ప్రకృతి సేద్యంలో దేశానికే ఏపీ ఆదర్శం.. 25 లక్షల మంది రైతులను ప్రోత్సహిస్తాం..
Amaravati: ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి వ్యవసాయంతో రైతుల నికర ఆదాయం 47% పెరిగిందని సీఎం చంద్రబాబు తెలిపారు. 25 లక్షల మంది రైతులకు విస్తరింపజేసేలా కార్యాచరణ.
ప్రకృతి సేద్యంలో దేశానికే ఏపీ ఆదర్శం.. 25 లక్షల మంది రైతులను ప్రోత్సహిస్తాం..
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి వ్యవసాయాన్ని మరింత విస్తృతం చేసి, దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 17.73 లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని, ఈ సంఖ్యను 25 లక్షలకు పెంచేలా ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు. ప్రకృతి వ్యవసాయం విస్తరణ, పీఎండీఎస్‌పై నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడు, రైతులు, కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.
2016లో కేవలం 40 వేల మంది రైతులతో ప్రారంభమైన ప్రకృతి వ్యవసాయం.. నేడు లక్షలాది మంది రైతులకు చేరడం విశేషమని సీఎం పేర్కొన్నారు. ఒకప్పుడు ప్రకృతి వ్యవసాయం విజయవంతం కాదంటూ కొందరు దుష్ప్రచారం చేశారని, అయితే రైతుల అనుభవాలు, ఫలితాలు ఆ అభిప్రాయాలను మార్చుతున్నాయని అన్నారు. రసాయన ఎరువుల వినియోగంతో భూసారం క్షీణించడంతో పాటు సాగు ఖర్చులు పెరిగి రైతులపై ఆర్థిక భారం పడుతోందని వివరించారు.
రసాయన ఎరువులతో చేసే సాగుతో పోలిస్తే ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతుల ఆదాయం 47 శాతం మేర పెరిగినట్లు సీఎం తెలిపారు. ప్రకృతి సేద్యంలో పత్తి పంట 96 శాతం, కందులు 87 శాతం మేర నికర ఆదాయాన్ని అందించినట్లు పేర్కొన్నారు. పెట్టుబడి వ్యయాన్ని తగ్గించి, రైతులకు మెరుగైన రాబడిని అందించడంలో ప్రకృతి వ్యవసాయం కీలకంగా మారుతోందన్నారు. ఏడాది పొడవునా ఆదాయ అవకాశాలతో పాటు పశుగ్రాసం, ఇతర వ్యవసాయ ఉత్పత్తులు కూడా లభిస్తాయని చెప్పారు.
ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకునేలా ప్రకృతి సేద్యం
ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో కరవు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయానికి మరింత ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు సూచించారు. భూమిలో తేమను కాపాడుకోవడం, పచ్చదనాన్ని పెంచడం ద్వారా ప్రతికూల వాతావరణ పరిస్థితులను కొంతవరకు ఎదుర్కోవచ్చన్నారు. చిన్నపాటి వర్షాలు కురిసినా పంటలను కాపాడుకునేందుకు ప్రకృతి సేద్యం దోహదపడుతుందని తెలిపారు.
అనంతపురం జిల్లాలో 10 లక్షల పంట కుంటలు తవ్వించడంతో పాటు చెక్‌డ్యామ్‌లు, ట్రెంచ్‌ల నిర్మాణం, స్థానిక నీటి వనరుల అనుసంధానంపై దృష్టి పెట్టినట్లు వివరించారు. నదుల అనుసంధానం ద్వారా నీటి లభ్యతను మెరుగుపరిస్తే, ఒక ఏడాది వర్షాలు సరిగా కురవకపోయినా వ్యవసాయ రంగంపై ప్రభావాన్ని తగ్గించవచ్చన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా 500 టీఎంసీల గోదావరి వరద జలాలను కృష్ణా డెల్టాకు తరలించి సద్వినియోగం చేసినట్లు గుర్తుచేశారు.
రసాయన ఎరువుల వినియోగం తగ్గింపుపై దృష్టి
2023-24కు ముందు సంవత్సరాలతో పోలిస్తే రాష్ట్రంలో రసాయన ఎరువుల వినియోగం ఆరు శాతం మేర తగ్గిందని సీఎం వెల్లడించారు. గత ఏడాదితో పోల్చినా మరో 2.28 శాతం తగ్గుదల నమోదైందన్నారు. ఎరువుల వినియోగాన్ని తగ్గించినందుకు కేంద్రం నుంచి రావాల్సిన రూ.218 కోట్ల ప్రోత్సాహకాలపై ఇప్పటికే లేఖ రాసినట్లు తెలిపారు. ప్రకృతి వ్యవసాయ విస్తరణకు కృషి చేసిన అధికారులు, రైతులు, కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లను అభినందించారు.
ప్రకృతి వ్యవసాయంలో గుజరాత్ కంటే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని ఇటీవల ప్రధాని మోదీ పేర్కొన్న విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న విధానాలను అధ్యయనం చేసేందుకు ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నారని తెలిపారు. ఈ నెల 15న నిర్వహించే సరస్ మేళాలోనూ ప్రకృతి వ్యవసాయ విధానాలను ప్రదర్శించనున్నట్లు చెప్పారు.
ప్రకృతి సేద్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు దేశీయ ఆవుల పెంపకాన్ని ప్రోత్సహించి, కషాయాలు, జీవామృతం తయారీకి అవసరమైన వసతులు కల్పించేలా గోకులాలను నిర్మించాలని సీఎం సూచించారు. నిరంతర అవగాహన, రైతులకు ప్రోత్సాహం, నీటి వనరుల అభివృద్ధితో ప్రకృతి వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.




