Amaravati: ఏపీ స్థానిక సంస్థల రిజర్వేషన్లపై కీలక ఉత్తర్వులు.. జీవో 153 విడుదల!
Amaravati: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల ఖరారుపై ప్రభుత్వం జీవో 153 జారీ చేసింది.
Amaravati: ఏపీ స్థానిక సంస్థల రిజర్వేషన్లపై కీలక ఉత్తర్వులు.. జీవో 153 విడుదల!
Amaravati: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల ఖరారుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ గతంలో జారీ చేసిన జీవోలో మార్పులు చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి మొత్తం నిలువు రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా స్థానిక సంస్థల వారీగా రిజర్వేషన్లు నిర్ణయించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జీవో నంబర్ 153ను విడుదల చేసింది.
కోర్టు తీర్పులకు అనుగుణంగా సవరణలు
గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లలోని సీట్లు, పదవులకు బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం గతంలో ఆగస్టు 20న జీవో నంబర్ 105 జారీ చేసింది. అయితే ఈ రిజర్వేషన్లను సవాలు చేస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై విచారణ జరిపిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అక్టోబర్ 1న తీర్పు వెలువరించింది.
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి మొత్తం నిలువు రిజర్వేషన్లు 50 శాతానికి మించిన మేరకు జీవో 105, జీవో ఆర్‌టీ 1065 అమలు చేయడం చెల్లదని పేర్కొంటూ ఆ మేరకు వాటిని కొట్టివేసింది. చట్ట నిబంధనలకు లోబడి, అవసరమైన అనుభవాధారిత సమాచార సేకరణ పూర్తిచేసిన తర్వాత బీసీ రిజర్వేషన్ల శాతాన్ని ప్రభుత్వం పునఃపరిశీలించవచ్చని కూడా హైకోర్టు స్పష్టం చేసింది.
హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే అక్టోబర్ 9న సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకునేందుకు నిరాకరించి, ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ నేపథ్యంలో కోర్టుల ఆదేశాలకు అనుగుణంగా పాత ఉత్తర్వుల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం తాజాగా జీవో జారీ చేసింది.
డెడికేటెడ్ కమిషన్ సిఫార్సులకు ఆమోదం
స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి డెడికేటెడ్ కమిషన్ చేసిన సిఫార్సులను ప్రభుత్వం అక్టోబర్ 10న జారీ చేసిన జీవో నంబర్ 17 ద్వారా ఆమోదించింది. తాజాగా గ్రామీణ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల నిర్ణయానికి ఈ సిఫార్సులను అమలు చేయాలని జీవో 153లో పేర్కొంది. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి ప్రతి గ్రామీణ స్థానిక సంస్థలోనూ మొత్తం నిలువు రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని స్పష్టం చేసింది.
బీసీలకు రిజర్వేషన్లను ఖరారు చేసేటప్పుడు డెడికేటెడ్ కమిషన్ సిఫార్సులతోపాటు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం-1994, దాని కింద రూపొందించిన నిబంధనలు, న్యాయస్థానాల ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను కూడా సంబంధిత చట్ట నిబంధనల ప్రకారం నిర్ణయించాల్సి ఉంటుంది.
స్థానిక సంస్థల వారీగా రిజర్వేషన్లు
రిజర్వేషన్ల గణన, సీట్లు, పదవుల కేటాయింపు, రిజర్వేషన్ల రొటేషన్ తదితర అంశాలకు సంబంధించి అవసరమైన విధివిధానాలను ప్రత్యేకంగా రూపొందించనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇందుకోసం అవసరమైన చోట నిబంధనలను సవరించనుంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ తదుపరి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది..
బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల లక్ష్యంపై ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయం యథాతథంగా అమలు కావడం లేదు. తాజా జీవో ప్రకారం, ఎస్సీ, ఎస్టీ, బీసీల మొత్తం నిలువు రిజర్వేషన్లు 50 శాతానికి లోబడి ఉండేలా స్థానిక సంస్థల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేయాల్సి ఉంటుంది. అయితే ఏ గ్రామ పంచాయతీకి, ఏ మండల లేదా జిల్లా పరిషత్ స్థానానికి ఎంత శాతం రిజర్వేషన్ వర్తిస్తుందనే పూర్తి వివరాలు తదుపరి విధివిధానాలు, కేటాయింపుల ద్వారా స్పష్టమవుతాయి.




