత్రులు పాల్గొనే ప్రతి సమావేశంలో డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజల్లో విస్తృత అవగాహన కోసం మంత్రుల బృందం క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు.
హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ ఒడిశా నుంచి రాష్ట్రంలోకి గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఒడిశా సరిహద్దుల్లోని చెక్‌పోస్టుల వద్ద నిఘాను మరింత పటిష్టం చేయడంతో పాటు డ్రోన్ నిఘాను విస్తృతం చేయాలని అధికారులను ఆదేశించారు. డ్రగ్స్‌పై అవగాహన కోసం ‘బ్రేక్ ద సైలెన్స్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
ఈగల్ ఐజీ ఆకె రవికృష్ణ మాట్లాడుతూ విశాఖ, నర్సరావుపేటలో ఇటీవల గంజాయి చాక్లెట్లు పట్టుబడ్డాయని తెలిపారు. అవి బీహార్, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినట్లు గుర్తించి ఆయా రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా షెడ్యూల్ డ్రగ్స్, కాఫ్ సిరప్‌లను విక్రయిస్తున్న 20 మెడికల్ షాపులను సీజ్ చేసినట్లు తెలిపారు.
విజయవాడ, రాజమండ్రి నగరాల్లో డ్రగ్స్ వినియోగిస్తున్న బ్లేడ్ బ్యాచ్‌లను గుర్తించి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గంజాయి, డ్రగ్స్ రవాణాను గుర్తించేందుకు 36 శిక్షణ పొందిన జాగిలాలను వినియోగిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అనుమానితులకు రాపిడ్ డ్రగ్ డిటెక్షన్ కిట్లతో పరీక్షలు నిర్వహిస్తున్నామని, 192 మంది యాక్టివ్ రిపీట్ అఫెండర్లను గుర్తించి కఠిన చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు.
సమావేశంలో మంత్రులు వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్, కొల్లు రవీంద్ర, గుమ్మడి సంధ్యారాణితో పాటు ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్డా, ఈగల్ ఐజీ ఆకె రవికృష్ణ, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార విశ్వజిత్ తదితరులు పాల్గొన్నారు.




