AP: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు: తల్లికి వందనం నిధుల పెంపు!
AP: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో తల్లికి వందనం, ఆశా వర్కర్ల గ్రాట్యుటీ, హాస్టళ్ల డైట్ ఛార్జీల పెంపునకు ఆమోదం లభించింది.
AP: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు: తల్లికి వందనం నిధుల పెంపు!
AP: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ అధినేతగా 25 ఏళ్ల ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్భంగా అభినందిస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. వ్యవసాయం, వైద్యం, విద్య, సంక్షేమం, గిరిజన విద్య, రెవెన్యూ, ఉన్నత విద్య తదితర రంగాలకు సంబంధించిన ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ప్రధాని మోదీకి కేబినెట్ అభినందనలు
గుజరాత్ ముఖ్యమంత్రిగా, అనంతరం ప్రధానమంత్రిగా ప్రభుత్వ అధినేతగా వరుసగా 25 ఏళ్ల సుదీర్ఘ ప్రజాసేవ పూర్తి చేసిన నరేంద్ర మోదీకి ఏపీ కేబినెట్ అభినందనలు, శుభాకాంక్షలు తెలిపింది. మోదీ నిబద్ధత, నిజాయితీ, క్రమశిక్షణ, దార్శనికత, నిర్ణయాత్మక నాయకత్వాన్ని మంత్రివర్గం ప్రశంసించింది. సాంకేతికత, ఆవిష్కరణలు, పారదర్శకత, జవాబుదారీతనాన్ని పాలనలో సమన్వయం చేశారని పేర్కొంది. మౌలిక వసతులు, సంక్షేమం, స్వావలంబన, పారిశ్రామిక అభివృద్ధి, విదేశాంగ విధానం వంటి రంగాల్లో ఆయన నాయకత్వాన్ని కేబినెట్ కొనియాడింది.
ఉద్యాన రైతుల కోసం ప్రత్యేక సమాచార వ్యవస్థ
రాష్ట్రంలోని ఉద్యాన పంటలకు సంబంధించిన సమాచారాన్ని ఒకే వేదికపైకి తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ హార్టికల్చర్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (APHIMS) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ వ్యవస్థ రూపకల్పన, అభివృద్ధి, అమలు, నిర్వహణ బాధ్యతలను M/s Vassar Labs IT Solutions Pvt. Ltd.కు అప్పగించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఉద్యాన పంటలపై సమగ్ర సమాచారం అందుబాటులోకి రావడంతో ప్రభుత్వానికి నిర్ణయాలు తీసుకోవడం, రైతులకు అవసరమైన సేవలు, సలహాలు అందించడం సులభం కానుంది.
ఆశా కార్యకర్తలకు గ్రాట్యుటీ
విధుల్లో ఉండగానే మరణించే అర్హత కలిగిన ఆశా కార్యకర్తలకు ఎండ్ ఆఫ్ సర్వీస్ ప్రయోజనంగా గ్రాట్యుటీ అందించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సేవలో పూర్తి చేసిన ప్రతి సంవత్సరానికి రూ.5 వేల చొప్పున, గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు గ్రాట్యుటీ ఇవ్వనున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సుమారు రూ.2.19 కోట్లను మంజూరు చేసేందుకు అనుమతి ఇచ్చింది.
రేపల్లె ఆసుపత్రి 100 పడకలకు అప్‌గ్రేడ్
బాపట్ల జిల్లా రేపల్లెలోని 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను 100 పడకల ఏరియా ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం అదనంగా 66 పోస్టులను ఏర్పాటు చేయనుంది. దీంతో రేపల్లెతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు స్థానికంగానే మెరుగైన అత్యవసర, ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.
తల్లికి వందనం.. మరో 58,601 మంది విద్యార్థులకు లబ్ధి
2026-27 విద్యా సంవత్సరానికి తల్లికి వందనం పథకం అమలుకు సంబంధించి జారీ చేసిన ఉత్తర్వులను కేబినెట్ ర్యాటిఫై చేసింది. అదనంగా 58,601 మంది అర్హులైన విద్యార్థులను పథకం పరిధిలోకి తీసుకురావడానికి సవరించిన పరిపాలనా అనుమతులు ఇచ్చింది. రెండో దశలో ఎంపికైన 3,29,201 మంది అర్హులకు ఆర్థిక సహాయం విడుదలకు ఆమోదం తెలిపింది.
పథకం కోసం గతంలో ఉన్న రూ.10,120.78 కోట్ల పరిపాలనా అనుమతిని రూ.10,208.69 కోట్లకు పెంచింది. దీంతో మొత్తం అర్హులైన విద్యార్థుల సంఖ్య 67,47,190 నుంచి 68,05,791కి పెరిగింది.
సంక్షేమ వసతి గృహాల్లో డైట్ ఛార్జీలు 10 శాతం పెంపు
సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, ఇతర ప్రభుత్వ సంస్థల్లోని విద్యార్థులకు అందించే డైట్ ఛార్జీలను 10 శాతం పెంచాలని నిర్ణయించింది. సాంఘిక, బీసీ, గిరిజన, మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమం, జువైనల్ వెల్ఫేర్, పాఠశాల విద్యాశాఖల పరిధిలోని సంస్థలకు సవరించిన రేట్లు వర్తిస్తాయి.
ఈ పెంపు 6,28,409 మంది విద్యార్థులకు వర్తించనుంది. 2023 నుంచి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
గిరిజన విద్యార్థులకు IIT-JEE, NEET కోచింగ్
విశాఖపట్నంలోని మరికవలస ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. IIT-JEE, NEET కోసం 600 మంది ఇంటర్మీడియట్ గిరిజన విద్యార్థులకు ప్రత్యేక నివాస కోచింగ్ ఇవ్వనున్నారు. ఇందులో 300 మంది బాలురు, 300 మంది బాలికలకు అవకాశం కల్పించనున్నారు.
కుప్పంలో అధికారుల అతిథి గృహానికి భూమి
చిత్తూరు జిల్లా గుడుపల్లె మండలం నక్కనపల్లెలో 1.69 ఎకరాల గ్రేజింగ్ గ్రౌండ్ పోరంబోకు భూమిని KADA ప్రాజెక్ట్ డైరెక్టర్ పేరిట కేటాయించి అధికారుల అతిథి గృహం నిర్మించేందుకు కేబినెట్ అనుమతించింది. భూమి వర్గీకరణను AWDగా మార్చి కేటాయింపు ప్రక్రియ చేపట్టనున్నారు.
NTR జిల్లాలో దీర్ఘకాలిక ఆక్రమణల క్రమబద్ధీకరణ
ప్రభుత్వ పోరంబోకు భూముల్లో దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఆక్రమణలు, భూముల వర్గీకరణ మార్పు, క్రమబద్ధీకరణకు సంబంధించిన G.O.Ms.No.615, G.O.Ms.No.618 ఉత్తర్వులను ర్యాటిఫై చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అసలు అసైనీలు, చట్టపరమైన వారసులు, మూడో పక్ష కొనుగోలుదారులు, ఇతర ఆక్రమణదారులకు సంబంధించిన అంశాలను వన్‌టైమ్ చర్యగా పరిష్కరించే అవకాశం కల్పించారు.
ఆలయ అభివృద్ధికి 7.66 ఎకరాల భూమి
YSR కడప జిల్లా నందలూరు మండలం పాతూరు గ్రామంలోని 7.66 ఎకరాల ప్రభుత్వ భూమిని శ్రీ కన్నేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కోసం దేవాదాయ శాఖకు ఉచితంగా బదలాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ భూమి విలువ సుమారు రూ.60.20 లక్షలుగా ఉంది. అవసరమైన NOC వచ్చిన అనంతరం నిబంధనల ప్రకారం భూమి బదలాయింపు జరగనుంది.
బీసీ బాలురకు రెసిడెన్షియల్ స్కూల్
ప్రకాశం జిల్లా కొండేపి మండలంలోని 7 ఎకరాల వాగు పోరంబోకు భూమిని ‘అసెస్డ్ వేస్ట్’గా వర్గీకరించి, మహాత్మా జ్యోతీబా ఫూలే ఏపీ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ ఆధ్వర్యంలో బాలుర రెసిడెన్షియల్ స్కూల్, హాస్టల్ నిర్మాణానికి వినియోగించేందుకు అనుమతించింది.
ప్రైవేట్ పాఠశాలల అనుమతుల ప్రక్రియ సులభతరం
ఆంధ్రప్రదేశ్ విద్యా చట్టం-1982లోని కొన్ని సెక్షన్లను సవరించేందుకు ఆర్డినెన్స్ జారీ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రైవేట్ పాఠశాల ఏర్పాటు లేదా రిజిస్ట్రేషన్‌కు ముందు తప్పనిసరిగా ప్రాంతీయ సర్వే, నోటిఫికేషన్ వంటి ప్రక్రియలను తొలగించాలని నిర్ణయించింది. అయితే భవన భద్రత, అగ్నిమాపక భద్రత, పారిశుద్ధ్యం, మౌలిక వసతులు, విద్యా ప్రమాణాల విషయంలో ఎలాంటి సడలింపు ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
విదేశీ యూనివర్సిటీలకు ఏపీ పాలసీ
రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి ఉన్నత విద్యా సంస్థలు, విదేశీ ఉన్నత విద్యా సంస్థలు, ప్రముఖ ప్రైవేట్ యూనివర్సిటీలను ఆకర్షించేందుకు Andhra Pradesh Policy for Promotion of Foreign Higher Educational Institutions and Private Universities, 2026కు కేబినెట్ ఆమోదం తెలిపింది. క్యాంపస్‌ల ఏర్పాటుకు అవసరమైన ప్రోత్సాహకాలు, అర్హతలు, ప్రభుత్వ సహకారం, పర్యవేక్షణ వ్యవస్థను పాలసీలో పొందుపరిచారు. ఈ విధానం వల్ల ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం ఉండదని ప్రభుత్వం తెలిపింది.
ఇళ్ల స్థలాల సమస్యపై మంత్రుల కమిటీ
ఇళ్ల స్థలాలకు సంబంధించిన సమస్యలను 45 రోజుల్లో పరిష్కరించేందుకు మంత్రుల కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. గృహ నిర్మాణ, రెవెన్యూ శాఖ మంత్రులతో పాటు మరో మంత్రి ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఇప్పటికే లేఅవుట్లలో ఖాళీగా ఉన్న స్థలాలు, లబ్ధిదారులు వద్దనుకుని వదిలేసిన రిజిస్ట్రర్డ్ స్థలాలను గుర్తించి, అవసరమైతే రిజిస్ట్రేషన్ రద్దు చేసి అర్హులకు కేటాయించే అంశాన్ని కమిటీ పరిశీలించనుంది.
ఇటీవల నిర్వహించిన ఆవాస్ సర్వేలో సుమారు 2 లక్షల మందికి ఇళ్ల స్థలాలు అవసరమని గుర్తించిన నేపథ్యంలో, వారికి భూసేకరణ ఎలా చేపట్టాలన్న అంశంపైనా కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఈ కేబినెట్ సమావేశంలో రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ సంచాలకులు కె.ఎస్. విశ్వనాథన్ పాల్గొన్నారు.




