AP Weather: ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన!

AP Weather: ఏపీలోని ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాలకు ఆరెంజ్, విశాఖ, తిరుపతి, కడప, నంద్యాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ పిడుగులతో వర్షాలకు ప్రజలు అప్రమత్తం

Hari Kishan  AP Bureau Chief
Published on: 19 Sept 2026 10:44 AM IST
AP Weather
X

AP Weather: ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన!

AP Weather: ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాలకు వర్ష హెచ్చరికలు జారీ అయ్యాయి. రాగల మూడు గంటల్లో ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఆయా ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

ఇదే సమయంలో విశాఖపట్నం, తిరుపతి, వైఎస్సార్ కడప, నంద్యాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. విశాఖ, తిరుపతి ప్రాంతాలకు కూడా పిడుగులు, బలమైన ఉపరితల గాలులతో కూడిన వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తాజా హెచ్చరికల్లో పేర్కొంది.

ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు నమోదవుతున్నాయి. 17 నుంచి 18 సెప్టెంబర్ ఉదయం వరకు నమోదైన వర్షపాత వివరాల్లో మార్కాపురం, నెల్లూరు, ప్రకాశం, విశాఖపట్నం, నంద్యాల ప్రాంతాల్లో గణనీయమైన వర్షపాతం నమోదైంది. మార్కాపురం ప్రాంతంలోని కొన్ని మండలాల్లో 60 నుంచి 70 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైనట్లు ప్రభుత్వ వర్షపాత గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

పిడుగులు పడే సమయంలో ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. బయట ఉన్నవారు వెంటనే సురక్షిత భవనాల్లోకి వెళ్లాలి. చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగులు, బహిరంగ ప్రదేశాల్లో నిలబడకూడదు. రైతులు పొలాల్లో పనిచేసే సమయంలో ఉరుములు, మెరుపులు కనిపిస్తే సురక్షిత ప్రాంతానికి చేరుకోవాలని సూచించారు.

వాహనదారులు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భారీ వర్షం, ఈదురుగాలుల సమయంలో ప్రయాణాలను వీలైనంత వరకు వాయిదా వేసుకోవాలని, రహదారులపై నీరు నిలిచిన ప్రాంతాల్లో జాగ్రత్తగా వెళ్లాలని సూచించారు. **వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ, విపత్తుల నిర్వహణ సంస్థ, అధికారుల సూచనలు పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు...

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.