AP: బంగాళాఖాతంలో బలపడుతున్న తుపాను.. ఏపీకి భారీ వర్ష సూచన!
AP: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం క్రమంగా బలపడి తుపానుగా, ఆపై తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
AP: బంగాళాఖాతంలో బలపడుతున్న తుపాను.. ఏపీకి భారీ వర్ష సూచన!
AP: బంగాళాఖాతంలో వాతావరణ పరిస్థితులు క్రమంగా తీవ్రరూపం దాలుస్తున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంతో పాటు దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడింది. రానున్న గంటల్లో ఇది మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని కోస్తాంధ్ర, ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
8 కిలోమీటర్ల వేగంతో కదలిక
తీవ్ర వాయుగుండం ప్రస్తుతం ఆగ్నేయ, దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. గత ఆరు గంటల్లో గంటకు సుమారు 8 కిలోమీటర్ల వేగంతో కదిలినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ వెల్లడించారు. ప్రస్తుతం అండమాన్ దీవులకు 640 కిలోమీటర్లు, చెన్నైకు 760 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 870 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 980 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు తెలిపారు.
తుపానుగా బలపడే అవకాశం
తీవ్ర వాయుగుండం క్రమంగా బలపడుతూ దక్షిణ మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సోమవారం సాయంత్రానికి తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి. మంగళవారం నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా బలపడే అవకాశముంది.
ఆ తర్వాత 48 గంటల్లో కోస్తాంధ్ర తీర ప్రాంతానికి చేరువయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేస్తోంది. తుపాను కదలిక, తీవ్రతను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన
తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. తుపాను సమీపించే కొద్దీ వాతావరణంలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. కోస్తా తీరం వెంబడి సోమవారం సాయంత్రం నుంచి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు.
రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలి
తుపాను హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు, రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. వ్యవసాయ పనుల్లో ఉన్న రైతులు వాతావరణ పరిస్థితులను గమనించాలని, కోతకు సిద్ధంగా ఉన్న పంటలను రక్షించుకునేందుకు తగిన చర్యలు చేపట్టాలని సూచించింది. ఈదురుగాలుల సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో ఉండకూడదని హెచ్చరించింది.
తీర ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు పాటించాలని స్పష్టం చేసింది. తుపాను తీవ్రత, దిశ, వేగంలో చోటుచేసుకునే మార్పుల ఆధారంగా తదుపరి హెచ్చరికలు జారీ చేస్తామని ప్రఖర్ జైన్ వెల్లడించారు.
బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తుపానుగా, ఆపై తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉండటంతో ఏపీ తీర ప్రాంతాల్లో ముందస్తు అప్రమత్తత అవసరమని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేస్తోంది.




