Amaravati: దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత..మంత్రి సంతాపం!

Amaravati: ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు (94) చెన్నైలో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Hari Kishan  AP Bureau Chief
Published on: 4 Oct 2026 7:54 AM IST
Amaravati
X

Amaravati: దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత..మంత్రి సంతాపం!

Amaravati: ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి పట్ల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన దిగ్గజ దర్శకుడిగా సింగీతం శ్రీనివాసరావు నిలిచిపోయారని మంత్రి పేర్కొన్నారు. విభిన్న కథాంశాలను ఎంచుకుని, ప్రయోగాత్మక చిత్రాలను తెరకెక్కిస్తూ ప్రేక్షకుల ఆదరణతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందిన అరుదైన దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు అని కొనియాడారు.

సింగీతం శ్రీనివాసరావు మృతి భారతీయ సినీ పరిశ్రమకు తీరని లోటని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

దశాబ్దాల పాటు సాగిన సింగీతం శ్రీనివాసరావు సినీ ప్రయాణం ప్రయోగాలకు, కొత్త ఆలోచనలకు ప్రతీకగా నిలిచిందని మంత్రి గుర్తుచేశారు. అప్పటి వరకు భారతీయ సినిమాల్లో పెద్దగా కనిపించని విభిన్న కథనాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో ఆయన ప్రత్యేకత చూపించారని తెలిపారు.

మాటలున్న టాకీ సినిమాల కాలంలోనే దాదాపు మాటలు లేకుండా తెరకెక్కించిన ‘పుష్పక విమానం’ చిత్రంతో సింగీతం శ్రీనివాసరావు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారని మంత్రి పేర్కొన్నారు. హాస్యాన్ని ప్రధానంగా చేసుకుని, సంభాషణలు లేకుండానే కథను ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పిన తీరు ఆయన సృజనాత్మక ప్రతిభకు నిదర్శనమన్నారు.

అదేవిధంగా భారతీయ వెండితెరకు టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌ను పరిచయం చేస్తూ తెరకెక్కించిన ‘ఆదిత్య 369’ చిత్రం సైన్స్ ఫిక్షన్ సినిమాలకు కొత్త దారిని చూపించిందని తెలిపారు. అప్పటి సాంకేతిక పరిమితుల మధ్య కూడా వినూత్న ఆలోచనలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారని అన్నారు.

ఆధునిక కంప్యూటర్ గ్రాఫిక్స్ అందుబాటులో లేని కాలంలోనే లెన్స్ ట్రిక్స్, కెమెరా సాంకేతికతను వినియోగించి ‘అపూర్వ సహోదరులు’ చిత్రంలో మరుగుజ్జు పాత్రలను సృష్టించిన తీరు సింగీతం శ్రీనివాసరావు సాంకేతిక ఆలోచనా విధానానికి నిదర్శనమని మంత్రి అన్నారు. పరిమిత వనరులతోనే తెరపై అద్భుతాలను సృష్టించగలిగిన దర్శకుడిగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారని తెలిపారు.

దశాబ్దాల సినీ ప్రస్థానంలో నిరంతరం కొత్తదనాన్ని అన్వేషించిన సింగీతం శ్రీనివాసరావు 94 ఏళ్ల వయసులోనూ సృజనాత్మక ఆలోచనలకు ప్రాధాన్యం ఇచ్చారని మంత్రి పేర్కొన్నారు. వయసుతో సంబంధం లేకుండా కొత్త కథలు, కొత్త సాంకేతికత, కొత్త కథనాలను ఆలోచించవచ్చని నేటి తరం దర్శకులకు ఆయన జీవితం, సినీ ప్రయాణం ఆదర్శంగా నిలిచిందన్నారు.

భారతీయ సినిమా చరిత్రలో ప్రయోగాత్మక చిత్రాలకు, వినూత్న కథనాలకు ప్రత్యేక స్థానం కల్పించిన సింగీతం శ్రీనివాసరావు జ్ఞాపకాలు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.