Savitha: చేనేత పెన్షన్ల వెరిఫికేషన్‌లో అక్రమాలపై మంత్రి సవిత ఆగ్రహం!

Savitha: చేనేత పెన్షన్లు, సర్టిఫికెట్ల జారీలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మంత్రి సవిత హెచ్చరిక. శ్రీసత్యసాయి జిల్లాలో ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్, అధికారులతో వీసీ.

Hari Kishan  AP Bureau Chief
Published on: 19 Sept 2026 4:41 PM IST
Savitha
X

Savitha: చేనేత పెన్షన్ల వెరిఫికేషన్‌లో అక్రమాలపై మంత్రి సవిత ఆగ్రహం!

Savitha: చేనేత కార్మికులకు అందాల్సిన ప్రభుత్వ సంక్షేమ పథకాల విషయంలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర చేనేత, జౌళిశాఖ మంత్రి సవిత హెచ్చరించారు. అన్ని జిల్లాల చేనేత, జౌళిశాఖ అధికారులతో మంత్రి సవిత వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశంలో స్పెషల్ సీఎస్ ఆర్పీ సిసోడియాతో పాటు అన్ని జిల్లాల ఏడీలు పాల్గొన్నారు.

చేనేత పెన్షన్ల వెరిఫికేషన్ పేరుతో కొన్ని జిల్లాల్లో డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలపై మంత్రి సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హత కలిగిన నేతన్నలకు ప్రభుత్వ పథకాలు అందించాల్సిన అధికారులు, సిబ్బంది అక్రమాలకు పాల్పడటం ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు. పెన్షన్ వెరిఫికేషన్ కోసం లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అలాగే చేనేత కార్మికులకు అవసరమైన సర్టిఫికెట్ల జారీ విషయంలో చేతివాటం ప్రదర్శించినా ఉపేక్షించబోమని మంత్రి స్పష్టం చేశారు. సర్టిఫికెట్ల జారీలో అక్రమాలకు పాల్పడే ఉద్యోగులను విధుల నుంచి తొలగించేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. చేనేత రంగంపై ఆధారపడుతున్న పేద కుటుంబాలకు ప్రభుత్వ పథకాల ద్వారా ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నేతన్నల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి సవిత చెప్పారు. నేతన్నలకు ఆర్థికంగా మేలు చేకూర్చాలన్నదే సీఎం లక్ష్యమని, ఆ లక్ష్యాన్ని నీరుగార్చేలా అధికారులు వ్యవహరిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందేలా అధికారులు పనిచేయాలని ఆదేశించారు.

ఇదే సమయంలో రాష్ట్రంలో 50 ఏళ్లు నిండిన అర్హులైన నేతలందరికీ పెన్షన్లు అందించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి సవిత వెల్లడించారు. పెన్షన్ పథకానికి అర్హులైన వారి వివరాలను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. వెరిఫికేషన్ ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు.

కాగా, చేనేత పెన్షన్ల వెరిఫికేషన్‌లో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చిన శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన ఇద్దరు ఉద్యోగులపై మంత్రి సవిత ఆదేశాలతో చర్యలు తీసుకున్నారు. రమణారెడ్డి, శీనా నాయక్‌లను సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ చర్యల ద్వారా చేనేత సంక్షేమ పథకాల అమలులో అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమనే సంకేతాన్ని మంత్రి సవిత ఇచ్చారు.

అర్హులైన నేతన్నలకు సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, మధ్యవర్తులు లేదా అధికారులు లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని మంత్రి సూచించారు. జిల్లాల వారీగా పెన్షన్ల వెరిఫికేషన్, సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.