Amaravati: ఆక్వా వ్యర్థాలపై పకడ్బందీ నిఘా.. జలవనరుల పరిరక్షణకు చర్యలు!
Amaravati: ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్ల వ్యర్థాలపై పర్యావరణ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
Amaravati: ఆక్వా వ్యర్థాలపై పకడ్బందీ నిఘా.. జలవనరుల పరిరక్షణకు చర్యలు!
Amaravati: ఆక్వా ప్రాసెసింగ్, ప్రీ-ప్రాసెసింగ్ యూనిట్ల నుంచి వెలువడే వ్యర్థాల కారణంగా జలవనరులు కలుషితం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ–పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆక్వా యూనిట్లు నిర్దేశిత పర్యావరణ ప్రమాణాలను తప్పనిసరిగా పాటించేలా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. జలవనరుల పరిరక్షణ, కాలుష్య నివారణకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు.
శుద్ధి చేయని ఆక్వా వ్యర్థాల్లో హానికారక పదార్థాలు పరిమితికి మించి ఉంటే నదులు, కాలువలు, చెరువులు, సాగర సంగమ ప్రాంతాలతో పాటు భూగర్భ జలాలు కూడా కలుషితమయ్యే ప్రమాదం ఉందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దీని ప్రభావం మత్స్య సంపద, వ్యవసాయం, పశుపోషణతో పాటు నీటి వనరులపై ఆధారపడిన జీవనోపాధులపై పడే అవకాశం ఉందన్నారు. ప్రజారోగ్యానికి కూడా ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉన్నందున వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 119 ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్లు, 12 ఆక్వా ప్రీ-ప్రాసెసింగ్ యూనిట్లు పనిచేస్తున్నట్లు ఏపీపీసీబీ అధికారులు తెలిపారు. పర్యావరణ ప్రమాణాల అమలును పరిశీలించేందుకు విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించడంతో పాటు, యూనిట్ల నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు చేపడుతున్నట్లు వివరించారు. ఇప్పటివరకు 82 యూనిట్ల నుంచి నమూనాలు సేకరించగా, కొన్ని యూనిట్లలో pH స్థాయిలు, నీటిపై తేలియాడే ఘన వ్యర్థాలు, BOD వంటి కీలక ప్రమాణాల్లో మార్పులు గుర్తించినట్లు తెలిపారు.
పర్యావరణ ప్రమాణాలు పాటించని 10 యూనిట్లకు ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. వివరణ ఇవ్వడంతో పాటు దిద్దుబాటు చర్యలు చేపట్టేందుకు రెండు వారాల గడువు ఇచ్చినట్లు తెలిపారు. నిబంధనల ఉల్లంఘనలు కొనసాగితే పర్యావరణ చట్టాల ప్రకారం నియంత్రణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
వ్యర్థ జలాల్లో BOD స్థాయులు అధికమైతే నీటిలో కరిగిన ఆక్సిజన్ తగ్గి జలచర జీవ వ్యవస్థలు దెబ్బతినే ప్రమాదం ఉంటుందని పవన్ కళ్యాణ్ అన్నారు. TSS స్థాయులు పెరగడం వల్ల నీటి నాణ్యత క్షీణించడంతో పాటు జలచరాల ఆవాసాలపై ప్రభావం పడుతుందని తెలిపారు. అసాధారణ pH స్థాయులు కూడా జలచర జీవులకు హానికరమన్నారు.
ఆక్వా యూనిట్లలో క్రమం తప్పకుండా నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. సమస్యలను ముందుగానే గుర్తించి నివారించడంతో పాటు, ఉల్లంఘనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. యూనిట్లకు దిద్దుబాటు చర్యలకు అవకాశం కల్పిస్తూనే పర్యావరణ ప్రమాణాలను సమర్థవంతంగా అమలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.




