AP: త్వరలో న్యాయవాదుల రక్షణ బిల్లు: మంత్రి ఎన్ఎండీ ఫరూక్!
AP: రాష్ట్రంలో న్యాయవాదుల రక్షణ బిల్లు-2026ను త్వరలోనే తీసుకువస్తామని, లాయర్ల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఎన్ఎండీ ఫరూక్ స్పష్టం చేశారు.
AP: త్వరలో న్యాయవాదుల రక్షణ బిల్లు: మంత్రి ఎన్ఎండీ ఫరూక్!
AP: రాష్ట్రంలోని న్యాయవాదుల రక్షణ, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని న్యాయ, మైనారిటీ శాఖల మంత్రి ఎన్ఎండి ఫరూక్ స్పష్టం చేశారు. న్యాయవాదుల సంక్షేమం కోసం ఇప్పటికే పలు చర్యలు చేపట్టామని, న్యాయవాదుల రక్షణ బిల్లు-2026ను త్వరగా తీసుకురావడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోందని తెలిపారు.
బుధవారం వెలగపూడి సచివాలయంలోని మూడో బ్లాక్‌లో మంత్రి ఫరూక్‌ను పశ్చిమ గోదావరి జిల్లా బార్ ఫెడరేషన్, ఒంగోలు బార్ అసోసియేషన్, హిందూ లాయర్స్ ఫోరం, ఇతర న్యాయవాదుల సంఘాల ప్రతినిధులు కలిశారు. న్యాయవాదుల రక్షణ బిల్లు, న్యాయమిత్ర, అడ్వొకేట్ వెల్ఫేర్ ఫండ్, హెల్త్ కార్డులు తదితర అంశాలపై వారు మంత్రికి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల రక్షణ బిల్లు-2026 రూపకల్పనకు ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించిందన్నారు. న్యాయవాదుల రక్షణకు అవసరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని ముసాయిదా బిల్లును వీలైనంత త్వరగా సిద్ధం చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ముసాయిదా బిల్లు సిద్ధమైన అనంతరం మంత్రి మండలి ఆమోదం కోసం ప్రవేశపెట్టనున్నట్లు న్యాయవాదుల ప్రతినిధులకు తెలిపారు.
న్యాయవాదులు వృత్తిపరంగా ఎదుర్కొంటున్న సమస్యలు, వారి భద్రత, కుటుంబాల సంక్షేమానికి సంబంధించిన అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం న్యాయవాదుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందని స్పష్టం చేశారు.
ఇప్పటికే రాష్ట్రంలో మరణించిన 1,173 మంది న్యాయవాదుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున మొత్తం రూ.46.92 కోట్ల ఆర్థిక సాయం ప్రభుత్వం విడుదల చేసిందని మంత్రి ఫరూక్ గుర్తు చేశారు. న్యాయవాదుల సంక్షేమానికి సంబంధించిన మిగిలిన అంశాలపైనా దశలవారీగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. న్యాయవాదుల ప్రతినిధులు ప్రస్తావించిన సమస్యలను ప్రభుత్వం పరిశీలించి తగిన నిర్ణయాలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు.




