Amaravati: అమరావతి ORR పనులపై మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి సమీక్ష!

Amaravati: అమరావతి ఓఆర్ఆర్, ఎన్‌హెచ్-544డి విస్తరణ పనులపై మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి సమీక్ష. 190 కి.మీ ఆరు లేన్ల ఓఆర్ఆర్ పనుల వేగవంతానికి ఎన్‌హెచ్ఏఐ అధికారులకు ఆదేశం.

Hari Kishan  AP Bureau Chief
Published on: 18 Sept 2026 10:31 PM IST
Amaravati
X

Amaravati: అమరావతి ORR పనులపై మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి సమీక్ష!

అమరావతి: రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధి పనులను వేగవంతం చేయడంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు (ORR), వినుకొండ–గుంటూరు జాతీయ రహదారి (NH-544D), గుంటూరు–నిజాంపట్నం హైవేకు సంబంధించిన పనులపై రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.

మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డిని NHAI అమరావతి ప్రాజెక్టు అమలు యూనిట్ ప్రాజెక్టు డైరెక్టర్ విరాజ్ సురాజ్ వాలా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కొనసాగుతున్న జాతీయ రహదారుల ప్రాజెక్టుల పురోగతిని ఆయన మంత్రికి వివరించారు. ముఖ్యంగా అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం, భూసేకరణకు సంబంధించిన అంశాలపై చర్చించారు.

అమరావతి ORRను సుమారు 190 కిలోమీటర్ల మేర ఆరు లేన్లతో నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రాజెక్టు ఐదు జిల్లాల పరిధిలో కొనసాగనుంది. ORR నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియ ఏ దశలో ఉందనే అంశంపై మంత్రి అధికారులను ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో భూసేకరణకు సంబంధించి ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు.

అలాగే వినుకొండ–గుంటూరు NH-544D విస్తరణ పనులపైనా సమావేశంలో చర్చ జరిగింది. ప్రస్తుతం రెండు లేన్లుగా ఉన్న ఈ జాతీయ రహదారిని నాలుగు లేన్లుగా విస్తరిస్తున్నట్లు NHAI అధికారులు మంత్రికి వివరించారు. రహదారి విస్తరణతో గుంటూరు, పల్నాడు ప్రాంతాల మధ్య రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి.

గుంటూరు–నిజాంపట్నం హైవేకు సంబంధించి అలైన్‌మెంట్‌కు ఆమోదం లభించిందని అధికారులు తెలిపారు. తదుపరి ఈ ప్రతిపాదనను టెక్నికల్ కమిటీ ముందుకు పంపనున్నట్లు వెల్లడించారు. ప్రాజెక్టు తదుపరి దశలపై కూడా మంత్రి అధికారులతో చర్చించారు.

అమరావతి ORR నిర్మాణానికి అవసరమైన ఫ్లై యాష్‌ను ఉచితంగా సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపిన విషయాన్ని మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం NHAIకు ప్రాజెక్టు నిర్మాణంలో మరింత వెసులుబాటు కల్పిస్తుందని పేర్కొన్నారు.

జాతీయ రహదారుల ప్రాజెక్టుల నిర్మాణంలో క్షేత్రస్థాయిలో ఏవైనా సమస్యలు ఎదురైతే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని మంత్రి అధికారులకు సూచించారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని హామీ ఇచ్చారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు రాష్ట్రంలో చేపడుతున్న జాతీయ రహదారి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. రహదారుల అభివృద్ధి రాష్ట్ర ఆర్థిక, పారిశ్రామిక, రవాణా రంగాల పురోగతికి కీలకమని పేర్కొన్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా జాతీయ రహదారి ప్రాజెక్టులకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసి, పెండింగ్‌లో ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. NHAI, రాష్ట్ర ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయంతో పనులను ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు.

అమరావతి ORRతో పాటు గుంటూరు–వినుకొండ, గుంటూరు–నిజాంపట్నం రహదారుల అభివృద్ధి పూర్తయితే రాజధాని ప్రాంతానికి మెరుగైన రహదారి అనుసంధానం ఏర్పడటంతో పాటు, సరకు రవాణా, పారిశ్రామిక కార్యకలాపాలకు కూడా మరింత ఊతం లభించే అవకాశం ఉంది.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.