AP: ఏపీకి వర్ష గండం.. వాయుగుండంగా మారనున్న అల్పపీడనం, 3 రోజుల పాటు హెచ్చరిక!
AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారుతున్న నేపథ్యంలో ఏపీలో రానున్న 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
AP: ఏపీకి వర్ష గండం.. వాయుగుండంగా మారనున్న అల్పపీడనం, 3 రోజుల పాటు హెచ్చరిక!
AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరోసారి వర్ష సూచన జారీ అయ్యింది. ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న అండమాన్ సముద్ర ప్రాంతాల్లో సుస్పష్టమైన అల్పపీడనం ఏర్పడినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ అల్పపీడనం రాబోయే 12 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అంచనా వేసింది. అనంతరం మరింత బలపడి ఎల్లుండి సాయంత్రానికి ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికి సమీపంలోకి చేరే అవకాశముందని తెలిపింది.
ఈ వాతావరణ వ్యవస్థ ప్రభావంతో రాష్ట్రంలో రేపు సాయంత్రం నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశముందని పేర్కొంది. ఆయా ప్రాంతాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురవడంతో పాటు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని వివరించింది.
అల్పపీడనం క్రమంగా బలపడుతూ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు కదులుతున్న నేపథ్యంలో ప్రజలు వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వర్షాలు కురిసే సమయంలో అవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షపు నీరు నిలిచే ప్రాంతాలు, వాగులు, వంకలు, కాలువల వద్ద జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరించారు.
రైతులు కూడా వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వ్యవసాయ ఉత్పత్తులు, ధాన్యం, ఇతర పంట దిగుబడులను తడవకుండా సురక్షిత ప్రాంతాల్లో భద్రపరుచుకోవాలని సూచించారు. భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లో ప్రజలు అధికారుల సూచనలు పాటించాలని తెలిపారు.
ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ప్రజలకు అప్రమత్తత సూచనలు జారీ చేశారు. అల్పపీడనం కదలికలు, దాని తీవ్రతను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. వాతావరణ శాఖ, విపత్తుల నిర్వహణ సంస్థ నుంచి వచ్చే అధికారిక హెచ్చరికలను గమనిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశాల నేపథ్యంలో రానున్న మూడు రోజులు రాష్ట్రంలో వర్ష పరిస్థితులపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది.




