Vijayawada: ఏపీ వీఆర్ఏ సంఘం రాష్ట్ర నూతన కార్యవర్గ ఎన్నికలు!

Vijayawada: 2026-2029 కాలానికి ఏపీ వీఆర్ఏ సంఘం నూతన రాష్ట్ర కార్యవర్గ ఎన్నికల షెడ్యూల్ విడుదల. అక్టోబర్ 2న విజయవాడలో ఎన్నికలు, అదే రోజు ఫలితాలు వెల్లడి.

Hari Kishan  AP Bureau Chief
Published on: 24 Sept 2026 2:46 PM IST
Vijayawada
X

Vijayawada: ఏపీ వీఆర్ఏ సంఘం రాష్ట్ర నూతన కార్యవర్గ ఎన్నికలు!

Vijayawada: ఆంధ్రప్రదేశ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర నూతన కార్యవర్గం ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. 2026–2029 కాలానికి నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకోనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని 26 జిల్లాల ఎన్నికలు పూర్తయ్యాయని సంఘం తెలిపింది.

రాష్ట్ర సంఘం ప్రస్తుత కార్యవర్గం మూడేళ్ల పదవీకాలం ఈ ఏడాది జూలై 8తో పూర్తయింది. దీంతో నూతన రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటు కోసం ఎన్నికల ప్రక్రియ చేపట్టారు. ఎన్నికల అధికారిగా ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేబ్రోలు కృష్ణమూర్తిని, సహాయ ఎన్నికల అధికారిగా ఎన్టీఆర్ జిల్లా APRSA అధ్యక్షుడు బత్తిన రామకృష్ణను నియమించారు.

ఈ మేరకు ఎన్నికల అధికారి ఈ నెల 21న ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. రాష్ట్ర సంఘం కార్యవర్గంలోని అధ్యక్షుడు, అసోసియేట్ అధ్యక్షుడు, మహిళా ఉపాధ్యక్షురాలు, ప్రధాన కార్యదర్శి, మహిళా సంయుక్త కార్యదర్శి, మహిళా ఆర్గనైజింగ్ కార్యదర్శి, ప్రచార కార్యదర్శి, కోశాధికారి పోస్టులకు నేరుగా ఎన్నికలు నిర్వహించనున్నారు.

ఎన్నికల ప్రక్రియ అక్టోబర్ 2న విజయవాడ రెవెన్యూ భవన్‌లో జరగనుంది. ఉదయం 10 గంటలకు నామినేషన్ పత్రాల జారీతో ప్రక్రియ ప్రారంభమవుతుంది. అనంతరం నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, అభ్యర్థుల జాబితా ప్రచురణ, నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతుంది.

మధ్యాహ్నం 1.30 గంటలకు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. పోటీ ఉన్న పోస్టులకు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఎన్నికలు నిర్వహిస్తారు. అదే రోజు ఫలితాలను ప్రకటించడంతో పాటు నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించనున్నట్లు ఎన్నికల అధికారి చేబ్రోలు కృష్ణమూర్తి వెల్లడించారు.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.