Amaravati: 2029 నాటికి ప్రభుత్వ పాఠశాలలు 4-స్టార్ స్థాయికి మంత్రి లోకేష్!
Amaravati: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచి, 2029 నాటికి అన్ని స్కూళ్లను 4-స్టార్ స్థాయికి తీసుకెళ్లాలని మంత్రి లోకేష్ ఆదేశించారు.
Amaravati: 2029 నాటికి ప్రభుత్వ పాఠశాలలు 4-స్టార్ స్థాయికి మంత్రి లోకేష్!
Amaravati: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. వచ్చే ఏడాది కాలంలో రాష్ట్రంలోని వన్-స్టార్ పాఠశాలలన్నింటినీ టూ-స్టార్ స్థాయికి అప్‌గ్రేడ్ చేయాలని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. 2029 నాటికి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను కనీసం 4-స్టార్ మౌలిక సదుపాయాల స్థాయికి తీసుకెళ్లేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు.
ఉండవల్లి నివాసంలో సోమవారం పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, స్కిల్ డెవలప్‌మెంట్ అంశాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుత విద్యా సంవత్సరంలో జీరో-స్టార్ పాఠశాలలన్నింటినీ వన్-స్టార్ స్థాయికి తీసుకురావాలని, 2029 నాటికి అన్ని పాఠశాలలను 4-స్టార్ స్థాయికి చేర్చాలని చెప్పారు. అదే సమయంలో కనీసం వెయ్యి పాఠశాలలను 5-స్టార్ స్థాయికి అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా ఏజెన్సీ, వెనుకబడిన ప్రాంతాల్లోని పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఒకటి చొప్పున 175 లీప్ స్కూళ్లను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని మంత్రి కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో వన్-స్టార్ కేటగిరీలో 1,685, టూ-స్టార్‌లో 15,618, త్రీ-స్టార్‌లో 19,099, ఫోర్-స్టార్‌లో 7,172 పాఠశాలలు ఉన్నట్లు పాఠశాల మౌలిక సదుపాయాల శాఖ కమిషనర్ రంజిత్ బాషా తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి పురోగతిపై డీఈవోలు, ఎంఈవోలు, సీఆర్‌పీలకు స్పష్టమైన బాధ్యతలు అప్పగించాలని మంత్రి సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 7 వేల హైస్కూళ్లలో పూర్తిస్థాయి కంప్యూటర్ ల్యాబ్‌లు, అటల్ టింకరింగ్ ల్యాబ్‌ల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. అకడమిక్ సంస్కరణలు పూర్తయినందున ఇకపై అధికారులు, ఉపాధ్యాయులు ప్రధానంగా విద్యార్థుల అభ్యసన ఫలితాల మెరుగుదలపై దృష్టి సారించాలని సూచించారు.
స్కిల్ డెవలప్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి
విద్యార్థులకు చదువుతో పాటు ఉద్యోగ అవకాశాలకు అవసరమైన నైపుణ్యాలను అందించేందుకు స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలను విస్తరించాలని మంత్రి లోకేష్ సూచించారు. కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన (PMKVY) ద్వారా ఈ ఏడాది రాష్ట్రంలో 5 లక్షల మంది విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం (PMIS), ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్‌షిప్ స్కీం (PMNAPS) వంటి కేంద్ర పథకాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని చెప్పారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీయువకులను స్కిల్ పోర్టల్‌లోకి తీసుకువచ్చి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత విధానాలతో ఇంటర్వ్యూలకు సిద్ధం చేయాలని సూచించారు.
సీడాప్, ఓంక్యాప్‌ల ద్వారా జర్మన్, జపనీస్ వంటి విదేశీ భాషల్లో శిక్షణ ఇచ్చి అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలకు యువతను సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. సమావేశంలో మానవ వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి జె. శ్యామలరావు, కమిషనర్ రంజిత్ బాషా, ఏపీఎస్ఈఐసీ ఎండీ దీవెన్ రెడ్డి, స్కిల్ డెవలప్‌మెంట్ సీఈవో నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.




