AP: రైతులకు నష్టం లేకుండా మొక్కల సేకరణ: ఏపీ గ్రీన్ చైర్మన్!
AP: రాష్ట్రంలో 50 శాతం పచ్చదనం సాధించేందుకు 10 కోట్ల మొక్కలు సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఏపీ గ్రీన్ చైర్మన్ నాగబాబు కడియపులంకలో తెలిపారు.
AP: రైతులకు నష్టం లేకుండా మొక్కల సేకరణ: ఏపీ గ్రీన్ చైర్మన్!
AP: ఆంధ్రప్రదేశ్‌ను హరితాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో పనిచేస్తోందని ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ నాగబాబు తెలిపారు. రాష్ట్రంలో 50 శాతం గ్రీన్ కవర్ సాధించాలన్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే కడియం నర్సరీ రైతులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నర్సరీ రైతులందరి భాగస్వామ్యం, సహకారం అవసరమన్నారు. తూర్పుగోదావరి జిల్లా కడియపులంకలో బుధవారం సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ రైతులతో ఆయన సమావేశమై హరిత కార్యక్రమాలపై చర్చించారు.
2026–27 ఆర్థిక సంవత్సరంలో సుమారు 10 కోట్ల మొక్కలను నర్సరీల్లో సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నాగబాబు వెల్లడించారు. ఈ స్థాయిలో మొక్కలను అందుబాటులోకి తీసుకురావాలంటే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 500 నుంచి 1,000 నర్సరీల వరకు అవసరమవుతాయని తెలిపారు. ప్రభుత్వం కొన్ని నర్సరీలను ఏర్పాటు చేస్తున్నప్పటికీ, భారీ స్థాయిలో మొక్కల ఉత్పత్తి, సరఫరాకు ప్రైవేట్ నర్సరీ రైతుల భాగస్వామ్యం కీలకమన్నారు.
పట్టణాలు, రహదారులు, ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాలు, ప్రభుత్వ శాఖల పరిధిలోని ఖాళీ స్థలాలతో పాటు పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ భూములు, పట్టణాల్లోని ఓపెన్ స్పేస్‌లను గుర్తించి విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఆయా ప్రాంతాలను హరిత ప్రాంతాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు.
రైతులకు నష్టం లేకుండా మొక్కల కొనుగోలు
ప్రభుత్వం చేపట్టనున్న భారీ స్థాయి మొక్కల సేకరణలో నర్సరీ రైతులకు కూడా ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకుంటామని నాగబాబు చెప్పారు. మొక్కలకు అధిక ధరలు విధించకుండా, అదే సమయంలో నర్సరీ రైతులకు నష్టం కలగకుండా సరఫరా చేసే విధంగా సమన్వయం అవసరమన్నారు. ప్రభుత్వ హరిత కార్యక్రమాల్లో నర్సరీ రైతులను భాగస్వాములను చేయడం ద్వారా వారికి స్థిరమైన మార్కెట్ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గుతున్న పరిస్థితుల్లో పర్యావరణ పరిరక్షణకు పచ్చదనం పెంపు మరింత కీలకమైందన్నారు. ఏపీ గ్రీన్ నిర్దేశించిన లక్ష్యాలను సమష్టి కృషితో సాధిస్తే రాష్ట్రాన్ని పచ్చదనంతో సస్యశ్యామలంగా తీర్చిదిద్దవచ్చని నాగబాబు పేర్కొన్నారు. హరిత కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందిస్తామని కడియం నర్సరీ రైతులు తెలిపారు.
మహా పుష్కర నగరవనంలో మొక్కలు నాటిన నాగబాబు
కడియపులంక పర్యటనకు ముందు నాగబాబు రాజమహేంద్రవరంలోని గోదావరి మహాపుష్కర నగరవనాన్ని సందర్శించారు. నగరవనంలోని పచ్చదనం, మొక్కల పెంపకం, వన సంరక్షణ చర్యలను పరిశీలించారు. రుద్రాక్షతో పాటు అరుదైన అండమాన్ పడాక్ మొక్కలను స్వయంగా నాటారు.
అనంతరం కడియపులంకలోని శ్రీ సత్యదేవ నర్సరీతో పాటు పలు నర్సరీలను పరిశీలించారు. వివిధ రకాల మొక్కల నాణ్యత, ధరలు, ఉత్పత్తి, సరఫరా, డిమాండ్‌పై నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతుల కోరిక మేరకు అరుదైన బ్లాక్ వేప మొక్కను నాటారు. ఒకటి నుంచి మూడేళ్ల వయసున్న స్థానిక మొక్కల పెరుగుదల, నాణ్యతను పరిశీలించారు. మలేషియా గ్రీన్ కొబ్బరి, బనానా మ్యాంగో తదితర మొక్కల వివరాలను కూడా తెలుసుకున్నారు.
నర్సరీల్లో పనిచేస్తున్న మహిళా సిబ్బందితో మాట్లాడి వారి పని, ఉపాధి అవకాశాలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో ఏపీ గ్రీన్ కమిషనర్, సీఈవో బీఎన్ఎన్ మూర్తి, తూర్పుగోదావరి జిల్లా డీఎఫ్ఓ ప్రభాకరరావు, రీసెర్చ్ డీఎఫ్ఓ శ్రీనివాస్, ఎఫ్ఆర్ఓ దావీద్ రాజు తదితరులు పాల్గొన్నారు.




