Amaravati: మంగళగిరిలో ఘనంగా పోలీస్ జాగిలాల పాసింగ్ ఔట్ పరేడ్!

Amaravati: మంగళగిరి ఐఎస్‌డబ్ల్యూ కెనైన్ శిక్షణ కేంద్రంలో 36 పోలీస్ జాగిలాల 23వ బ్యాచ్‌ పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ ఘనంగా జరిగింది. హోంమంత్రి అనిత, డీజీపీ గుప్తా హాజరయ్యారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada
Published on: 30 Sept 2026 3:14 PM IST
Amaravati
X

Amaravati: మంగళగిరిలో ఘనంగా పోలీస్ జాగిలాల పాసింగ్ ఔట్ పరేడ్!

Amaravati: నేరాల ఛేదనలో ఆధునిక సాంకేతికత, ఫోరెన్సిక్‌ ఆధారాలతోపాటు పోలీస్‌ జాగిలాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. మంగళగిరిలోని 6వ బెటాలియన్‌ ఐఎస్‌డబ్ల్యూ కెనైన్ శిక్షణ కేంద్రంలో బుధవారం 23వ బ్యాచ్‌ కెనైన్, హ్యాండ్లర్ల పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ నిర్వహించారు. హోంమంత్రి శ్రీమతి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా, డీజీపీ శ్రీ హరీష్‌కుమార్‌ గుప్తా, ఐపీఎస్ గౌరవ అతిథిగా పాల్గొన్నారు.

23వ బ్యాచ్‌లో 36 జాగిలాలకు పది నెలలపాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చి విధులకు సిద్ధం చేశారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 218 జాగిలాలు పోలీసుశాఖకు సేవలందిస్తున్నాయని హోంమంత్రి శ్రీమతి వంగలపూడి అనిత తెలిపారు. గత రెండేళ్లలోనే సుమారు 78 జాగిలాలకు శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. మాదకద్రవ్యాలను ఎన్ని పొరలుగా ప్యాకింగ్‌ చేసినా వాసన ద్వారా గుర్తించే ప్రత్యేక సామర్థ్యం జాగిలాలకు ఉందన్నారు. నార్కోటిక్స్‌ కేసుల ఛేదన ద్వారా మాదకద్రవ్యాల బారిన పడే యువత భవిష్యత్తును కాపాడటంలోనూ అవి పరోక్షంగా సేవలందిస్తున్నాయని పేర్కొన్నారు.

గతంలో 22వ కెనైన్‌ పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌కు తాను హాజరైన విషయాన్ని గుర్తుచేశారు. అప్పుడు శిక్షణ పూర్తి చేసుకున్న జాగిలాలు క్షేత్రస్థాయిలో ఎలా పనిచేస్తాయనే ఆసక్తి ఉండేదని.. ప్రస్తుతం వివిధ కేసుల్లో అవి సాధిస్తున్న ఫలితాలే అందుకు సమాధానమని పేర్కొన్నారు.

నేరం చేసిన వారు తప్పించుకోకూడదు..

రాష్ట్రంలో శాంతిభద్రతలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని హోంమంత్రి తెలిపారు. నేరాల నియంత్రణకు కనిపించే (విజిబుల్) పోలీసింగ్‌తో పాటు కనిపించని (ఇన్విజిబుల్) పోలీసింగ్‌, సాంకేతిక పరిజ్ఞానం, ఫోరెన్సిక్‌ సేవలు, కెనైన్‌ విభాగం కూడా అంతే ముఖ్యమన్నారు. దర్యాప్తు పకడ్బందీగా జరగాలని, నేరం చేసిన వారు తప్పించుకునే అవకాశం ఉండకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. నిందితులకు చట్టప్రకారం శిక్ష పడేలా దర్యాప్తు నివేదికలు, ఫోరెన్సిక్‌ నివేదికలు, ఇతర శాస్త్రీయ ఆధారాలను సకాలంలో సమకూర్చాల్సిన అవసరం ఉందన్నారు. అందులో భాగంగానే కెనైన్‌ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు.

‘డాగ్‌ స్క్వాడ్‌ వచ్చిందా?’

హత్య, దొంగతనం వంటి ఘటనలు జరిగినప్పుడు ప్రజలు పోలీసులను అడిగే ప్రశ్నల్లో ‘డాగ్‌ స్క్వాడ్‌ వచ్చిందా?’ అనేది కూడా ఒకటని అనిత పేర్కొన్నారు. కెనైన్‌ విభాగంపై ప్రజలకు ఉన్న నమ్మకానికి ఇదే నిదర్శనమన్నారు.

సంఘటనా స్థలానికి ఫోరెన్సిక్‌, క్లూస్‌ టీమ్‌లతో పాటు డాగ్‌ స్క్వాడ్‌ చేరుకుంటే దర్యాప్తు సమగ్రంగా జరుగుతోందన్న విశ్వాసం ప్రజల్లో కలుగుతుందన్నారు. సాంకేతిక పరిజ్ఞానానికీ కొన్ని పరిమితులు ఉంటాయని చెప్పారు. సాంకేతిక, ఫోరెన్సిక్‌ ఆధారాలతో ముందుకు వెళ్లలేని సందర్భాల్లో జాగిలాలే దర్యాప్తునకు కొత్త దారి చూపగలవని పేర్కొన్నారు.

జాగిలాలను సొంత బిడ్డల్లా చూసుకుంటూ వాటి ఆరోగ్యం, ఆహారం, శిక్షణపై నిరంతరం శ్రద్ధ చూపుతున్న హ్యాండ్లర్లను హోంమంత్రి అభినందించారు. మంగళగిరిలోని జాగిలాల శిక్షణ కేంద్రాన్ని మరింత బలోపేతం చేసి, వివిధ జాతులకు చెందిన మరిన్ని జాగిలాలకు ప్రత్యేక నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వాలని సూచించారు.

ఒక్కో జాగిలానికి రెండు నైపుణ్యాలు: డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా..

ఈ సందర్భంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ..పోలీసింగ్‌లో జాగిలాలు అత్యంత విశ్వసనీయ సహచరులుగా మారాయని అన్నారు. సుమారు 5 వేల ఏళ్లుగా జాగిలాలు మానవులకు సహచరులుగా ఉంటూ వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్నాయని పేర్కొన్నారు.

ప్రస్తుతం పోలీసింగ్‌ మరింత సంక్లిష్టంగా మారిన నేపథ్యంలో జాగిలాల సహకారం ఎంతో అవసరమన్నారు.

రాష్ట్ర పోలీసుశాఖలో సాంకేతిక, వ్యూహాత్మక, ప్రత్యేక పోలీసింగ్‌ సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తూ 36 జాగిలాలు, వాటి హ్యాండ్లర్లు సేవల్లోకి అడుగుపెడుతున్నారని డీజీపీ తెలిపారు. మారుతున్న నేరాల తీరు, అంతర్గత భద్రత అవసరాలకు అనుగుణంగా జాగిలాలకు రెండు నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు.

23వ బ్యాచ్‌లో 13 జాగిలాలకు పేలుడు పదార్థాల గుర్తింపు-ట్రాకింగ్‌, మరో 13 జాగిలాలకు మాదకద్రవ్యాల గుర్తింపు-ట్రాకింగ్‌లో ద్వంద్వ శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఏడు జాగిలాలకు పేలుడు పదార్థాల గుర్తింపు, రెండింటికి క్యాడవర్‌ డిటెక్షన్‌తోపాటు సెర్చ్‌ అండ్‌ రెస్క్యూ (SAR), ఒక జాగిలానికి అసాల్ట్‌తోపాటు పేలుడు పదార్థాల గుర్తింపులో ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు వివరించారు.

ఎస్‌డీఆర్‌ఎఫ్‌లో తొలిసారిగా..

క్యాడవర్‌ డిటెక్షన్‌, సెర్చ్‌ అండ్‌ రెస్క్యూ విభాగాల్లో శిక్షణ పొందిన జాగిలాలను ఏపీ రాష్ట్ర విపత్తు స్పందన దళం (SDRF)లో తొలిసారిగా ప్రవేశపెడుతున్నట్లు డీజీపీ వెల్లడించారు. ఒకే జాగిలానికి రెండు విభాగాల్లో శిక్షణ ఇచ్చే విధానం విపత్తుల సమయంలో గల్లంతైన వారిని గుర్తించడం, సహాయక చర్యలను వేగంగా చేపట్టడంలో ఉపయోగపడుతుందన్నారు.

బెంగళూరులోని తరాలు సీఆర్‌పీఎఫ్‌ డాగ్‌ బ్రీడింగ్‌ అండ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌తో సమన్వయం చేసుకుని హ్యాండ్లర్లు, శిక్షణ సిబ్బందికి అధునాతన విధానాల్లో శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. అంతర్గత భద్రత అవసరాలకు అనుగుణంగా బెల్జియన్‌ మాలినోయిస్‌, డచ్‌ షెపర్డ్‌ జాతి జాగిలాలను ద్వంద్వ విధుల కోసం ప్రవేశపెట్టినట్లు చెప్పారు.

22వ బ్యాచ్‌తో 97 కేసుల్లో ఫలితాలు..

పది నెలల క్రితం 19 యూనిట్లలో నియమించిన 22వ బ్యాచ్‌ జాగిలాలు ఇప్పటికే 97 కేసుల్లో ఫలితాలు సాధించాయని డీజీపీ తెలిపారు. వాటి సహాయంతో 52 మాదకద్రవ్యాలు, గంజాయి కేసులు, 29 హత్యలు, హింసాత్మక నేరాలు, 10 దోపిడీ, దొంగతనం కేసుల్లో పురోగతి సాధించడంతోపాటు తప్పిపోయిన ఆరుగురు చిన్నారులను గుర్తించి కుటుంబాలకు చేర్చినట్లు వివరించారు.

ఒకే జాగిలానికి ట్రాకింగ్‌తోపాటు పేలుడు పదార్థాలు లేదా మాదకద్రవ్యాల గుర్తింపులో శిక్షణ ఇవ్వడం వల్ల వ్యయం, మానవ వనరుల వినియోగం తగ్గడంతోపాటు దర్యాప్తులో స్పందన సమయం కూడా తగ్గుతుందని పేర్కొన్నారు.

జాగిలం-హ్యాండ్లర్‌ విడదీయరాని బృందం...

జాగిలం, హ్యాండ్లర్‌ విడదీయరాని బృందమని డీజీపీ పేర్కొన్నారు. జాగిలాల విశ్వాసం, నిబద్ధతకు అనుగుణంగా హ్యాండ్లర్లు బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. విధుల్లో చేరుతున్న 36 జాగిలాలు, వాటి హ్యాండ్లర్లను అభినందిస్తూ సమగ్రత, ధైర్యం, అప్రమత్తతతో పోలీసుశాఖకు సేవలందించాలని పిలుపునిచ్చారు. పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌లో శిక్షణ పొందిన జాగిలాలు, హ్యాండ్లర్లు తమ నైపుణ్యాలను ప్రదర్శించారు. శిక్షణలో వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరచిన జాగిలాలకు హోంమంత్రి అనిత బహుమతి ప్రధానం చేశారు.

ఈ కార్యక్రమంలో సీఐడీ విభాగాధిపతి శ్రీ రవిశంకర్ అయ్యనార్, ఏసీబీ చీఫ్ శ్రీ అతుల్ సింగ్, నిఘా విభాగాధిపతి శ్రీ మహేష్ చంద్ర లడ్డా, అదనపు డీజీపీ (శాంతిభద్రతలు) శ్రీ ఎన్. మధుసూదన రెడ్డి, ఐజీపీలు శ్రీమతి బి. రాజకుమారి, శ్రీ కాంతిరాణా టాటా, శ్రీ కె.వి. మోహన్‌రావు, ఎస్పీ కె. ఆరిఫ్ హఫీజ్ IPS పలువురు సీనియర్ పోలీసు అధికారులు, ISW సిబ్బంది, డాక్టర్ ప్రతాప్ సూరపనేని, వెటర్నరీ సర్జన్ తదితరులు పాల్గొన్నారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

మీడియా రంగంలో 28 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంతో, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను క్షుణ్ణంగా విశ్లేషించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.