Vijayawada: 140 కోట్ల మందికి ఆహార భద్రత కల్పించిన నేత మోదీ: నాదెండ్ల!
Vijayawada: విజయవాడలో ‘ఆశీర్వాద్ కా దియా’ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్. మోదీ జన్మదినం సందర్భంగా త్వరలోనే రాయితీపై ఉల్లి, కందిపప్పు, పామాయిల్ పంపిణీ ప్రకటన.
Vijayawada: 140 కోట్ల మందికి ఆహార భద్రత కల్పించిన నేత మోదీ: నాదెండ్ల!
విజయవాడ: 140 కోట్ల మంది భారతీయులకు ఆహార భద్రత కల్పించిన గొప్ప దార్శనిక నేత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని విజయవాడలో నిర్వహించిన ‘ఆశీర్వాద్ కా దియా’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావుతో కలిసి లక్ష్మీపతి నగర్‌లో దినసరి కూలీ నూకరాజు ఇంటి ఆవరణలో దీపాలు వెలిగించి ప్రధానమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. గతంలో రాయితీపై అందించే ఆహార ధాన్యాలను ప్రస్తుతం పూర్తిగా ఉచితంగా దేశ ప్రజలకు అందించే స్థాయికి తీసుకువచ్చిన ఘనత మోదీకి దక్కుతుందని పేర్కొన్నారు. మోదీ వంటి నాయకత్వం దేశానికి అవసరమని, ఆయన భారతదేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. మోదీకి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు దీపాలు వెలిగించి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారని చెప్పారు.
కేంద్ర సహకారంతో పౌరసరఫరాల్లో మార్పులు
కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో పౌరసరఫరాల శాఖ ద్వారా ప్రజలకు సత్వర సేవలు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన రైతుల ఖాతాల్లో 24 గంటల్లోనే డబ్బులు జమ చేసే విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందించే బియ్యంలో గతంలో సుమారు 25 శాతం వరకు ఉన్న నూకలను రాష్ట్రవ్యాప్తంగా 10 శాతానికి తగ్గించామని తెలిపారు. ఇదే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేయడం సంతోషకరమని అన్నారు.
రాబోయే రోజుల్లో పౌరసరఫరాల శాఖ ద్వారా మరిన్ని వినూత్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
ఈ వారంలోనే రాయితీపై ఉల్లి
నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రజలకు తక్కువ ధరకు ఉల్లి అందించే చర్యలు చేపడుతున్నామని మంత్రి తెలిపారు. ఈ వారంలోనే రాష్ట్రవ్యాప్తంగా రాయితీపై ఉల్లి అందించేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి, ప్రజలకు అందుబాటు ధరల్లో ఉల్లి లభించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఉల్లితో పాటు త్వరలోనే పామాయిల్, కందిపప్పును కూడా రాయితీ ధరలకు అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కీలక సమయంలో తక్కువ ధరలకు నిత్యావసర వస్తువులు అందించడంలో కేంద్ర ప్రభుత్వ సహకారం ఎంతో ఉందని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి రాష్ట్ర ప్రజల తరఫున మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ కన్నబాబు, జనసేన నాయకులు అమ్మిశెట్టి వాసు, మండలి రాజేష్, వీర మహిళ విభాగం రీజినల్ కోఆర్డినేటర్ మల్లెపు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.




