Amaravati: ఎన్టీఆర్ వైద్య సేవలో అక్రమాలు.. 203 ఆసుపత్రులకు రూ. 34.39 కోట్ల ఫైన్!
Amaravati: ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ఉల్లంఘనలపై ప్రభుత్వం ఉక్కుపాదం. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా, ఏఐ సాంకేతికతతో ఫేక్ బిల్లుల గుర్తింపు.
Amaravati: ఎన్టీఆర్ వైద్య సేవలో అక్రమాలు.. 203 ఆసుపత్రులకు రూ. 34.39 కోట్ల ఫైన్!
Amaravati: ఎన్టీఆర్ వైద్య సేవ పథకం అమలులో అక్రమాలకు పాల్పడే నెట్‌వర్క్ ఆసుపత్రులపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. పేదలకు ఉచితంగా వైద్యం అందించాల్సిన ఆసుపత్రులు నిబంధనలను ఉల్లంఘించినా, వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహించినా ఉపేక్షించబోమనే సంకేతాలను వైద్యారోగ్య శాఖ ఇస్తోంది. చికిత్సల పేరుతో రోగుల నుంచి డబ్బులు వసూలు చేయడం, అర్హులకు నగదు రహిత వైద్యం నిరాకరించడం, తప్పుడు బిల్లులు సమర్పించడం వంటి అంశాలపై ఎన్టీఆర్ వైద్య సేవల ట్రస్టు ప్రత్యేకంగా దృష్టి సారించింది.
2024–25 నుంచి 2026–27 వరకు మొత్తం 203 ఆసుపత్రులపై రూ.34.39 కోట్ల జరిమానాలు విధించినట్లు ట్రస్టు వెల్లడించింది. ఇదే సమయంలో నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి 44 క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. వీటిలో 25 ఆసుపత్రులపై సస్పెన్షన్లు, 13 చోట్ల చెల్లింపుల నిలిపివేత, ఐదు ఆసుపత్రులను నెట్‌వర్క్ జాబితా నుంచి తొలగించడం, మరో ఆసుపత్రి గుర్తింపును రద్దు చేయడం ఉన్నాయి.
ఏఐతో అక్రమాల గుర్తింపు
ఆసుపత్రులు సమర్పించే బిల్లుల్లో అవకతవకలను గుర్తించేందుకు ట్రస్టు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత సాంకేతికతను వినియోగిస్తోంది. జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ సహకారంతో బిల్లుల విశ్లేషణ, వైద్య రికార్డుల పరిశీలన, తనిఖీల ద్వారా అనుమానాస్పద వ్యవహారాలను గుర్తిస్తోంది. అవసరానికి మించి చికిత్సా ప్యాకేజీలను వినియోగించడం, ఒకే తరహా చికిత్సలకు అసాధారణంగా బిల్లులు సమర్పించడం వంటి అంశాలపై నిఘా ఉంచుతోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా బిల్లుల పరిశీలనను మరింత సమర్థంగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తోంది.
రోగుల ఫిర్యాదులపై విచారణ
ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద ఉచితంగా అందించాల్సిన చికిత్సలకు డబ్బులు వసూలు చేయడం, అర్హులైన రోగులకు నగదు రహిత వైద్యం నిరాకరించడం, చికిత్సలో జాప్యం చేయడం, నిర్దేశిత వైద్య ప్రమాణాలను పాటించకపోవడం వంటి ఫిర్యాదులను ట్రస్టు పరిశీలిస్తోంది. రోగుల సంరక్షణలో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలు వచ్చినా విచారణ చేపడుతోంది.
రోగుల మరణాలకు సంబంధించి వైద్య నిర్లక్ష్యంపై ఫిర్యాదులు అందినప్పుడు, నిర్దేశిత చికిత్సా విధానాలను అనుసరించలేదనే ఆరోపణలు వచ్చినప్పుడు వైద్య రికార్డులను తనిఖీ చేస్తోంది. ఫిర్యాదుల స్వభావం, అందుబాటులో ఉన్న ఆధారాల ఆధారంగా తదుపరి చర్యలు చేపడుతోంది.
ఆరు నెలల్లో 114 కేసుల్లో చర్యలు
గడిచిన ఆరు నెలల్లో 114 కేసులకు సంబంధించి చర్యలు తీసుకున్నట్లు ట్రస్టు వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు వెయ్యి వరకు ప్రైవేటు ఆసుపత్రులు ఎన్టీఆర్ వైద్య సేవల ట్రస్టుతో అనుబంధంగా ఉన్న నేపథ్యంలో పథకం అమలుపై పర్యవేక్షణకు ప్రాధాన్యం ఇస్తోంది.
ఈ వివరాలను వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు ఎన్టీఆర్ వైద్య సేవల ట్రస్టు సీఈఓ పద్మావతి వివరించారు. పథకం కింద అర్హులైన పేదలకు నాణ్యమైన వైద్యం అందడం, ఆసుపత్రుల్లో పారదర్శకత ఉండటం, ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా చూడటం వంటి అంశాల్లో పర్యవేక్షణ కీలకంగా మారింది.
ప్రభుత్వ ఆరోగ్య పథకాల అసలు లక్ష్యం రోగులకు ఆర్థిక భారం లేకుండా చికిత్స అందించడం. అందుకు విరుద్ధంగా వ్యవహరించే ఆసుపత్రులపై చర్యలు తీసుకోవడంతోపాటు, ఫిర్యాదుల పరిష్కారం, బిల్లుల తనిఖీ, వైద్య సేవల నాణ్యతపై నిరంతర పర్యవేక్షణ కొనసాగితేనే పథకం ప్రయోజనాలు అర్హులకు పూర్తిస్థాయిలో అందే అవకాశం ఉంటుంది.




