ఒక్క రైతుకూ అన్యాయం జరగకుండా నష్టాల అంచనా..వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు
Amaravati: ఆర్నాబ్ తుపాను కారణంగా వ్యవసాయ, ఉద్యాన, పశు, మత్స్య రంగాల నష్టాలను సమగ్రంగా అంచనా వేయాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు.
ఒక్క రైతుకూ అన్యాయం జరగకుండా నష్టాల అంచనా..వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు
అమరావతి: ఆర్నాబ్ తుఫాను కారణంగా రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, మత్స్య రంగాలకు జరిగిన నష్టాలను సమగ్రంగా అంచనా వేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. ఒక్క రైతుకూ అన్యాయం జరగకుండా, అర్హులైన ప్రతి రైతు వివరాలను నమోదు చేయాలని స్పష్టం చేశారు. నష్టాల అంచనాతో పాటు మిగిలిన పంటలను కాపాడేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.
తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని 16 జిల్లాల పరిధిలో 291 మండలాలు, 7,613 గ్రామాల్లో 5,42,003 మంది రైతులకు చెందిన 3,51,962.60 హెక్టార్లలో పంటలు నీటమునిగాయి. ఇందులో వరి పంట విస్తీర్ణమే 3,45,582.60 హెక్టార్లుగా ఉంది. మరోవైపు, 15 జిల్లాల్లోని 215 మండలాలు, 1,218 గ్రామాల్లో 77,431 మంది రైతులకు చెందిన 22,457.75 హెక్టార్ల ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. రాష్ట్ర విపత్తు స్పందన నిధి (SDRF) నిబంధనల ప్రకారం ప్రాథమిక ఇన్పుట్ సబ్సిడీ అంచనా రూ.99.23 కోట్లుగా నమోదైంది.
పశుసంవర్ధక రంగంలోనూ తుఫాను ప్రభావం కనిపించింది. 12 జిల్లాల్లో 46 ఆవులు, గేదెలు, 63 గొర్రెలు, మేకలు, 32 దూడలు, 7,656 కోళ్లు మృత్యువాత పడ్డాయి. మరో 140 పశువుల షెడ్లు దెబ్బతిన్నాయి. ఈ రంగంలో ప్రాథమిక ఆర్థిక సహాయం అంచనా రూ.50.38 లక్షలుగా ఉంది. తొమ్మిది జిల్లాల్లో 1,884 పడవలు, 3,224 వలలు దెబ్బతినగా, 11,483.39 ఎకరాల్లో ఆక్వా సాగు ప్రభావితమైంది. 61 చెరువులకు నష్టం వాటిల్లింది. అన్ని రంగాలను కలిపి ప్రాథమికంగా రూ.176.82 కోట్ల నష్టం జరిగినట్లు అంచనా వేశారు.
ప్రతి పొలాన్ని పరిశీలించాలి
అక్టోబర్ 30 నుంచి వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, మత్స్య శాఖల సిబ్బంది పూర్తిస్థాయిలో క్షేత్రస్థాయిలో పనిచేయాలని మంత్రి ఆదేశించారు. ప్రతి రైతును సంప్రదించి, ప్రతి పొలాన్ని పరిశీలించి పంట విస్తీర్ణం, నష్టం తీవ్రతను కచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. ఏ ఒక్క రైతు వివరాలు మిస్ కాకుండా, నష్టాన్ని తక్కువగా నమోదు చేసే పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
రాబోయే రెండు మూడు రోజులు పంటల సంరక్షణకు కీలకమని మంత్రి పేర్కొన్నారు. పొలాల్లో నిలిచిన నీటిని తొలగించడం, అవసరమైన మందులు, పోషకాలు అందించడం, శాస్త్రీయ పద్ధతుల్లో పంటలను పునరుద్ధరించడం ద్వారా మరింత నష్టాన్ని నివారించాలని ఆదేశించారు.
క్షేత్రస్థాయికి శాస్త్రవేత్తలు
నాలుగు వ్యవసాయ, అనుబంధ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు తమ పరిధిలోని ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలకు ప్రభావిత ప్రాంతాలవారీగా బాధ్యతలు కేటాయించాలని అచ్చెన్నాయుడు సూచించారు. రైతులను నేరుగా కలిసి పంటల పరిస్థితిని పరిశీలించి, నష్టాన్ని తగ్గించే శాస్త్రీయ సలహాలు అందించాలని తెలిపారు. ప్రతిరోజూ క్షేత్రస్థాయి పర్యటనలు, రైతులతో సమావేశాలు, సూచించిన నివారణ చర్యలపై నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.
సెల్ఫ్ ఎన్యూమరేషన్ వివరాల పరిశీలన
రైతులు సెల్ఫ్ ఎన్యూమరేషన్ యాప్లో నమోదు చేసిన వివరాలను క్షేత్రస్థాయిలో క్రాస్ వెరిఫై చేయాలని మంత్రి స్పష్టం చేశారు. రైతుల ఫిర్యాదులను పరిష్కరించడంతో పాటు సిబ్బంది కొరత ఉన్న ప్రాంతాలకు తుఫాను ప్రభావం లేని ప్రాంతాల నుంచి అదనపు సిబ్బందిని నియమించాలని ఆదేశించారు. నాలుగు శాఖల క్షేత్రస్థాయి సిబ్బంది సెలవులను రద్దు చేయాలని, అత్యవసర వైద్య కారణాల వంటి అనివార్య పరిస్థితుల్లో మాత్రమే మినహాయింపు ఇవ్వాలని సూచించారు.
నష్టాల అంచనాలో జాప్యం, సిబ్బంది కొరత వంటి సమస్యలను గుర్తించి నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అక్టోబర్ 30 సాయంత్రం సంబంధిత జిల్లా కలెక్టర్లతో ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. రైతులకు న్యాయం చేయడంతో పాటు పంటలను కాపాడటానికి అధికారులు, శాస్త్రవేత్తలు సమన్వయంతో పనిచేయాలని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.




