Amaravati: అర్నబ్ తుఫాన్ హెచ్చరికలు.. జలవనరుల శాఖ అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి నిమ్మల!
Amaravati: అర్నబ్ తుఫాన్ నేపథ్యంలో భారీ వర్షాల హెచ్చరికలరీత్యా జలవనరుల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు.
Amaravati: అర్నబ్ తుఫాన్ హెచ్చరికలు.. జలవనరుల శాఖ అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి నిమ్మల!
Amaravati: అర్నబ్ తుఫాన్ నేపథ్యంలో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జలవనరుల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. తుఫాన్ ప్రభావం, వర్షాల తీవ్రతను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, నదులు, వాగులు, వంకలు, కాలువలు, డ్రెయిన్ల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తుఫాన్ పరిస్థితులపై సోమవారం ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్, అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్‌సీ నరసింహమూర్తి, చీఫ్ ఇంజినీర్లు, సూపరింటెండింగ్ ఇంజినీర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తుఫాన్ ప్రభావం, భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ప్రాణ, ఆస్తి, పంట నష్టం జరగకుండా చర్యలు
ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు, ఇన్‌ఫ్లోలు, అవుట్‌ఫ్లోలను నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి సూచించారు. నదులు, వాగులు, వంకల్లో వరద ఉద్ధృతి పెరిగే అవకాశం ఉన్నందున క్షేత్రస్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను ముందుగానే అప్రమత్తం చేసి అవసరమైన హెచ్చరికలు జారీ చేయాలని తెలిపారు.
తుఫాన్ ప్రభావంతో ప్రాణ, ఆస్తి, పంట నష్టం జరగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. రెవెన్యూ, విపత్తుల నిర్వహణ, జలవనరుల శాఖల మధ్య సమన్వయం పెంచుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన సిబ్బంది, యంత్రాలు, ఇతర సామగ్రిని సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. కాలువలు, డ్రెయిన్లలో నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
బుడమేరు ఛానెల్‌లో అడ్డంకులు తొలగించాలి
ఎన్టీఆర్ జిల్లాలో భారీ వర్షాల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని బుడమేరు ఛానెల్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి నిమ్మల ఆదేశించారు. ఛానెల్‌లో నీటి ప్రవాహానికి ఆటంకం కలిగించే అవరోధాలను ముందుగానే తొలగించాలని సూచించారు. భారీ వర్షాలు కురిసినప్పుడు వరద నీరు సజావుగా ప్రవహించేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు.
ఏలేరు రిజర్వాయర్‌పై ప్రత్యేక నిఘా
ఏలేరు రిజర్వాయర్‌లో కుషన్ తక్కువగా ఉన్నందున పరివాహక ప్రాంతంలో నమోదయ్యే వర్షపాతం, రిజర్వాయర్‌కు వచ్చే వరద ప్రవాహాలను నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి సూచించారు. పరిస్థితులకు అనుగుణంగా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
పోలవరం పనులకు ఆటంకం కలగకుండా చర్యలు
పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని 2027 మార్చి నాటికి పూర్తి చేయాలనే లక్ష్యానికి తుఫాన్, భారీ వర్షాల వల్ల ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులకు సూచించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పద్ధతుల్లో నిర్మాణ పనులు కొనసాగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.
తుఫాన్ ప్రభావం పూర్తిగా తగ్గి పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకునే వరకు అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని మంత్రి స్పష్టం చేశారు. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.




