World Animal Day 2026: జంతువుల కళ్లతో ప్రపంచాన్ని చూడాలి పవన్ కళ్యాణ్!
World Animal Day 2026: ప్రపంచ జంతు దినోత్సవం: విశాఖ, తిరుపతి జూ పార్కుల్లో యానిమల్ అడాప్షన్ ప్రోగ్రామ్‌ను వినియోగించుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు.
World Animal Day 2026: జంతువుల కళ్లతో ప్రపంచాన్ని చూడాలి పవన్ కళ్యాణ్!
World Animal Day 2026: ప్రపంచ జంతు దినోత్సవం సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జంతు సంరక్షణపై ప్రజలకు పిలుపునిచ్చారు. “వారి కళ్లతో మనం ప్రపంచాన్ని చూడగలిగితే.. మనం ఏం భిన్నంగా చేసేవాళ్లం?” అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలని అన్నారు.
ఈ ఏడాది ప్రపంచ జంతు దినోత్సవం See the World Through Their Eyes అనే సందేశంతో జరుపుకుంటున్నామని తెలిపారు. జంతువులను కేవలం మన అవసరాలకు ఉపయోగపడే జీవులుగా కాకుండా.. వాటికంటూ ప్రత్యేకమైన అవసరాలు, జీవించే హక్కు, గౌరవం ఉన్న ప్రాణులుగా చూడాల్సిన అవసరం ఉందన్నారు.
వన్యప్రాణులైనా, పెంపుడు జంతువులైనా వాటి సంక్షేమం, భద్రత పట్ల బాధ్యతగా వ్యవహరించాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. జంతువుల సహజ ఆవాసాలను కాపాడటం, వాటిపై క్రూరత్వాన్ని నిరోధించడం, వన్యప్రాణుల సంరక్షణకు సహకరించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.
మనం ఈరోజు తీసుకునే నిర్ణయాలు.. జంతువులు రేపు జీవించాల్సిన ప్రపంచాన్ని ప్రభావితం చేస్తాయని చెప్పారు. ప్రకృతి, అడవులు, జంతువుల ఆవాసాలను పరిరక్షించడంతో పాటు.. రోజువారీ జీవితంలో కూడా జంతువుల పట్ల కరుణతో వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం, తిరుపతిలోని జంతుప్రదర్శనశాలల్లో అమలు చేస్తున్న యానిమల్ అడాప్షన్ ప్రోగ్రామ్‌లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు. పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, కుటుంబ వేడుకలు వంటి ప్రత్యేక సందర్భాల్లో జంతువును దత్తత తీసుకోవడం ద్వారా వాటి సంరక్షణలో భాగస్వాములు కావచ్చన్నారు.
మన వేడుకలు కేవలం మన ఆనందానికి మాత్రమే పరిమితం కాకుండా.. మరో జీవికి మేలు చేసే సందర్భాలుగా మారాలని ఆకాంక్షించారు.
మన కోసం మాట్లాడలేని జీవుల తరఫున మన ఎంపికలు మాట్లాడాలి.వారి కళ్లతో ప్రపంచాన్ని చూద్దాం.. వారి జీవితాలను అర్థం చేసుకుందాం.. జంతు సంరక్షణలో మన వంతు బాధ్యతను నిర్వర్తిద్దాం అని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.




