AP: గిరిజన ఆత్మగౌరవ ప్రతీక బిర్సా ముండా.. బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్!
AP: జనజాతి గౌరవ దివస్ సందర్భంగా గిరిజన హక్కుల కోసం బిర్సా ముండా చేసిన పోరాటాన్ని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కొనియాడారు.
AP: గిరిజన ఆత్మగౌరవ ప్రతీక బిర్సా ముండా.. బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్!
AP: గిరిజనుల హక్కులు, ఆత్మగౌరవం, సంప్రదాయాల పరిరక్షణ కోసం పోరాడిన మహనీయుడు బిర్సా ముండా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన జనజాతి గౌరవ దివస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
బ్రిటిష్ పాలకులు గిరిజనుల భూములు, హక్కులను హరించి వారి ఉనికిని దెబ్బతీయాలని ప్రయత్నించారని విమర్శించారు. గిరిజనులను వేర్వేరు వర్గాలుగా విభజించి పాలించే విధానాలను బ్రిటిష్ వారు అనుసరించారని పేర్కొన్నారు.
ఈ కుట్రలను గుర్తించిన బిర్సా ముండా గిరిజనుల్లో చైతన్యం తీసుకొచ్చారని తెలిపారు. తమ సంప్రదాయాలు, సంస్కృతి, జీవన విధానాలను కాపాడుకోవాలని పిలుపునిస్తూ జార్ఖండ్ ప్రాంతం నుంచి పోరాటాన్ని ప్రారంభించారని చెప్పారు. ఆ పోరాట స్ఫూర్తి దేశవ్యాప్తంగా విస్తరించిందన్నారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గిరిజనుల్లో స్వాభిమాన జ్వాలను రగిలించిన గొప్ప నాయకుడిగా బిర్సా ముండా చరిత్రలో నిలిచిపోయారని కొనియాడారు.
దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది మహనీయులు చేసిన త్యాగాలు, పోరాటాలు ఇప్పటికీ పూర్తిస్థాయిలో వెలుగులోకి రాలేదని మాధవ్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అలాంటి మహనీయుల చరిత్రను ప్రజలకు పరిచయం చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు లంబసింగిలో అల్లూరి మ్యూజియాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని ప్రస్తావించారు.
గిరిజన విద్యార్థుల అభ్యున్నతి కోసం ఏకలవ్య పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. గతంలో అటల్ బిహారీ వాజపేయి ప్రధానిగా ఉన్న సమయంలో తొలిసారిగా కేంద్ర మంత్రివర్గంలో ప్రత్యేక గిరిజన శాఖను ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం కోసం బీజేపీ నిరంతరం కృషి చేస్తోందని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా, ప్రముఖ సినీ నటుడు గిరిబాబు మృతి పట్ల పీవీఎన్ మాధవ్ సంతాపం వ్యక్తం చేశారు. బీజేపీ తరఫున ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గిరిబాబు కొంతకాలం బీజేపీలో పనిచేశారని గుర్తుచేశారు.
ఇక రాష్ట్ర రాజకీయాలపై స్పందిస్తూ ఇటీవల జరిగిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి విజయాన్ని అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. రానున్న పంచాయతీ ఎన్నికల్లో కూడా బీజేపీ కూటమితో కలిసి ముందుకు సాగుతుందని ప్రకటించారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, ఈ ఎన్నికల్లోనూ ప్రజలు కూటమికి మద్దతుగా నిలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
విశాఖపట్నంలో ఇటీవల నిర్వహించిన CII పెట్టుబడుల సదస్సు విజయవంతమైందని మాధవ్ పేర్కొన్నారు. ఈ సదస్సు ద్వారా దాదాపు రూ.9 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలు వచ్చాయని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయడం వల్లే సదస్సు విజయవంతమైందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి పెట్టుబడులు దోహదపడతాయని పేర్కొన్నారు.




