Amaravati: జలవనరుల శాఖ అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి నిమ్మల!
Amaravati: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల పరిస్థితిపై ఇరిగేషన్ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి నిమ్మల రామానాయుడు. ముందస్తు చర్యలపై కీలక ఆదేశాలు.
Amaravati: జలవనరుల శాఖ అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి నిమ్మల!
Amaravati: భారీ వర్షాల నేపథ్యంలో జలవనరుల శాఖ అధికారులు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. ఇరిగేషన్ ఉన్నతాధికారులతో మంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి, రాష్ట్రంలో వర్షాలు, వరదల పరిస్థితిపై సమీక్షించారు. ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్, కాడా కమిషనర్ ప్రశాంతి, అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ, చీఫ్ ఇంజినీర్లు, సూపరింటెండింగ్ ఇంజినీర్లు, ఇతర ఉన్నతాధికారులు టెలీకాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు.
వాతావరణ శాఖ నుంచి అందుతున్న ముందస్తు సమాచారాన్ని ఎప్పటికప్పుడు తీసుకుంటూ.. దానికి అనుగుణంగా వరద నియంత్రణ చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. రిజర్వాయర్లు, నదులు, వాగుల్లోకి వచ్చే నీటి ప్రవాహంపై నిరంతరం అంచనా వేయాలని ఆదేశించారు. ఎక్కడైనా నీటి మట్టాలు పెరిగే అవకాశం ఉంటే ముందుగానే అప్రమత్తమై, దిగువ ప్రాంతాల ప్రజలకు సమాచారం అందించాలని సూచించారు.
ముఖ్యంగా మున్నేరు ఇన్‌ఫ్లో, బుడమేరు వరద పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి నిమ్మల అధికారులను ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో వరద ప్రవాహాన్ని అంచనా వేసి, అవసరానికి అనుగుణంగా పట్టిసీమ పంపులను ఆపరేట్ చేయాలని సూచించారు. వరద నీటి నిర్వహణలో ఎలాంటి జాప్యం లేకుండా క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలియజేయాలని స్పష్టం చేశారు.
అదేవిధంగా ఏలేరు రిజర్వాయర్ క్యాచ్‌మెంట్ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల పరిస్థితిని బట్టి పురుషోత్తపట్నం పంపులను ఆపరేట్ చేసుకోవాలని మంత్రి సూచించారు. క్యాచ్‌మెంట్ ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతున్న నేపథ్యంలో రిజర్వాయర్లకు వచ్చే ఇన్‌ఫ్లోపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు.
ఉత్తరాంధ్రలోని వంశధార, నాగావళి, బహుదా, మహేంద్రతనయ నదుల ప్రవాహాలపై కూడా నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని మంత్రి ఆదేశించారు. నదుల నీటిమట్టాలు, వరద ప్రవాహంలో మార్పులను ఎప్పటికప్పుడు అంచనా వేసి, ప్రమాద పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయాలని సూచించారు.
ఇరిగేషన్ అధికారులు కేవలం కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రస్థాయి వార్‌రూమ్ ద్వారా పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ, జిల్లాల వారీగా అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.
భారీ వర్షాలు, వరదల సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి నిమ్మల రామానాయుడు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా అధికారులు, సిబ్బంది అందరూ సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.




