Amaravati: భారీ వర్షాలు.. ఉత్తరాంధ్రలో వరదలపై సీఎం సమీక్ష!
Amaravati: ఉత్తరాంధ్రలో వరద పరిస్థితులు, సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్. మత్స్యకార కుటుంబాలకు 50 కిలోల ఉచిత బియ్యం అందించాలని ఆదేశం.
Amaravati: భారీ వర్షాలు.. ఉత్తరాంధ్రలో వరదలపై సీఎం సమీక్ష!
Amaravati: రాష్ట్రంలో భారీ వర్షాలు, ముఖ్యంగా ఉత్తరాంధ్రలో కొనసాగుతున్న వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పలు జిల్లాల్లో నివాస ప్రాంతాలు జలమయం కావడం, పంట పొలాల్లోకి వరద నీరు చేరిన పరిస్థితులపై సీఎస్ సాయిప్రసాద్‌తో పాటు వివిధ శాఖల అధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు. ముంపు ప్రాంతాల్లో చేపడుతున్న సహాయక, పునరావాస చర్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
గత ఐదు రోజులుగా సముద్రంలో వేటకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న మత్స్యకార కుటుంబాలకు ఉచితంగా 50 కిలోల బియ్యం అందించాలని చంద్రబాబు ఆదేశించారు. వర్షాలు, సముద్ర పరిస్థితుల కారణంగా ఉపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండాలని స్పష్టం చేశారు.
ఉత్తరాంధ్రలో నదుల ప్రవాహాలు, ముంపు పరిస్థితిపై మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రికి వివరించారు. ఆయా జిల్లాల్లోని రిజర్వాయర్లలోకి వస్తున్న నీటి ప్రవాహాలు, నిల్వ పరిస్థితులను ఇరిగేషన్ అధికారులు సీఎంకు తెలియజేశారు. హీర మండలం లిఫ్ట్ ప్రాజెక్టుకు విద్యుత్ సౌకర్యం కల్పించే ప్రక్రియను వేగవంతం చేయాలని చంద్రబాబు ఆదేశించారు. ఇరిగేషన్, విద్యుత్ శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించి తక్షణమే ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. లిఫ్ట్ పనులను పూర్తి చేసి వంశధార నీటిని హీర మండలం రిజర్వాయర్‌లోకి తరలించేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాల్లో రిజర్వాయర్లను సాధ్యమైనంత మేర నింపేందుకు తీసుకుంటున్న చర్యలపైనా చంద్రబాబు సమీక్షించారు. వరద నీటిని వృథాగా సముద్రంలోకి వెళ్లకుండా అవసరమైన చోట్ల నిల్వ చేసుకునే అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు.
ఇక కృష్ణానదిలో ఎగువ నుంచి ప్రస్తుతం పెద్దగా ప్రవాహాలు లేవని అధికారులు సీఎంకు వివరించారు. స్థానికంగా వస్తున్న వరద నీటి కారణంగానే ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటి మట్టం పెరుగుతోందని తెలిపారు. దీంతో స్థానికంగా వచ్చే వరద నీటిని పూర్తిస్థాయిలో నిల్వ చేసుకునేలా పులిచింతల దిగువన, ప్రకాశం బ్యారేజ్‌కు ఎగువన బ్యారేజ్ నిర్మాణం అవసరమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
ప్రకాశం బ్యారేజ్‌కు ఎగువన, అలాగే ప్రకాశం బ్యారేజ్‌కు దిగువన రెండు బ్యారేజ్‌లు నిర్మించేందుకు గతంలో చేసిన ప్రతిపాదనలను ముందుకు తీసుకెళ్లాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని సూచించారు. భవిష్యత్‌లో వరద నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవడంతో పాటు నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచే దిశగా ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేశారు.
మరోవైపు తాజా వర్షాలతో రాష్ట్రంలో వర్షపాతం లోటు 50 శాతం నుంచి 31 శాతానికి తగ్గిందని అధికారులు సీఎంకు వివరించారు. కోస్తాంధ్రలో ప్రస్తుతం 19.80 శాతం వర్షపాతం లోటు ఉండగా, రాయలసీమలో 42 శాతం లోటు ఉన్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో ప్రస్తుతం వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయని, అయితే ఉత్తరాంధ్రలో ఎగువ ప్రాంతాల నుంచి నదుల్లోకి వరద ప్రవాహాలు కొనసాగుతున్నాయని అధికారులు వివరించారు. దీంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సహాయక చర్యలు కొనసాగించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.




