Amaravati: 'చెప్పాం-చేస్తున్నాం' కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలి.. సీఎం!

Amaravati: స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతి ఒక్కరూ సీరియస్‌గా తీసుకోవాలని సీఎం చంద్రబాబు కూటమి నేతలకు దిశానిర్దేశం చేశారు. 'చెప్పాం-చేస్తున్నాం' కార్యక్రమం ముమ్మరం చేయాలన్నారు.

Hari Kishan  AP Bureau Chief
Published on: 26 Oct 2026 11:13 AM IST
Amaravati
X

Amaravati: 'చెప్పాం-చేస్తున్నాం' కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలి.. సీఎం!

Amaravati: స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతి ఒక్కరూ సీరియస్‌గా తీసుకోవాలని ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పార్టీ ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేశారు. 2024 ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నామని, ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు.

ఇందులో భాగంగా ‘చెప్పాం-చేస్తున్నాం’ కార్యక్రమాన్ని మరింత ముమ్మరం చేయాలని ఆదేశించారు. కూటమి పార్టీల మధ్య సమన్వయం, మిత్రధర్మం విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు. పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారం, క్షేత్రస్థాయి సమన్వయంపై చంద్రబాబు పలు సూచనలు చేశారు.

2024 ఎన్నికల్లో ప్రజలు కూటమికి అద్భుత విజయాన్ని అందించారని చంద్రబాబు పేర్కొన్నారు. గత ప్రభుత్వ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో తీర్పు ఇచ్చారని, వైసీపీకి 151 స్థానాల నుంచి కేవలం 11 స్థానాలకే పరిమితం చేసేలా ప్రజలు తీర్పు ఇచ్చారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తూ సుపరిపాలన అందిస్తున్నామని, రాష్ట్రంలోని ప్రతి వర్గానికి, ప్రతి ప్రాంతానికి ప్రయోజనం చేకూరేలా పాలన సాగిస్తున్నామని వివరించారు.

ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని నేతలకు సూచించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న విషయాన్ని ప్రజలకు వివరించాలని, ‘చెప్పాం-చేస్తున్నాం’ ప్రచారం ద్వారా ప్రభుత్వ పనితీరును ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు న్యాయం చేయడంతోపాటు చిన్న కులాలకు కూడా ప్రాధాన్యత కల్పించామని తెలిపారు. పాలనలో తమకూ భాగస్వామ్యం ఉందనే సంతృప్తి ప్రతి వర్గంలో కలిగేలా వ్యవహరించాలని సూచించారు.

కూటమి పార్టీల కార్యకర్తలు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా నిలవాలని చంద్రబాబు పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. మిత్రధర్మాన్ని తప్పనిసరిగా పాటించాల్సిందేనని, ఈ విషయంలో ఎలాంటి వెసులుబాటు ఉండదని తేల్చిచెప్పారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో కూటమి ప్రభుత్వం కొనసాగితే కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని సూచించారు.

పొత్తులు, రిజర్వేషన్లు, సామాజిక సమీకరణల కారణంగా కొంతమందికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కలేదని చంద్రబాబు పేర్కొన్నారు. అయితే రాష్ట్రం, పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తించి తగిన ప్రాధాన్యత కల్పిస్తామని, నామినేటెడ్ పదవుల ద్వారా గౌరవిస్తామని భరోసా ఇచ్చారు. అగ్రనేతల నుంచి క్షేత్రస్థాయి కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరూ చేస్తున్న పనిని పరిశీలిస్తున్నామని తెలిపారు.

ప్రభుత్వం చేసిన మంచి పనులను వివరించడంతోపాటు, వైసీపీ పాలనలో జరిగిన పరిణామాలు, ఆ పార్టీ విధానాల వల్ల రాష్ట్రానికి కలిగే నష్టాన్ని కూడా ప్రజలకు వివరించాలని చంద్రబాబు సూచించారు. వైసీపీ అధినేత తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతున్నారని విమర్శించారు.

స్థానిక ఎన్నికల్లో వార్డు, డివిజన్ స్థాయి నుంచి ప్రతి స్థానంలోనూ కూటమి అభ్యర్థులు విజయం సాధించేలా కృషి చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. కూటమికి అనుకూలంగా ఓటింగ్ పెరగాలని, ప్రతి ఓటరు పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేసేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. 2024 ఎన్నికలతో పోలిస్తే ప్రతి పోలింగ్ బూత్‌లోనూ అధిక ఓట్లు సాధించే లక్ష్యంతో పనిచేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.