Amaravati: పోర్టుల అభివృద్ధిపై ఏపీ–మహారాష్ట్ర మంత్రుల చర్చ!
Amaravati: అమరావతిలో మహారాష్ట్ర పోర్టుల మంత్రి నితేష్ రాణేతో భేటీ అయిన ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఏపీలో పోర్టుల అభివృద్ధి, కొత్త మారిటైమ్ పాలసీపై చర్చ.
Amaravati: పోర్టుల అభివృద్ధిపై ఏపీ–మహారాష్ట్ర మంత్రుల చర్చ!
Amaravati: ఆంధ్రప్రదేశ్‌లో పోర్టుల అభివృద్ధి, మారిటైమ్ రంగంలో చేపడుతున్న కార్యక్రమాలపై రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు–మౌలిక వసతుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో మహారాష్ట్ర పోర్టులు, మత్స్యశాఖ మంత్రి నితేష్ రాణే చర్చించారు. సచివాలయంలోని ఆర్అండ్‌బీ, ఐఅండ్ఐ శాఖ కార్యాలయానికి వచ్చిన నితేష్ రాణేకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఏపీ మారిటైమ్ బోర్డు సీఈవో ప్రవీణ్ ఆదిత్య, సీఈ రాఘవరావు, ఇతర ఉన్నతాధికారులు ఆత్మీయ స్వాగతం పలికారు.
సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌లో చేపడుతున్న గ్రీన్‌ఫీల్డ్ పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ లాండింగ్ సెంటర్లు, పీపీపీ విధానం, నూతన మారిటైమ్ పాలసీపై రాష్ట్ర అధికారులు మహారాష్ట్ర ప్రతినిధి బృందానికి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పోర్టుల అభివృద్ధిలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని అధికారులు వివరించారు.
దేశంలోనే ప్రత్యేకంగా ల్యాండ్ లార్డ్ మోడల్‌లో మూడు గ్రీన్‌ఫీల్డ్ పోర్టులను అభివృద్ధి చేస్తున్న ఏపీ ప్రభుత్వ విధానాన్ని మహారాష్ట్ర మంత్రి నితేష్ రాణే ప్రశంసించారు. ప్రభుత్వం పోర్టులకు అవసరమైన మౌలిక వసతులను కల్పించి, ప్రైవేట్ సంస్థలకు కార్యకలాపాలను అప్పగించే విధానం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
మూడు గ్రీన్‌ఫీల్డ్ పోర్టుల నిర్మాణానికి ఒక్కో పోర్టుకు సుమారు రూ.4,500 కోట్ల చొప్పున పెట్టుబడి అవసరమవుతుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. 2027 నాటికి పోర్టుల నిర్మాణాన్ని పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. సముద్రతీరం లేని తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల ఎగుమతులు, దిగుమతులకు ఆంధ్రప్రదేశ్‌లోని పోర్టులు కీలకంగా మారనున్నాయని వివరించారు.
షిప్‌బిల్డింగ్ రంగంలోనూ రాష్ట్రం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి తెలిపారు. దుగరాజపట్నం, మచిలీపట్నంలో షిప్‌బిల్డింగ్ అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని, కాకినాడలో షిప్‌బిల్డింగ్ ప్రతిపాదన కూడా పురోగతిలో ఉందని చెప్పారు.
మత్స్యకారుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ మారిటైమ్ బోర్డు ఆధ్వర్యంలో ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ లాండింగ్ సెంటర్లను అభివృద్ధి చేస్తున్నామని అధికారులు వివరించారు. ఈ విధానంపై మహారాష్ట్ర మంత్రి నితేష్ రాణే ఆసక్తి వ్యక్తం చేశారు.
విజయవాడ–అమరావతి వాటర్ మెట్రోకు అనుమతులు లభించినట్లు, సీప్లేన్ సేవల కోసం తొమ్మిది ప్రాంతాలను గుర్తించినట్లు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. శ్రీశైలం–విజయవాడ మధ్య సీప్లేన్ ట్రయల్ రన్ వంటి ప్రతిపాదనలపై కూడా సమావేశంలో చర్చించారు.
రాయలసీమలో ఉత్పత్తి అయ్యే హార్టికల్చర్ ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు, విదేశీ మార్కెట్లకు వేగంగా తరలించేందుకు మల్టీమోడల్ లాజిస్టిక్స్ పార్కుల నిర్మాణానికి చర్యలు చేపడుతున్నామని మారిటైమ్ బోర్డు అధికారులు తెలిపారు. తీరప్రాంతంలో ఉన్న సుమారు 20 వేల ఎకరాల ఉప్పు భూములను ల్యాండ్ బ్యాంక్‌గా వినియోగించేందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపినట్లు వివరించారు.
ఏపీలో పోర్టులు, రైల్వేలు, జాతీయ రహదారుల పనులను వేగవంతం చేసేందుకు మంత్రి నేతృత్వంలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసిన విధానాన్ని కూడా నితేష్ రాణే ప్రశంసించారు. మారిటైమ్, షిప్‌బిల్డింగ్, ఫిషింగ్ హార్బర్ రంగాల్లో యువతకు నైపుణ్య శిక్షణ అందించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఏపీ మారిటైమ్ బోర్డు అధికారులు తెలిపారు. సమావేశంలో మహారాష్ట్ర మారిటైమ్ బోర్డు సీఈవో ప్రదీప్ పి., సీపీఓ కెప్టెన్ ప్రవీణ్ ఖారా, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మనీష్ మెట్కర్ తదితరులు పాల్గొన్నారు.




