AP: టీచర్లపై దాడి హేయం.. తప్పుడు ప్రచారాలపై కఠిన చర్యలు: మంత్రి డోలా!

AP: ఉపాధ్యాయులపై దాడి చేయడం హేయమైన చర్య: సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ఆగ్రహం.

Hari Kishan  AP Bureau Chief
Published on: 21 Sept 2026 9:45 PM IST
AP
X

AP: టీచర్లపై దాడి హేయం.. తప్పుడు ప్రచారాలపై కఠిన చర్యలు: మంత్రి డోలా!

AP: విద్యార్థులకు విద్యతో పాటు క్రమశిక్షణ, మంచి విలువలు నేర్పే ఉపాధ్యాయులపై దాడులకు పాల్పడటం హేయమైన చర్య అని రాష్ట్ర మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మండిపడ్డారు. టీచర్లపై వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డాయంటూ ఆరోపించిన మంత్రి.. రౌడీషీటర్లు, గంజాయి బ్యాచ్‌లను తీసుకొచ్చి ఉపాధ్యాయులపై దాడులు చేయడం జగన్‌కు సిగ్గుగా అనిపించడం లేదా అని ప్రశ్నించారు.

గొడ్డలి పార్టీ చేస్తున్న తప్పుడు ఆరోపణలకు నిరసనగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్న టీచర్లపై దాడి చేయడం సభ్య సమాజం తలదించుకునే చర్య అని మంత్రి విమర్శించారు. ఉపాధ్యాయులు తమ సమస్యలు, ప్రభుత్వ నిర్ణయాలపై శాంతియుతంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు ఉందన్నారు. అలాంటి వారిపై దాడులకు పాల్పడటం ద్వారా భయపెట్టాలని చూస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.

వైసీపీ ఐదేళ్ల పాలనలో ఒక్క టీచర్ పోస్టును కూడా భర్తీ చేయలేదని మంత్రి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీ మేరకు పారదర్శకంగా డీఎస్సీ నిర్వహించి 16 వేల టీచర్ ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో పారదర్శకతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న నియామకాలు, విద్యారంగ సంస్కరణలను ఓర్వలేక వైసీపీ తప్పుడు ప్రచారాలకు తెరతీస్తోందని విమర్శించారు.

సోషల్ మీడియా, ఇతర వేదికల ద్వారా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తూ ప్రజల్లో అపోహలు, ఉద్రిక్తతలు సృష్టించే ప్రయత్నాలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని మంత్రి తెలిపారు. సమాజంలో తప్పుడు ప్రచారాలు చేస్తూ అల్లర్లకు కారణమయ్యే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరించే ఏ వ్యక్తినీ ప్రభుత్వం ఉపేక్షించదని స్పష్టం చేశారు.

ఇదే సమయంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రూప్-1 ఉద్యోగాల నియామకాల్లో అక్రమాలు జరిగాయని మంత్రి ఆరోపించారు. ఈ వ్యవహారంలో సుమారు రూ.150 కోట్ల మేర అక్రమాలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. గ్రూప్-1 స్కామ్‌పై దర్యాప్తు కొనసాగుతోందని, ఇందులో ప్రమేయం ఉన్నట్లు తేలిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ వ్యవహారంలో ఎంతటి వ్యక్తులు ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి హెచ్చరించారు.

ఉపాధ్యాయుల గౌరవానికి భంగం కలిగించే చర్యలను సమాజం కూడా ఖండించాలని మంత్రి కోరారు. విద్యారంగాన్ని రాజకీయ వివాదాలకు వేదికగా మార్చకుండా, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అన్ని వర్గాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.