Amaravati: మున్సిపల్ కమిషనర్లతో మంత్రి నారాయణ టెలికాన్ఫరెన్స్!

Amaravati: భారీ వర్షాల నేపథ్యంలో మున్సిపల్ అధికారులతో మంత్రి నారాయణ టెలికాన్ఫరెన్స్. లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, కాల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశం.

Hari Kishan  AP Bureau Chief
Published on: 24 Sept 2026 12:14 PM IST
Amaravati
X

Amaravati: మున్సిపల్ కమిషనర్లతో మంత్రి నారాయణ టెలికాన్ఫరెన్స్!

Amaravati: భారీ వర్షాల నేపథ్యంలో వర్ష ప్రభావిత జిల్లాల్లోని మున్సిపల్ కమిషనర్లతో మంత్రి నారాయణ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కమిషనర్లను ఆదేశించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. వర్షపు నీరు, మురుగునీరు సాఫీగా వెళ్లేలా డ్రెయిన్లను ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు. డ్రెయిన్లలో సిల్ట్ పేరుకుపోవడం వల్ల నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడకుండా ముందుగానే సిల్ట్‌ను తొలగించాలని సూచించారు.

వర్షాల సమయంలో పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా మున్సిపల్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. ఇంజనీరింగ్, పారిశుధ్య విభాగాలకు చెందిన సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉండేలా కమిషనర్లు చర్యలు తీసుకోవాలని చెప్పారు. అవసరమైన ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని అందుబాటులో ఉంచాలని సూచించారు.

భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా రోడ్లపై చెట్లు విరిగిపడే అవకాశం ఉన్నందున ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని మంత్రి నారాయణ తెలిపారు. చెట్లు కూలిపడితే ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా వెంటనే తొలగించేలా అవసరమైన యంత్రాలు, సిబ్బందిని సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు.

ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, అత్యవసర సమాచారాన్ని వెంటనే స్వీకరించి స్పందించేలా మున్సిపల్ కార్యాలయాల్లో ప్రత్యేక కాల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. వర్షాల సమయంలో విద్యుత్, రహదారులు, డ్రెయినేజీ, పారిశుధ్య సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను ఆలస్యం లేకుండా పరిష్కరించాలని చెప్పారు.

వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని, అవసరమైతే క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని మంత్రి నారాయణ కమిషనర్లను ఆదేశించారు. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ మున్సిపల్ యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా పనిచేయాలని స్పష్టం చేశారు.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.