Nara Lokesh: గుంటూరు టీడీపీ ప్రజాప్రతినిధులతో లోకేష్ ఆత్మీయ భేటీ!

Nara Lokesh: గుంటూరులో టీడీపీ నేతలతో మంత్రి నారా లోకేష్ ఆత్మీయ విందు భేటీ. స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత, ప్రభుత్వ సంక్షేమ పథకాల విస్తృత ప్రచారంపై నేతలకు దిశానిర్దేశం.

K.Sriharibabu, Kovur (Nellore Dsct)
Published on: 18 Sept 2026 10:37 PM IST
Nara Lokesh
X

Nara Lokesh: గుంటూరు టీడీపీ ప్రజాప్రతినిధులతో లోకేష్ ఆత్మీయ భేటీ!

Nara Lokesh: గుంటూరు పార్లమెంట్ పరిధిలోని తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులతో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం ఆత్మీయ విందు భేటీ నిర్వహించారు. గుంటూరు సాయిబాబా రోడ్డు, వినాయక నగర్‌లో ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు నివాసంలో జరిగిన ఈ సమావేశానికి గుంటూరు పార్లమెంట్ పరిధిలోని టీడీపీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, గుంటూరు పార్లమెంట్ పరిధిలో పార్టీ పరిస్థితి, స్థానికంగా ప్రజల నుంచి వస్తున్న సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ–అభివృద్ధి కార్యక్రమాల అమలు తదితర అంశాలపై నేతలు చర్చించారు. ముఖ్యంగా త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ శ్రేణులు అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి స్థాయిలో సమన్వయంతో పనిచేయాలని మంత్రి నారా లోకేష్ నేతలకు సూచించారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం పెంచుకోవాలని దిశానిర్దేశం చేశారు. స్థానిక ఎన్నికలను పార్టీకి అత్యంత కీలకంగా తీసుకుని క్షేత్రస్థాయిలో బలమైన కార్యాచరణతో ముందుకు వెళ్లాలని సూచించినట్లు తెలుస్తోంది.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని లోకేష్ సూచించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేపట్టిన కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల వివరాలను ప్రతి గ్రామంలో ప్రజలకు వివరించాలని నేతలకు చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజలకు స్పష్టమైన సమాచారం అందేలా స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పనిచేయాలని సూచించారు.

అదే సమయంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న పరిణామాలు, వైసీపీ పాలనలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను కూడా ప్రజలకు వివరించాలని లోకేష్ నేతలకు సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు వాస్తవాలతో సమాధానం ఇవ్వాలని, వ్యక్తిగత విమర్శలకు కాకుండా ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టాలని సూచించినట్లు సమాచారం.

గుంటూరు పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితి, స్థానికంగా ఉన్న రాజకీయ సమీకరణాలు, రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, సామాజిక సమీకరణాలు, స్థానిక నాయకత్వం పాత్ర వంటి అంశాలపై కూడా నేతల మధ్య అభిప్రాయాలు పంచుకున్నట్లు సమాచారం.

ఈ భేటీకి గుంటూరు ఎంపీ, కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాజ్యసభ ఎంపీ భాష్యం రామకృష్ణ, గుంటూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మహ్మద్ నసీర్, పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి, గుంటూరు జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు.

స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడంతో పాటు గుంటూరు పార్లమెంట్ పరిధిలో నేతల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ ఆత్మీయ భేటీ సాగినట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి.

K.Sriharibabu, Kovur (Nellore Dsct)

K.Sriharibabu, Kovur (Nellore Dsct)