విధ్వంసం వైసీపీ నైజం.. అభివృద్ధి కూటమి లక్ష్యం మంత్రి కందుల దుర్గేష్..

Amaravati: స్థానిక ఎన్నికల్లో ఓటమి భయంతోనే జగన్ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని మంత్రి కందుల దుర్గేష్ విమర్శించారు. వైసీపీ గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్.

Hari Kishan  AP Bureau Chief
Published on: 23 Oct 2026 11:23 PM IST
Amaravati
X

విధ్వంసం వైసీపీ నైజం.. అభివృద్ధి కూటమి లక్ష్యం మంత్రి కందుల దుర్గేష్..

అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని మంత్రి కందుల దుర్గేష్ విమర్శించారు. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన వైసీపీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు వెనుకాడుతోందని, ఎన్నికల ప్రక్రియను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన వైసీపీ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు.

నాడు ఏకగ్రీవాలు.. నేడు నీతులు

2021లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బెదిరింపులతో ఏకగ్రీవాలు సాధించిందని మంత్రి ఆరోపించారు. అప్పట్లో ఏకగ్రీవాలను సమర్థించిన జగన్‌ ఇప్పుడు వాటిపై నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తోందని పేర్కొన్నారు. టీడీపీ కంటే వైసీపీనే ఎక్కువ నామినేషన్లు దాఖలు చేసిందని చెబుతూ, తాము ఎన్నికలను అడ్డుకుంటే ఇన్ని నామినేషన్లు ఎలా వచ్చేవని ప్రశ్నించారు.

ఎన్నికలపై కుట్రలు చేస్తున్నారంటూ విమర్శలు

బయటి రాష్ట్రాల నుంచి బౌన్సర్లను తీసుకొచ్చి ఎన్నికల సమయంలో ఉద్రిక్తతలు సృష్టించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని దుర్గేష్ ఆరోపించారు. పలు ప్రాంతాల్లో దాడులు, అల్లర్లకు పాల్పడుతోందని విమర్శించారు. ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా జరగాలన్నదే కూటమి ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తూ ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు.

అభివృద్ధే కూటమి లక్ష్యం

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజావేదిక కూల్చివేతతో విధ్వంసకర పాలన ప్రారంభమైందని మంత్రి విమర్శించారు. రాష్ట్రానికి దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూర్చే ప్రాజెక్టులు, యువతకు ఉద్యోగాల కల్పన వంటి అంశాల్లో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సి ఉన్నా, వైసీపీ రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యమిచ్చిందని ఆరోపించారు. రెండేళ్ల కూటమి పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, ఎన్నికల్లో ప్రజల మద్దతు తమకు లభిస్తుందనే నమ్మకం ఉందని చెప్పారు. సాధారణ ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలుపై ప్రజల్లో సానుకూలత ఉందని పేర్కొన్నారు.

వైసీపీపై చర్యలు తీసుకోవాలి

పుంగనూరు, రాయచోటి, తంబళ్లపల్లె, తిరుపతి, కనిగిరి, అనంతపురం, ధర్మవరం తదితర ప్రాంతాల్లో వైసీపీ నేతలు అరాచకాలకు పాల్పడ్డారని మంత్రి ఆరోపించారు. ఆయా ఘటనలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఎన్నికల సమయంలో శాంతిభద్రతలను కాపాడాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. వైసీపీ గుర్తింపును రద్దు చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు.

ప్రజలే అంతిమ నిర్ణేతలు

కోర్టు కేసులతోనో, రాజకీయ ఆరోపణలతోనో ప్రజాతీర్పును అడ్డుకోలేరని దుర్గేష్ వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులను అడ్డుకునే ప్రయత్నాలు రాష్ట్ర అభివృద్ధికి నష్టం కలిగిస్తాయని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలని, ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవడమే రాజకీయ పార్టీలకు నిజమైన విజయమని పేర్కొన్నారు.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.