Vijayawada: ప్రజలకు సమాచారం వేగంగా చేరాలి: కొలుసు పార్థసారధి!
Vijayawada: ప్రభుత్వ సమాచారాన్ని పారదర్శకంగా ప్రజలకు చేరవేసేందుకు సమాచార, పౌర సంబంధాల శాఖ రూపొందించిన నూతన మొబైల్, వెబ్ యాప్‌ను మంత్రి కొలుసు పార్థసారధి ప్రారంభించారు.
Vijayawada: ప్రజలకు సమాచారం వేగంగా చేరాలి: కొలుసు పార్థసారధి!
విజయవాడ: ప్రభుత్వ కార్యకలాపాలు, పథకాలు, నిర్ణయాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు మరింత వేగంగా, పారదర్శకంగా చేరవేసేందుకు రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ రూపొందించిన సమీకృత మొబైల్, వెబ్ అప్లికేషన్ అందుబాటులోకి వచ్చింది. విజయవాడలోని తన కార్యాలయంలో సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి గురువారం ఈ డిజిటల్ యాప్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రజలు సమాచారాన్ని స్వీకరించే విధానంలోనూ గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సమాచారాన్ని వేగంగా, విశ్వసనీయంగా, డిజిటల్ మాధ్యమాలు, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరవేయాలనే లక్ష్యంతో ఈ యాప్‌ను రూపొందించినట్లు తెలిపారు. ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన ప్రామాణిక సమాచారాన్ని అత్యంత వేగంగా ప్రజలకు అందించడంలో యాప్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
ప్రభుత్వం, మీడియా, ప్రజల మధ్య మరింత బలమైన డిజిటల్ వారధిగా ఈ వ్యవస్థ పనిచేస్తుందని మంత్రి అన్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న మాన్యువల్ ప్రక్రియలను డిజిటల్ విధానంలోకి తీసుకురావడంతో పాటు, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య సమాచార అనుసంధానాన్ని మరింత బలోపేతం చేయడానికి ఇది దోహదపడుతుందని తెలిపారు.
సరైన సమాచారాన్ని సరైన సమయంలో, సరైన డిజిటల్ మాధ్యమం ద్వారా ప్రజలకు చేరవేయడమే లక్ష్యంగా సాంకేతికతను వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. యాప్ రూపకల్పన, అమలుకు కృషి చేసిన సమాచార, పౌర సంబంధాల శాఖ సంచాలకులు కే. విశ్వనాథన్, ఐఏఎస్‌తో పాటు శాఖ అధికారులు, సాంకేతిక బృందాన్ని మంత్రి అభినందించారు.
శాఖ సంచాలకులు కే. విశ్వనాథన్ మాట్లాడుతూ.. ప్రభుత్వ సమాచార ప్రసార వ్యవస్థలోని వివిధ విభాగాలను సమీకరించి ఈ డిజిటల్ యాప్‌ను రూపొందించినట్లు తెలిపారు. పత్రికా ప్రకటనలు, ఎలక్ట్రానిక్ మీడియా, అవుట్‌డోర్ మీడియా, ఫ్యాక్ట్ చెక్, కేడర్ మేనేజ్‌మెంట్ తదితర విభాగాలకు సంబంధించిన సమాచారాన్ని ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వివరించారు.
ప్రభుత్వ సమాచార ప్రసారం, మీడియా నిర్వహణ, పౌర సంబంధాలు, వాస్తవాల ధృవీకరణ, ప్రకటనలు, కేడర్ నిర్వహణకు సంబంధించిన కార్యకలాపాలను ఈ యాప్ ద్వారా పర్యవేక్షించే అవకాశం ఉంటుందని తెలిపారు. మొబైల్ అప్లికేషన్ ద్వారా అధికారులు ఎక్కడి నుంచైనా శాఖకు సంబంధించిన ముఖ్యమైన కార్యకలాపాలను పర్యవేక్షించవచ్చని చెప్పారు.
క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న అధికారులు కూడా వార్తా విశేషాలు, ఫొటోలు, వీడియోలు, ఇతర సమాచారాన్ని యాప్ ద్వారా అప్‌లోడ్ చేసే అవకాశం ఉంటుందని విశ్వనాథన్ తెలిపారు. దీనివల్ల క్షేత్రస్థాయిలో జరుగుతున్న ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం వేగంగా కేంద్ర స్థాయికి చేరడంతో పాటు, ప్రజలకు కూడా త్వరితగతిన అందుబాటులోకి వస్తుందని చెప్పారు.
డిజిటల్ సాంకేతికతను వినియోగించుకోవడం ద్వారా ప్రభుత్వ సమాచార ప్రసారంలో వేగం, పారదర్శకత, సమన్వయం మరింత పెరుగుతాయని అధికారులు తెలిపారు. భవిష్యత్‌లో అవసరాలకు అనుగుణంగా యాప్‌ను మరింత అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ ఓ. మధుసూదన్, రీజనల్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ టి. నాగరాజు, మీడియా రిలేషన్స్ విభాగం ఉప సంచాలకులు దున్న రమేష్, డిజిటల్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. రాణి సుస్మిత, ప్రత్యేక అధికారి గల్లా శేషు కుమార్ తదితరులు పాల్గొన్నారు.




